`కథ వెనుక కథ` ఓటీటీ రివ్యూ.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

ఓటీటీలో మంచి సినిమాలకు డిమాండ్‌ బాగానే ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ కి మరింత ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు `కథ వెనుక కథ` కూడా ఓటీటీలో రచ్చ చేస్తుంది.  ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

katha venuka katha movie getting best  views in ott arj

సస్పెన్స్ క్రైమ్స్ థ్రిల్లర్‌ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. కాలంతో, ట్రెండ్స్ తో సంబంధం లేకుండా ఆదరణ పొందుతుంటాయి. ట్విస్ట్ లు, థ్రిల్‌ ఎలిమెంట్లు వర్కౌట్‌ అయితే ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయినట్టే. స్క్రీన్‌ ప్లే మెయిన్‌గా సాగే ఈ మూవీస్‌కి తెలుగు ఆడియెన్స్ ఇటీవల బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అలాంటి కంటెంట్‌తో వచ్చిన `కథ వెనుక కథ` అనే మూవీ ఓటీటీలో రచ్చ చేస్తుంది. యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, సునీల్, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించారు. అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
సినిమా దర్శకుడు కావాలనుకొనే అశ్విన్ (విశ్వాంత్ దుడ్డుంపూడి) తన మేనమామ కూతురు శైలజను ప్రేమిస్తుంటాడు. పెళ్లి చేసుకోవాలని తన కోరికను మేనమామతో చెప్పినప్పుడు జీవితంలో ఏదైనా సాధించి రా.. నా అమ్మాయిని ఇస్తానని అంటాడు. ఆ క్రమంలో కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానికి కథ చెప్పగానే సినిమా తీయడానికి ముందుకొస్తాడు. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోషన్స్‌కు డబ్బులు లేవని నిర్మాత చేతులెత్తేస్తాడు. దీంతో తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి అశ్విన్ ఒక అదిరిపోయే స్కెచ్‌ వేస్తాడు. అయితే అనూహ్యంగా తన సినిమాల్లో నటించిన హీరోయిన్‌ అమృత, అలాగే నటుడు రాజు కనిపించకుండా పోతారు. ఒక్కొక్కరు చనిపోతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్‌ చేసేందుకు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్య(సునీల్‌) రంగంలోకి దిగుతాడు. మరి ఆయన విచారణలో ఏం తేలింది, హీరోయిన్‌ మిస్సింగ్‌కి కారణమేంటి? సినిమాలో పనిచేసిన వారే ఎందుకు మిస్‌ అవుతున్నారు? ఎస్‌ఐలోని మరో యాంగిల్‌ ఏంటి? చివరికి ఎలాంటి ట్విస్టులు, టర్న్ లు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ.  

విశ్లేషణః 
యంగ్‌ మేకర్స్ కి, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలు అనేది సేఫ్‌ గేమ్‌. కరెక్ట్ గా ప్లాన్‌ చేస్తే హిట్‌ పక్కా. ఈ మూవీ దర్శకులు కూడా దాన్నే నమ్ముకుని `కథ వెనుక కథ` సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఒక క్రైమ్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. సిటీలో అమ్మాయిలు మిస్ అవ్వడం, ఎంక్వయిరీ కోసం స్పెషల్ ఆఫీసర్ రావడం, దర్శకుడు కావాలనే ప్రయత్నాలు చేసే హీరోకి సినిమా అవకాశం రావడం, దాంతో పాటే సమస్యలు చుట్టుముట్టడం, ఒక వైపు ఎంక్వయిరీ, మరో వైపు క్రైమ్ జరగడం, ఇలా వరుస సస్పెన్స్ క్రైమ్ సీక్వెన్స్ లతోనే సినిమా  సాగుతుంది. కథనంలో చాలా ప్రశ్నలు ప్రేక్షకుడుకి వదిలేసి, హీరో దర్శకత్వం చేస్తున్న సినిమాకి సంబంధించి ఒక ట్విస్ట్ తో ఇంటర్వల్ వస్తుంది. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినా, మధ్యలో ఐటం సాంగ్ ఇబ్బంది పెట్టినా చాలా వరకు ఇంట్రస్ట్ గానే మూవీ సాగుతుంది.

ఇక సెకెండ్ హాఫ్ మొదలైన తరువాత కథనం పరుగులు పెడుతుంది. ఎప్పటికప్పుడు క్రైమ్ ఎవరు చేశారు, ఎందుకు చేసారు అని ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు, ఒక్కో విషయం రివీల్‌ అయిన తీరు ఉత్కంఠకి, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతాయి. ఫస్ట్ హాఫ్ లో వదిలిన ప్రశ్నలకు సెకెండాఫ్ ఆఖరి 30 నిమిషాలు దర్శకుడు ఇచ్చిన సమాధానాలు, ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్ లు షాక్ కి గురిచేస్తాయి. ప్రధానమైన పాత్రల చట్టు నడిపిన కథనం బాగుంది. చాలావరకు కథని సస్పెన్స్ గా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథకు అవసరం లేని కామిడీ కానీ, లవ్ ట్రాక్ లు కానీ పెట్టలేదు. ఎక్కడ తడబడకుండా ట్విస్ట్ లు ఓపెన్ చేసిన విధానం బాగుంది. మేనమామ మేనల్లుడు బాగుపడాలని కోరుకుంటాడు. కానీ అల్లుడుగా మాత్రం బాగా ఉన్నోడే రావాలనుకుంటాడు. వేటగాడు వెయిట్ చేయకూడదు వేటాడాలి. మర్డర్లు రేపులు చేస్తే కత్తి ఎత్తుతారు చేతులెత్తి చప్పట్లు కొట్టరు. ఏ తండ్రి కైనా కొడుకు సగం బలం.. కూతురు సగం ప్రాణం. ఇలాంటి డైలాగ్ లు కూడా బాగానే ఉన్నాయి. సెకెండాఫ్ మాత్రం ఒకదాని తరువాత ఒకటి ఊహించని ట్విస్ట్ ల తో ముగింపు కు చేరుకుంటుంది. క్రైమ్, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ సినిమా ను హ్యాపీగా చూడవచ్చు.

నటీనటులు, టెక్నీషియన్ల విషయానికొస్తే... ఇందులో నటించిన హీరో అశ్విన్.. దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుని పాత్రలో బాగా నటించారు. ఓ వైపు కెరీర్, మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన ఉన్న ఓ బాధ్యతాయుతమైన యువకుని పాత్ర చాలా మందికి ఇన్స్ పిరేషన్ గా నిలుస్తుంది. ఇందులో కమెడియన్ సునీల్ క్యారెక్టర్ చాలా సర్ ప్రైజ్ ఇస్తుంది. వైవిధ్యమైన పాత్రలో సునీల్ కనిపించి మెప్పించాడు. సత్యం రాజేష్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. సీనియర్ నటుడు జయప్రకాశ్ ఇందులో సినీ నిర్మాతగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. మ్యూజిక్‌ సినిమాకి ప్లస్‌ అవుతుంది. విజువల్స్ కూడా రిచ్‌గా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ సమ్మర్‌కిది మంచి టైమ్‌ పాస్‌ మూవీ అవుతుంది. థ్రిల్‌ కోరుకునే వారికి నచ్చే చిత్రమవుతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios