‘ఆకాశవాణి’ రివ్యూ
రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ‘సోనీ లివ్’లో ఈరోజు నుంచి (ఈ నెల 24 నుంచి) స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
తన ప్రతిభతో సిని ప్రపంచాన్ని ఏలుతున్న రాజమౌళి శిష్యులు వరసగా బయిటకు వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఆయన శిష్యుల సినిమాలంటే ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఎందుకనో కానీ ఎవరూ వాటిని రీచ్ కాలేకపోయారు. ఒక్కరూ సక్సెస్ ఇవ్వలేకపోయారు. తాజాగా ఆయన మరో శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆకాశవాణి’. శుక్రవారం నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది. రాజమౌళి శిష్యుడు ఈ సారైనా హిట్ కొట్టారా, అసలు ఈ చిత్రం కథేంటి,సముద్ర ఖని చేసిన పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
నాగరిక ప్రపంచానికి సుదూరంగా కొండకోనల మధ్యలో ఓ గూడెం. బాహుబలిలో గూడెం టైప్ అన్నమాట. వాళ్లవెరో బయిట ప్రపంచానికి తెలియదు. అలాగే వాళ్లకు బయిట ప్రపంచం గురించి తెలియదు. దాంతో ఎవరి ప్రపంచంలో వాళ్లు గుట్టుగా బ్రతికేస్తున్నారు. అలాంటి చోట అప్రజాస్వామిక ధోరణులు ప్రబలటంతో వింతేముంది. అక్కడ వారందరికీ దొర (వినయ్ వర్మ) మాట అంటే దైవాజ్ఞ. తనని,తన మాటని,తన ఊరుని ఆ గూడెం జనం దాటకుండా కట్టుదిట్టంగా అన్ని వైపులా దారులు మూసేస్తూంటాడు. వాళ్లు నోరు కూడా పనిలో పనిగా మూసేసే మంచి పోగ్రామ్ లు అమలు చేస్తూంటాడు. ఈలోగా ఆ గూడెం జనాల మధ్యలోకి ఓ రేడియో వచ్చి చేరుతుంది. ఓ పిల్లాడికి దొరికిన ఆ రేడియో అంటే ఏమిటో,అసలు అది ఎందుకు పనిచేస్తుందో కూడా వాళ్ళవరకీ తెలియదు. అర్దం కాదు. దాంతో ఆ రేడియో వల్ల వాళ్ల గూడెంలో అల్లకల్లోలం చెలరేగుతుంది. అది అక్కడ దేవుడై సెటిలవుతుంది. దానికి చంద్రం మాస్టర్ (సముతిర కని) సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడు తనకన్నా మరో దేవుడు అక్కడ సెటిలవటం ఇష్టం లేని దొర ఏం చేసాడు..ఏ నిర్ణయం తీసుకున్నాడు. ఆ రేడియో వల్ల ఆ గూడెంలో వచ్చిన మార్పులు ఏమిటనేది మిగతా కథ.
ఎలా ఉంది
1980లో The Gods Must Be Crazy అనే ఆఫ్రికన్ సినిమా ఒకటి రిలీజ్ అయ్యి ప్రపంచాన్ని ఊపేసింది. ఒక జనరేషన్ మొత్తం దాన్ని చూసేసి మెచ్చేసుకుంది. ఇంగ్లీష్ సినిమాలను ఇంగ్లీష్ ముద్దులు కోసం చూసే రోజుల్లో ఈ సినిమా తెలుగులో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలో పాయింట్ ఓ కోకోకోలా బాటిల్ వచ్చి నాగరిక ప్రపంచానికి సంభందం లేని ఓ గూడెం మధ్యలో పడితే పండే ఫన్. దాన్నే రేడీయో గా మార్చి, సీరియస్ గా చేసారు. ఓ ఐడియాని మార్చుకుని మనకు అనుకూలంగా చేసి అలరించటంతో తప్పేమీ లేదు. సరిగ్గా సెట్ అయ్యితే చూసే వాడికి ఆనందమే. అయితే ఈ సినిమా ని ఫక్తు తెలుగు సినిమాలా మార్చే క్రమంలో అల్లిన కథ కాస్త ఇబ్బందిగానే ఉందనిపిస్తుంది. అసలు ఈ రోజుల్లో ఇలాంటి జనం ఉన్నారు..రేడియో అంటే తెలియనివాళ్లు అంటేనే కథ మన బుర్రకు ఎక్కుతుంది. రేడియో చుట్టూ ఫన్ చేస్తే ఎలా ఉండేదో కానీ.. ఓ దొర అతని దాష్టికం, మౌనంగా భరించే జనం ఇవి సినిమాకు రొటీనెస్ ని తెచ్చేసాయి. అయితే రేడియోను దేవుడిగా భావించే వాళ్లకి హిరణ్యకశ్యప – ప్రహ్లాద పౌరాణిక గాథగాథ ద్వారా వాస్తవాన్ని తెలియచెప్పడం బాగుంది. దాన్ని విలన్ చావుకు ముడి పెట్టడం నచ్చుతుంది. అయితే స్లో నేరేషన్, క్యారక్టర్స్ ఇంట్రడక్షన్, స్టోరీ సెటప్ కే ఎక్కువ సమయం తీసుకోవటం జరిగింది. స్టార్స్ ఉన్న సినిమాలో అయితే తెరపై స్టార్స్ కనపడుతూంటారు కాబట్టి సెటప్ కాస్త ఆలస్యమైనా ఎగ్రీ చేసేస్తాం. కానీ ఇలాంటి సినిమాల్లోకి ఎంత స్పీడుగా కథలోకు వెళ్లితే అంత మంచింది. ఇక్కడ అది జరగలేదు.
గూడెంలోకి రేడియో వచ్చేదాకా కథ కదలదు. మనం కూడా దేవుడా ఏదో ఒకటి చేయి బోర్ వచ్చేస్తోంది అని ఫీలయ్యే లా చేసి అప్పుడు దేవుడులా రేడియోని పంపించాలని డైరక్టర్ థాట్ కావచ్చు. దాంతో ఫస్టాఫ్ బోర్ వచ్చేసింది. అంతేకాకుండా చాలా మంది కొత్తవారు కావటంతో వాళ్లందరినీ గుర్తు పెట్టుకోవటం కష్టం. ఇవన్నీ ప్రక్కన పెడితే రాజమౌళి తరహా ఎలివేషన్ సీన్స్ రాసుకున్నా, కమర్షియల్ యాస్పెక్ట్ ఎక్కడా కనపడదు. ఇలాంటి కల్పన తో కూడిన కథలకు వాస్తవమైన టచ్ ఇవ్వటం కత్తి మీద సామే. చాలా జాగ్ర్తత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది.
టెక్నికల్ గా...
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకుని,రాజమౌళి శిష్యుడుగా పేరు తెచ్చుకున్న అశ్విన్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ.స్క్రిప్టు విషయంలో,ట్రీట్మెంట్ విషయంలో సరిగ్గా కుదరని ఈ సినిమాకు డైరక్టర్ గా మాత్రం అశ్విన్ గంగరాజు చాలా వరకూ న్యాయం చేసారు. ఆయనకు తను రాసుకున్న స్క్రిప్టే రివర్స్ అయ్యింది. సహకరించలేదు. ఇక మ్యూజిక్ డైరక్టర్ గా కాలభైరవ అందించిన సంగీతం బాగుంది. ‘మన కోన…’ అనే పాటబాగుంది. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా కలిసి వచ్చింది. సీన్స్ అన్ని చాలా సహజంగా ఉండేలా ప్రయత్నం చేసారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ అయినా ఆ స్దాయి వర్క ఏమీ కనపడలేదు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు. మాట్లాడేస్తున్నారు అనిపించింది. అయితే దేవుడు గురించి చెప్పించిన డైలాగుల్లో మంచి డెప్త్ ఉంది. నిర్మాత పద్మనాభ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో..
గిడ్డడుగా నటించిన మాస్టర్ ప్రశాంత్ ,అతని తండ్రిగా మైమ్ మధు బాగా చేసారు. ఇప్పటికే ‘దొరసాని’లో చేసిన దొర పాత్రనే వినయ్ వర్మ కంటిన్యూ చేసారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో కులపెద్దగా చేసిన ఆయన ఈ సినిమాలో గూడెం పూజారిగా బాగా చేసారు. గెటప్ శ్రీను జస్ట ఓకే. అలానే సముద్ర ఖని లుక్ బాగుంది కానీ, పెద్ద ఇంపాక్ట్ గా లేదు.
ఫైనల్ థాట్
అది The Gods Must Be Crazy..ఇది The script May Be Lazy
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
ఎవరెవరు..
బ్యానర్: ఏయు అండ్ ఐ స్టూడియోస్
నటీనటులు: సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ తదితరులు
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: మోహన్
నిర్మాత: పద్మనాభరెడ్డి
రచన, దర్శకత్వం: అశ్విన్ గంగరాజు
రన్ టైమ్:2 గంటల 12 నిమషాలు
ఓటీటి: సోనీ లివ్