"నార్త్ ఇండియన్స్ చైనీస్‌లా.. సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లా ..": శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Sam Pitroda: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తన పార్టీని ఇరుకున పెట్టారు. ఈ సారి ఏకంగా భారత దేశ వైవిధ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారు.
Sam Pitroda: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా .. భారతదేశంలో వారసత్వ పన్ను తీసుకరావాలంటూ..సంచలన వ్యాఖ్యలు చేసిన వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ వివాదం మరిచిపోక ముందే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ సారి భారత దేశ వైవిధ్యంపై వివాదాస్పదంగా మాట్లాడి తన పార్టీని ఇరుకున పెట్టారు.
ఇంతకీ ఏమన్నారు?
తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా భారతదేశ పరిస్థితులు, వైవిధ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైవిధ్యం గల భారతదేశాన్ని కలిపి ఉంచగలం తమతోనే సాధ్యమవుతుందని పిట్రోడా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో భారతదేశంలోని తూర్పులో ప్రజలు చైనీయులలాగా, పశ్చిమంలోని ప్రజలు అరబ్బులలాగా, ఉత్తరాదిలో ప్రజలు తెల్లవారిలాగా, ఇక దక్షిణాదిలో ప్రజలు ఆఫ్రికన్లలాగా కనిపిస్తారని అన్నారు. 70 ఏళ్లుగా మన దేశపు గుర్తింపు ఇదేనంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు.
పిట్రోడా ఇంకా మాట్లాడుతూ.. మన ముందున్న చాలా సమస్యలున్నాయనీ, అందులో నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు-భద్రత, తర్వాత రామమందిరం, రామనవమి, హనుమాన్, బజరంగ్ దళ్ మొదలైన కొన్ని సమస్యలు వచ్చాయి. అంతకు ముందు తాము డెబ్బై ఏళ్లపాటు భారత్‌కు మంచి పాలనను అందించామని అన్నారు. తమన ప్రభుత్వంలో ప్రకాశించే భారతదేశంగా ప్రపంచం ముందు ఆవిర్భవించామనీ, భిన్నత్వంలో ఏకత్వానికి ఇదే ఉదాహరణ అన్నారు. అన్ని రకాల భిన్నత్వం ఉన్నప్పటికీ దేశమంతటా ఏకత్వం కనిపించిందని అన్నారు.
శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇటీవల దేశ సంపద పంపిణీ, వారస్వత ఆస్తి పన్నుపై కూడాసంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సంపద స్వాధీనం’పై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. "అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది.
ఎవరికైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంటే.. అతను చనిపోయినప్పుడు అతను తన పిల్లలకు 45 శాతం మాత్రమే బదిలీ అవుతుంది" అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. "55 శాతం ఆస్తిని ప్రభుత్వమే లాక్కుంటుంది. ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు సంపదను సృష్టించి, ఇప్పుడు మీరు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం. ఇదే న్యాయమైన చట్టం." అని పేర్కొన్నారు.