Asianet News TeluguAsianet News Telugu

బిహార్‌లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. నితీశ్ కీలక సమావేశం.. అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?

బిహార్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. బీజేపీ‌తో తెగదెంపులు చేసుకునేందుకు రెడీ అయిందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కావడం ప్రాధాన్యతం సంతరించుకుంది. 

Bihar political crisis Nitish Kumar meets JDu mps and mlas
Author
First Published Aug 9, 2022, 12:12 PM IST

బిహార్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. బీజేపీ‌తో తెగదెంపులు చేసుకునేందుకు రెడీ అయిందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కావడం ప్రాధాన్యతం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం నితీశ్ కుమర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పాట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు. రబ్రీ దేవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యే ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను మీటింగ్ రూమ్‌కు బయటే ఉంచుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి చేరుకుంటున్నారు. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు వస్తే.. నితీశ్ కుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ఆర్జేడీ, కాంగ్రెస్‌ల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.  చిన్న పార్టీలైన హిందుస్థాన్ అవామ్ మోర్చా, సీపీఐఎంఎల్ కూడా నితీష్ కుమార్‌కు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యయి. 

2013లో నరేంద్ర మోదీని ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తీరుపై నితీశ్ కుమార్ అసంతృప్తి ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు నితీశ్ కుమార్ రెండేళ్ల తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూటమిగా బిహార్‌లో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలానికి ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్ కుమార్.. బీజేపీతో చేతులు కలిపారు.  అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. కేంద్ర మంత్రివర్గంలో ఆర్జేడీ నుంచి ఒక్కరికే అవకాశం ఇస్తామనడంపై నితీశ్ కుమార్ అసంతృప్తి చెందారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి బరిలో నిలిచాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ఆ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన  మెజారిటీని సాధించలేకపోయింది. అక్కడ బీజేపీ, జేడీయూల ప్రభుత్వం ఏర్పడింది. 

అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్‌కు బీజేపీ మద్దతు ఇచ్చిందని.. జేడీయూకు వ్యతిరేకంగా ఓట్లను విభజించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే జేడీయూ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా చిరాగ్ పార్టీ అభ్యర్థులను నిలిపిందని నితీశ్ కుమార్ బలంగా నమ్ముతున్నారు. దీంతో అప్పటి నుంచి బీజేపీ, జేడీయూల మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. 

ఇక, 2021లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో.. ఆర్సీపీ సింగ్‌కు బీజేపీ మంత్రి పదవి ఇవ్వడం నితీశ్ కుమార్‌కు నచ్చలేదు. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలగడం వల్లే కేంద్రం మంత్రి పదవి ఇచ్చిందని.. ఇది రాష్ట్రంలో తనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నితీశ్ కుమార్ భావించారు. ఈ క్రమంలోనే ఆర్సీపీ సింగ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించడానికి నీతీశ్‌ నిరాకరించారు. దీంతో  ఆర్సీపీ సింగ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

అయితే మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసకున్న ఏక్‌నాథ్ షిండే వ్యవహారం.. నితీశ్ కుమార్‌ను కలవరానికి గురిచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బీహార్‌లో కూడా ఇదే విధమైన సంఘటనలు జరుగుతాయమోనని నితీశ్ కుమార్ ఆందోళన చెందుతున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘‘బీజేపీ మాత్రమే మిగిలి పోతుంది.. ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయి’’ అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చేసిన ప్రకటనను జేడీయూ ఖండించింది.

మరోవైపు ఆర్సీపీ సింగ్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని జేడీయూ నోటీసులు జారీచయగా.. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. జేడీయూ ఓ మునిగిపోతున్న నావ అని మండిపడ్డారు. ఇక, ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి నీతీశ్‌ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన బీజేపీకి దూరం జరుగుతున్నారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే సోనియా గాంధీతో నితీశ్ ఫోన్‌లో మాట్లాడారని సమాచారం. నేపథ్యంలో త్వరలోనే బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కలయికతో మహాకూటమి ఏర్పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు నితీశ్‌ను బుజ్జగించేందుకు అమిత్ షా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. 

బిహార్ అసెంబ్లీలో బలబలాలు.. 
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే.. 122 మెజారిటీ మార్క్‌ను సాధించాల్సి ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో గెలుపొంది. కూటమిలోని బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు, వికాస్‌హీల్ ఇన్‌సాన్ పార్టీ 4 స్థానాలు, హిందుస్తాన్ అవామ్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు ఆర్జేడీ, దాని మిత్ర పక్షలు.. 110 స్థానాలు సాధించాయి. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా  నిలిచింది. అయితే కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో, వామపక్షాలు 16 స్థానాల్లో విజయం సాదించాయి. 

ఇక, ఆ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ‌కి చెందిన ఎంఐఎం నుంచి ఐదుగురు విజయం సాధించగా.. అందులో నలుగురు ఇటీవల ఆర్జేడీ గూటికి చేరారు. ఇక, చిరాజ్ పాశ్వాన్‌ లోక్‌ జనశక్తి పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ జట్టుగా ఏర్పడితే 140కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండే అవకాశం ఉంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios