మోదీ ఇంత ఎమోషనలా..! తల్లిని తలచుకుని గద్గద స్వరంలో మాట్లాడుతుంటే మనకూ కన్నీళ్లు ఆగవు...
ప్రధాని నరేంద్ర మోదీ కన్నతల్లి హీరాబెన్ ను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి లేకుండా మొదటిసారి ఎన్నికలకు వెళుతున్నానంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై విరుచుకుపడుతుంటే చూసుంటారు... అధికారులతో ప్రొఫెషనల్ గా మాట్లాడుతుంటే చూసుంటారు... తనకంటే పెద్దవాళ్లతో గౌరవంగా, చిన్నవాళ్లతో ప్రేమగా వుండటం చూసుంటారు... అప్పుడప్పుడు కఠువుగా, ఎక్కువగా సౌమ్యంగా, ప్రశాంతంగా వుండటం చూస్తుంటాం. కానీ ఆయన ఎమోషనల్ కావడం ఎప్పుడైనా చూసారా..? కానీ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇంటర్వ్యూలో తల్లిని తలచుకుని ప్రధాని మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారు. గద్గదస్వరంతో ఆయన మాట్లాడటం చూస్తుంటే మనమూ భావోద్వేగానికి గురవుతాం.
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరా బేన్ 2022 డిసెంబర్ 30న మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతిసారి తల్లికి పాదాభివందనం చేసుకుని నామినేషన్ వేయడానికి వెళుతుంటారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా అసెంబ్లీకి పోటీచేసినా, దేశ ప్రధానిగా ఇప్పుడు లోక్ సభకు పోటీ చేస్తున్నా తల్లిని కలవకుండా... ఆమె కాళ్లు మొక్కకుండా నామినేషన్ వేసింది లేదు. కానీ ఈసారి మాత్రం తల్లి లేకుండానే నామినేషన్ వేయాల్సి వస్తుండటంతో ప్రధాని మోదీ ఎమోషన్ అయ్యారు. తల్లిని ఎంతలా మిస్ అవుతున్నారో ఆయన భావోద్వేగభరిత మాటలే చెబుతున్నాయి.
చిన్నప్పటి నుండి కూడా తన తల్లి కోరిక ఏదీ నెరవేర్చలేదంటూ ప్రధాని మోదీ చాలా బాధపడ్డారు. చిన్నతనంలోనే ఇంటినుండి పారిపోయానని... ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా వుండటంతో తల్లికి దూరంగా వున్నానని తెలిపారు. తాను మంచి కొడుకుగా వుండలేకపోయానంటూ ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు.
అయితే బిజెపి పెద్దలు గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్లాలని చెప్పగానే తనకంటే తల్లి ఎక్కువగా సంతోషించిందని... ఎందుకంటే ఇకపై కొడుకు తనదగ్గర వుంటాడన్నది ఆమె ఆనందంగా ప్రధాని పేర్కొన్నారు. డిల్లీ నుండి గుజరాత్ కు వెళ్లగానే ముందుగా తల్లిని కలిసానని అన్నారు. ఈ సమయంలోనే ఆమె తనకు రెండు మాటలు చెప్పింది... పేదల గురించి ఆలోచించాలి... లంచం తీసుకోవద్దు.. అని తల్లి చెప్పిందన్నారు. తల్లికి పాదాభివందనం చేసి మొదటిసారి నామినేషన్ వేసాను... ఆ తర్వాత కూడా ప్రతిసారి తల్లి ఆశీర్వాదం తీసుకునే ఎన్నికలకు వెళుతున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయిన ప్రధాని... ఆ తర్వాత తనను తాను సముదాయించుకున్నారు. తల్లి లేని లోటు వుంది... కానీ కోట్లాది మంది తల్లులు ప్రేమ తనకు దక్కుతోందని అన్నారు. గంగా మాత ఆశిస్సులు కూడా తనకు వున్నాయన్నారు. ఇలా తల్లి గురించి తలచుకుని ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు.