లక్నో: ఉత్తరప్రదేశఅ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలోనే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుది. ఓ దళిత బాలికను ఎత్తుకెళ్లి ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు 

ఆ తర్వాత కాళ్లూ చేతులూ కట్టేసి ఓ నర్సరీ వద్ద బాలికను పడేసి వెళ్లిపోయారు. ఆ అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్రకూట్ నగరం కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగింది. అక్టోబర్ 8వ తేదీన ఇంటి సమీపంలోని బహిర్భూమికి వెళ్లన బాలికను గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 

ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి, నర్సరీ వద్ద పడేసి వెళ్లారు.తన కూతురిని టూవీలర్ మీద తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, చిత్రహింసలు పెట్టారని బాలిక తల్లి తెలిపింది. ఇంటి సమీపంలోని ఓ నర్సరీ వద్ద కాళ్లూ, చేతులూ కట్టేసి పడి ఉన్న తన కూతురిని ఇంటికి తెచ్చుకున్నామని, నిందితులు ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నించామని ఆమె అన్నది. 

తీవ్ర ఆవేదనకు, చిత్రహింసలకు గురైన తమ కూతురు దుండగుల పేర్లు చెప్పలేకపోయిందని ఆమె చెప్పింది. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని అన్నది.

ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు గల కారణాలను మృతురాలి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నామని చిత్రకూట్ ఏఎస్పీ ప్రకాశ్ స్వరూప్ తెలిపారు.