`సత్యం సుందరం` మూవీ రివ్యూ, రేటింగ్
కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన లేటెస్ట్ మూవీని తెలుగులో `సత్యం సుందరం`గా విడుదల చేస్తున్నారు. నేడు శనివారం ఈ మూవీ విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కార్తి తమిళ హీరో అయినా ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన్ని తెలుగు హీరోగానూ భావిస్తుంటారు. ఆయన నటించిన చాలా వరకు సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఆయన తెలుగులోనూ బాగా మాట్లాడతాడు. అందుకే ఆయన్ని తెలుగు ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. తాజాగా కార్తి హీరోగా నటించిన `సత్యం సుందరం` సినిమా తెలుగులోకి వచ్చింది. ఇందులో అరవింద్ స్వామి మరో హీరోగా నటించడం విశేషం. ఓ రకంగా ఇది మల్టీస్టారర్ అనే చెప్పాలి. `రోజా` లాంటి సినిమాతో మన మదిలో నిలిచిపోయారు అరవింద్ స్వామి. ఆయన నటుడిగా సినిమాలకు రీఎంట్రీ ఇచ్చాక చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు. పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలే చేస్తున్నారు. ఆ మధ్య `ధృవ`లో నెగటివ్ రోల్‌లో మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు `సత్యం సుందరం`లో కార్తితో కలిసి నటించాడు. ఈ మూవీకి `96`ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించడం మరో విశేషం. నేడు శనివారం(సెప్టెంబర్ 28న) తమిళంతోపాటు తెలుగులో `సత్యం సుందరం`గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాల కారణంగా మూడు తరాలుగా నివసిస్తున్న తమ ఇంటిని సత్యం(అరవింద్ స్వామి), తండ్రి రామలింగం(జయప్రకాష్) కోల్పోవల్సి వస్తుంది. సత్యంకి ఆ ఇల్లు చాలా ఎమోషనల్. అక్కడే పెరిగి, పెద్దవ్వాలని, ఎన్నో చేయాలని కలలు కంటాడు. కానీ ఒక్కసారిగా అవన్నీ కూలిపోతాయి. దీంతో బాగా ఎమోషనల్ అవుతుంటాడు. కానీ తప్పని పరిస్థితుల్లో ఆ ఇంటిని ఖాళీ చేసి వైజాగ్ వెళ్లిపోతారు. కట్ చేస్తే 22ఏళ్ల తర్వాత చిన్నప్పుడు తనతో కలిసి పెరిగిన బాబాయ్ కూతురు చెల్లి పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరు రావాల్సి వస్తుంది. బయట జనాల్లో పెద్దగా కలవని సత్యం పక్షులను, పిల్లులను పెంచుకుంటూ పూర్తి ప్రైవేట్ లైఫ్‌ని గడుపుతుంటాడు. ఆయనకు పెళ్లై ఓ పాప కూడా ఉంటుంది.
చెల్లి పెళ్లి కోసం తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి రావడంతో ఇష్టం లేకపోయినా బయలుదేరుతాడు. వెళ్లి గుంటూరులోని తన ఇంటిని చూసుకుని ఎమోషనల్ అవుతాడు. ఎట్టకేలకు పెళ్లి రిసెప్షన్‌కి వెళ్తాడు. వెళ్లగానే తన మరదలు కలుస్తుంది. తనని పెళ్లి చేసుకోనందుకు ఆమె బాధపడుతుంది. ఆ తర్వాత సుందరం(కార్తి) వచ్చి వెనకాల నుంచి దాగుడు మూతలు ఆడతాడు. కానీ అతన్ని సత్యం గుర్తు పట్టడు. దీంతో తనే చిన్నప్పటి సంఘటన చెప్పి కలుపుకుపోతాడు. బావ బావ అని పిలుస్తుంటాడు. వచ్చినప్పట్నుంచి తనతోనే ఉంటాడు. దగ్గరుండి స్టేజ్‌పైకి తీసుకెళ్తాడు. దగ్గరుండి భోజనం చేయిస్తాడు. గ్యాప్ లేకుండా మాట్లాడుతూ సత్యంకి విసుగు తెప్పిస్తాడు. అతను ఎవరు అని కనుక్కునే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాదు. పేరు తెలియక, అతనెవరో గుర్తు రాక ఇబ్బంది పడుతుంటాడు సత్యం. కానీ ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా లొడ లొడ వాగేస్తుంటాడు. అతన్నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరదు.
తాను తిరిగి వెళ్లాలని బయలు దేరతాడు. కానీ మధ్యలో టీ కోసం ఆగడంతో బస్ వెళ్లిపోతుంది. ఆ సమయంలో సత్యంకి బాగా కోపం తెప్పిస్తాడు సుందరం. అక్కడే లాడ్జ్ లో ఉండాలనుకున్నా, అవి దారుణంగా ఉండటంతో మరో గత్యంతరం లేక సుందరం ఇంటికే వెళ్తాడు. అక్కడ రాత్రి ఇద్దరు కలిసి వెనకాల పాకలో బీర్ ఏస్తారు. ఈ క్రమంలో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుంటాడు సుందరం. దీంతో అవన్ని తలుచుకుని ఎంతో అనుభూతి పొందుతాడు. ఆ ఇంట్లో అయినా అతని పేరు ఏంటో కనిపిస్తుందేమో అని ఆ రాత్రి వెతుకుతుంటాడు. కానీ దొరకదు. మరి సత్యం.. సుందరం పేరుని ఎలా కనిపెట్టాడు, అసలు అతనెవరో తెలిసిందా? ఎందుకు ఆ రాత్రి అక్కడి నుంచి దొంగగా పారిపోయాడు? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? మళ్లీ వీళ్లు కలిశారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`సత్యం సుందరం` డబ్బింగ్ మూవీ. సాధారణంగా డబ్బింగ్ చిత్రాలంటేనే అదో రకంగా ఉంటాయి. డబ్బింగ్ సెట్ కాదు, అరవ భాషని తెలుగులో చెప్పినట్టుగా ఉంటాయి. కానీ ఈ మూవీని చూస్తుంటే ఎక్కడా మనకు డబ్బింగ్ మూవీలా అనిపించదు. స్ట్రెయిట్ మూవీని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. పర్‌ఫెక్ట్ గా డబ్బింగ్ సింక్ కావడమేకాదు, సీన్లు కూడా మన స్టేట్‌లోనే సినిమా సాగుతున్న ఫీలింగ్‌ని కలుగుతుంది. లొకేషన్లు, పేర్లతో సహా పర్‌ఫెక్ట్ గా చేశారు. అక్కడే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. దర్శకుడు ప్రేమ్ కుమార్ `96` చిత్రంతోనే తానేంటో నిరూపించుకున్నాడు. తమిళంలో ఇది పెద్ద హిట్ మూవీ. తెలుగులో రీమేక్ చేస్తే ఆడలేదు. కానీ తెలుగు ఆడియెన్స్ కి తమిళ మూవీనే బాగా నచ్చింది. అందులోనూ స్కూల్ డేస్‌ని, ఆ టీనేజ్‌ని లవ్‌ని గుర్తు చేస్తూ, మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లి గుండెని పిండేస్తుంది.
ఆ లవర్‌ని మళ్లీ కలవాల్సి వస్తే కలిగే ఫీలింగ్‌తో పిచ్చెక్కించాడు దర్శకుడు. ఇక ఈ మూవీలో సత్యం, సుందరం అనే పాత్రల జర్నీని చూపించాడు. ఇందులో సొంతింటి ఎమోషన్స్ ఓ భాగమైతే,ఈ ఇద్దరి మధ్య సాగే జర్నీ మొదట్లో విసిగిస్తుంది. ఆ తర్వాత నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. చిల్ అయ్యేలా చేస్తుంది. మందేసిన తర్వాత సరదాగా పాటలు పాడాలనిపిస్తుంది. డాన్స్ చేయాలనిపిస్తుంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అతని(సుందరం) పేరు గుర్తు రాక బాధపెడుతుంది. గట్టిగా ఏడవాలనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. రిలేషన్స్ ని గుర్తు చేస్తుంది. దాన్ని మనం మిస్ అయ్యామనే ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఫైనల్‌గా నవ్విస్తూనే గుండెని బరువెక్కిస్తుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఫన్, ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ప్రయాణిస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తుంది.
సినిమాగా చూసినప్పుడు ప్రారంభ సీన్ నుంచే సత్యం పాత్రతో మనం కనెక్ట్ అవుతాం. ఇల్లుని కోల్పోతున్న ఫీలింగ్‌లో అతను పడే బాధని మన బాధగా చేశాడు దర్శకుడు. ఫస్ట్ సీన్‌లోనే ఎమోషన్స్ తో ఆడియెన్స్ ని కనెక్ట్ చేశాడు. పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరుకి వస్తున్నప్పుడు ఉండే టెన్షన్, ఎగ్జైట్‌మెంట్ మనకు కలుగుతుంది. ఇక పెళ్లిలో సుందరం పాత్ర పరిచయం సత్యంకి చిరాకు పుట్టినట్టుగానే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. కార్తి పాత్ర పేరు సుందరం మనకు టైటిల్ ని బట్టి అర్థమవుతుంది. కానీ సత్యంకి గుర్తు రాదు, అతనెవరో కూడా తెలియదు. తనతో ఇలా మాట్లాడుతున్నాడేంటి? అని ఆశ్చర్యం కలుగుతుంది. మరోవైపు జిడ్డులా తగిలాడనే చిరాకు కలుగుతుంది. వదిలించుకోవాలనిపిస్తుంది.
అక్కడి నుంచి వెళ్లిపోతే ఓ గోల పోతుందనిపిస్తుంది. కానీ బస్ మిస్ కావడం వల్ల గత్యంతరం లేక మళ్లీ ఆ ఇంటికే రావడం, అక్కడ సుందరం తనేంటి? తన ఎలా వచ్చాడు, సత్యం ఇచ్చిన సైకిల్‌ని ఎలా చూసుకున్నాడు, అది రావడంతో తన జీవితం ఎలాంటి మలుపు తిరిగిందని, అనేది చెబుతుంటే థియేటర్లో చూసే మనకు ఆ రోజులు గుర్తొస్తాయి. ఆ మధుర జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అలా ఒక నోస్టాల్జియా ఫీలింగ్‌లోకి తీసుకెళ్తుంది. ఇంత ట్రావెల్ అవుతున్న అతని పేరు గుర్తుకు రాక సత్యం పడే బాధ ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది.
అతనికి కన్నీళ్లు వస్తుంటే మనకు వస్తాయి. సుందరం అతి ప్రేమ తట్టుకోలేని ఫీలింగ్‌ని, ఒక గిల్టీ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. అది తట్టుకోలేక సుందరం పారిపోవడం, ఆ తర్వాత గుర్తు చేసుకునే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో మళ్లీ ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, గతంలోకి వెళ్లడం, పేరు తెలుసుకునేందుకు పడే తపన, క్యూరియాసిటీ ఆ మిక్స్డ్ ఫీలింగ్‌ని పీక్‌లోకి తీసుకెళ్లి వదిలేశాడు దర్శకుడు.
సుందరం పాత్ర ప్రవర్తన నవ్వులు పూయిస్తుంది. ఆ పాత్ర తీరుతెన్నులు నవ్వించి చివరికి ఏడిపిస్తాయి. ఇలాంటి క్యారెక్టర్‌ని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ఎలా ఉంటారనిపిస్తుంది. అలా సినిమా మొత్తం ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఎమోషనల్‌గా గుండెని బరువెక్కిస్తూ, మధ్యలో కాసేపు నవ్వుకుని రిలాక్స్ అయ్యేలా, ఆ వెంటనే మళ్లీ ఎమోషనల్ ఫీలింగ్ కలిగిస్తూ, కాసేపటికి నవ్విస్తూ సాగుతుంది. ఓ రోలర్ కోస్టర్‌లా సాగిపోయిందని చెప్పాలి. అయితే సినిమా మధ్య మధ్యలో ల్యాగ్ అనిపిస్తుంది. కథ పెద్దగా ఉండదు, ఎంతసేపు అక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
సత్యం పాత్రకి నస ఫీలింగ్‌లాగే ఓ దశలో మనకు కలుగుతుంది. కొన్ని సీన్లు సోదిగా ఉంటాయి. అవి మన ఆడియెన్స్ కి బోర్ తెప్పించే అవకాశం ఉంటుంది. అనవసరమైన సన్నివేశాలు కథని డైవర్ట్ చేసేలా ఉంటాయి. అవి సినిమా ఆసక్తిని తగ్గిస్తాయి. సినిమాలో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. తాను సైకిల్ ఇచ్చామని చెప్పినప్పుడే అతనెవరో తెలిసిపోతుంది. కానీ అయినా గుర్తు రావడం లేదని అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంటుంది. అది కన్విన్సింగ్‌గా లేదు. అంతేకాదు చెల్లి పెళ్లి, అన్న అంటే అంత ప్రేమ అన్నప్పుడు మధ్యలో ఎందుకు కలవలేదు.
అలాగే సత్యంపై అంతప్రేమ కురిపించే సుందరం కూడా మధ్యలో ఎందుకు కనెక్ట్ కాలేదు, సడెన్‌గా అంత ప్రేమ ఏంటనేది లాజిక్‌కి అందదు. దీనికితోడు నిడివి ఎక్కువగా ఉండటం కూడా మధ్య మధ్యలో ఇంకా ఎప్పుడు అయిపోతుందనిపిస్తుంది. తమిళంలో ఇలా నడుస్తుందేమో కానీ, తెలుగు ఆడియెన్స్ కి కాస్త ఇబ్బంది పెట్టే అంశం. ఇలాంటి కొన్ని మైనస్‌లు తప్ప సినిమా మంచి ఫన్, ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు.
నటీనటులుః
సత్యం పాత్రలో అరవింద్ స్వామి ఇరగదీశాడు. జీవించాడు. హుందాగా చేశాడు, అదరగొట్టాడు. ఆ పాత్రతో మనల్ని ట్రావెల్ అయ్యేలా చేశాడు. ఆయనలా మనం ఫీల్ అయ్యేలా చేశాడు. చివరి వరకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా సాగుతుంది. ఆయన చాలా రోజుల తర్వాత మరో అద్భుతమైన పాత్రతో మెప్పిస్తాడని చెప్పొచ్చు. ఇక సుందరం పాత్రలో కార్తి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పాత్రలాగే ఆయన నటనతోనూ గోల గోల చేశాడు. నవ్వించి నవ్వించి చివరికి ఎమోషనల్‌గా పిండేశాడు. కానీ తన మార్క్ ఫన్ చివర్లోనూ చూపించి ఆకట్టుకున్నాడు.
వీరి పాత్రలతోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఇందులో హీరోయిజం లేదు, ఫైట్లు లేవు, పాటలు లేవు, ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాంగ్ ఉంటుంది. అదే సినిమాని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి కథలను స్టార్ హీరోలు చేయడం చాలా కష్టం. కానీ కార్తి, అరవింద స్వామి ధైర్యానికి అభినందించాల్సిందే. ఇక శ్రీదివ్య, జయప్రకాష్, రాజ్ కిరణ్ వంటి ఇతర పాత్రలు మధ్యలో యాడ్ అవుతూ వెళ్లిపోతుంటాయి. వాళ్లు ఉన్నంతలో బాగా చేశారు.
టెక్నీకల్‌గా ః
సినిమాకి బీజీఎం పెద్ద అసెట్. ఎమోషనల్‌గా పిండేస్తుంది. బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే సాంగ్ సైతం అదిరిపోయింది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా కొంత ట్రిమ్ చేసుకోవచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. కంటెంట్ మేరకు బాగానే పెట్టారు. అలాగే తెలుగు డైలాగ్స్ అదిరిపోయాయి. మనకు ఈ మూవీ స్ట్రెయిట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలిగించడంలో రాకెందు మౌళి డైలాగ్స్ బిగ్ అసెట్‌లా నిలిచాయని చెప్పొచ్చు. ఇక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాని రాసుకున్న తీరు అద్భుతం. పాత్రలను డిజైన్ చేసిన తీరు నెక్ట్స్ లెవల్. మన తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆ పాత్రలుండటం ఈ సినిమాలో హైలైట్ పాయింట్.
కార్తి పాత్రని చూస్తుంటే రేలంగి మామయ్యపాత్ర గుర్తుకొస్తుంది. డబ్బు మాయలో పడి మనుషులు కమర్షియల్‌గా మారిన ఈ టైమ్‌లో ఆ బంధాలు, భావోద్వేగాలు, ప్రేమలు ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేయడం, దాన్ని ఇలా ఫన్నీవేలో చెప్పడం మరో హైలైట్ పాయింట్. ఇంతటి కమర్షియల్ ప్రపంచంలో సుందరం లాంటి మంచి, ప్రేమకలిగిన పాత్రలుంటాయా? అనేది సందేహం. ఉంటే అలాంటి వాడు మనకు ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే ఎమోషన్స్ అన్నింటిని క్యాప్చర్ చేసే క్రమంలో సినిమాని నెమ్మదిగా నడిపించాడు దర్శకుడు. అదే ఇక్కడ మైనస్. తెలుగు ఆడియెన్స్ కి అవి కాస్త బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. ఏంట్రా ఈ నస అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా అదిరిపోయేది. ఓవరాల్‌గా ఫ్యామిలీ అంతా కలిసిచూసే క్లీన్ ఎంటర్‌టైనర్.
ఫైనల్‌గాః నవ్విస్తూ, ఏడిపిస్తూ, చిన్నప్పట్న జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ప్రేమ, బంధాలు, భావోద్వేగాలు ముఖ్యమని చెప్పే మంచి ఎమోషనల్ రైడ్ `సత్యం సుందరం`.
రేటింగ్‌ః 3
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.