గుడిపల్లి నిరంజన్ కథ : తప్పెట సిటుకు

దళితులను అసహ్యించుకున్న అగ్రవర్ణ అహంకారం ఆపదలో ఉన్నప్పుడు ఆ దళితులే కన్న బిడ్డలా ఎలా ఆదరించారో నాగర్ కర్నూల్ నుండి గుడిపల్లి నిరంజన్ రాసిన కథ "తప్పెట సిటుకు" ఇక్కడ చదవండి :

Gudipalli Niranjan story Tappeta Situku

ఇటు పొద్దు అటు పొడువనీ కాలికమ్మ పనితప్పదు. ఎండాకాలంగాని, వానాకాలంగానీ, ముసురుపడనీ, వరుదలు పారనీ కాలికమ్మ దినాము పొద్దుగాల లేసి సాంపే సళ్ళడానికి, ఇండ్లల్ల పాసి పనికి పోతుంటది. దినాం మబ్బుల ఐదు గంటలకే పోతది. గాదినం కాలికమ్మ తల్లిగారింటికి పోవాలనుకొన్నది. నిచ్చే పోయే కంటే ముందుగాలనే ఆకిలి  ఊడ్వడానికి పోతుంది. అలికిడి ఇంటే ఎప్పుడైనా కుక్కలు మొరుగుతయి. ఈ యాల్ల  సలికి కుక్కలు ఏడపండినయో తెలుస్తలేదు. అందాదా నాలుగంటలకు పోయి ఉంటది.

సలికి ఏళ్ళు ఒంకర్లు పోతున్నయి. వొయసోళ్ళు కూడా దుప్పటి తన్ని పండుకుంటున్నారు. ఇండ్లు ముడుసుకపోతున్నై. మన్సు సల్లగాకురుస్తుంది. కురుస్తున్న మన్సులో బజార్లోని లైట్లు గుడ్డిదీపాలు పట్టుకున్నట్లు వెలుగుతున్నాయి.  కాలికమ్మ ఎగపోసుకుంటా పోతుంటే సలి సెవులపొంటి కోసుకుంటా పోతంది. ఆ రాత్రి కాలికమ్మ నడక సప్పుడు దూరం వినవడుతుంది.
                        
కొంటోల్లు సంపన్న సావుకార్లు. సుట్టు ముట్టు మాంచి పలుకుబడి ఉంది. దానకర్ణుడు అని అతనికి పేరు పోయింది. అందరితోటి మంచిగుంటడు.  కోంటి రంగయ్య బిడ్డ కళావతికి  ఔననంగా లగ్గమ్ చేసిండు. లగ్గాన్ని చూసిన అందరూ మెచ్చుకుండ్రు. కొన్నాళ్ళకు కళావతి ఎనిమిది నెలల గర్భవతి అయ్యింది. ఏదో మాయదారి రోగం తనకు తెలువ కుండానే తన శరీరంలోకి వచ్చింది. పెద్ద చర్చే, కాదు రచ్చే జరుగుతనే ఉంది.

ఆ ముచ్చట్లు కూడా కాలికమ్మ చెవుల పడ్డాయి. కొంతమంది జాగర్తలు కూడా చెప్పుతుండ్రు. కాలికమ్మ ఇవేమీ పట్టించుకుంటలేదు. కొంటోల్ల ఇంటికాడ దూరంనుంచి మనిషి రూపమొలే కనపడుతుంది. మనిషా !? దయ్యమా !?  ఏదో అర్థం ఐతలేదు కాలికమ్మకు.  గుండె తుస్సుమంది.  ధైర్ణం చేసి ముందుకే పోతంది. దయ్యం కాదు మనిషే.  గీ రాత్రి కొంటోల్ల ఇంటి ముంగట ఎవలుల్లా అని మందలించింది. తకాయించి సూసే వరకు కొంటోల్ల రంగయ్య బిడ్డ కళావతి. ఏందబ్బా ఎన్నడూ లేనిది ఇంత పొద్దుగాల  కళావతమ్మ లేచింది అని లోపటనే అనుకుంటుంది. దగ్గరికి  పోయి చూస్తే చల్లటి సలికి వణుకుతుంది. సలి వానకీ తడిసిన పిట్టోలే వణుకుడు పట్టింది.  పిలిసింది. ఎంతకీ లేవలే.  లేసే వరకు పిలిసింది. ఏమైంది సిన్న సేటమ్మ అని అడిగింది.
                         
“మా కడుపున సెడ బుట్టినవ్ గదే. మన కులం పరువు తీసినవ్ గదవే. గాలికి వొయేది తగిలించుకున్నావు దరిద్రం దానా.” అని జెప్పి గర్భిణీ అని చూడకుండా పరువు కోసం ఇంట్లో నుంచి తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా బయటికి నూకారు.

కళావతి బయట మెట్ల పక్కన ఉండే అరుగు మీద కూర్చొని ఒకటే తీరుగా మన్సు కుర్స్తున్నట్లే ఏడుస్తుంది. బహుశా రాత్రి ఏ ఒక్కటీటికో, రెండిటికో బయటికి దొబ్బి ఉంటారు రంగయ్య దంపతులు. ఇంట్లోకి రానిస్తలేరు. బాగా ఏడుస్తుంది. ఏడవడానికి శరీరంలో ఏ సత్తువా లేదు. కన్నీరు కార్చడానికి కంట్లో నీరు లేదు.

థూ.. థూ ..అసలు మీరు మనుషులేనా .ఛీ.. ఛీ నాకు తల్లిదండ్రులేనా మీరసలు. నా కడుపులో ఉన్న బిడ్డను చూసైనా జాలి  లేదా మీకూ? ఇంత అమానవీయంగా నన్ను బయటకు దొబ్బుతారా అని లోపల దుఃఖిస్తుంది. ఏడుస్తుంది. కలికమ్మకు చెప్పుతుంది.
                          
కళావతి ఏడుస్తున్నప్పుడు కాలీకమ్మ మానసంతా శీకటి శీకటి అయ్యింది. ‘అయ్యో...  రంగయ్య సేటు ఇంత దారుణంగా బయటికి దొబ్బుతాడు సేటు సల్లగుండా! అందుట్ల ఉత్త మనిషన్నా కాదు అని బాధపడుతుంది. “తీరా జరిగిన కథంతా” చెప్పింది కళావతి.  రంగయ్య ఎంత మొండోడో కాలీకమ్మకు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇంట్లోకి రానీయడని నిర్ధారణకు వచ్చేసింది కళావతి.
                         
కోంటి రంగయ్య సేటు ఇళ్లొచ్చి, వాకిలొచ్చి ఇంత ఎక్వతక్కువ ఎక్కుర ఉంటది. కాలీకమ్మ పొంగనే జాలాటి దగ్గర  ఉన్న గోడ మీద పొరుక తీసుకుని నున్నగా ఊడిసింది. తర్వాత తెరుపుల్లేకుండా చిక్కగా సాంపే సల్లింది.  బాగా తీపి వంటలు, పిండి వంటలు తిని బాత్రూం నిండా పాయకానా చేస్తరు. దానిలో సక్కగా నీళ్లు కూడా పోయకుండా అట్లనే వస్తరు. బాత్రూం అంతా గబ్బులేసిపోయి ఉంటది. దానిని శుభ్రం చేస్తది. కాంపౌండ్ లోపల గోడ అంచు పోటీ ఏవేవో సన్నని పూల చెట్లు ఉంటయి. అవిటికి నీళ్లు పోస్తుంటది.  ఆ సన్న జీవులు సావకుండా బతికిస్తది. వాకిలి బుగ్గ మీద ముగ్గేస్తది. అప్పుడు ఆ వోకిలి లంగా వోని కట్టుకొని సంక్రాంతి బండ్ల పండుగ నాడు తయారయ్యే ఆడపిల్లలాగా సక్కగా ఉంటది.
                              **
ఊరంతటిలో పెద్ద షాపు రంగయ్యదే.  రంగయ్యకు కొడుకు ఉన్నా , పెద్దగా సోయి లేనోడు. నత్తి నత్తి మాట్లాడుతడు. మేనరికం కావడం వల్ల మెదడు విశాలం కాలేదు. అంతా చదువు సందేలు అబ్బలేదు. లెక్కలు  రావు. మాటలు సరిగ్గా రావు. వెరసి షాపు నడపడానికి తెలియదు. రంగయ్యకు వొయసు మీద పడడం వల్ల షాపు మొత్తాన్ని కళావతే నడిపిస్తుంది. నాయిన లెక్కనే లాభాలు తీస్తుంది.   
      
అందరికీ ఉన్నట్టే కళావతికి కులం పట్టింపులు ఉన్నాయి. కిరాణం దగ్గరకి కొనుక్కోవడానికి వచ్చే మాదిగోళ్ళను చూసి కసురుకునేది. వాళ్ళను ముట్టుకుంటే అంటుకుంటుందని భయపడేది.  చిన్న పిల్లలు రసగుల్లలకు, పాపుడాలకు, బిస్కెట్లకని వస్తే దగ్గరికి రావద్దని బెదిరించేది. అంత దూరంలో షాపు బయటనే నిలబడ్డాక, డబ్బులు అక్కడ పెట్టమని చెప్పి, వాళ్లు అడిగింది ఇస్తది. దూరం నుండే డబ్బులు తీసుకుంటుంది. ‘అంటు’కోకుండా సామాను  ఇస్తుంటది.

సాదరకో , సామానుకో, పోవ్వాకుకో వచ్చే కింది కులాల ఆడోళ్ళను కూడా ఇట్లనే ఈసరించి అడుగడుగునా కుల నియమాలు పాటిస్తుంటది. తండ్రి పేరు పోకుండా కాపాడుతూనే సంపాదించే శక్తి తండ్రి లాగానే నేర్చుకుంది. కులముల పాలోళ్ళ తోటి తండ్రి ‘ఇజ్జతి’ కాపాడుతుంది.  దళితులపైన పగ, కోపం నిరంతరం చూపిస్తనే ఉంది.

కళావతి కిరాణం కొట్టు నడిపిస్తూనే నెలకు కొన్ని చొప్పున ఎల్ఐసి పాలసీలు కట్టింస్తుంటది. అట్లా కుటుంబ ఆదాయం స్థిరంగా పెంచుతూ వచ్చింది.  ముప్పై ఏండ్లు వచ్చాక రంగయ్య దంపతులు ఇద్దరు కూడా కళావతితో పెళ్లి విషయం మాట్లాడిండ్రు. పక్క ఊర్లో పెద్దింటి కుటుంబం పిల్లగానితో సంబంధం చూసిండ్రు. పేరు కరుణాకర్. వీళ్ళ తాహతుకు సరిపోయినోడే.

కరుణాకర్ సేటు పెద్దగా కట్టుబాట్లు లేని మనిషి. కలివిడిగా ఉంటాడు. పుట్టుక కోమటే గాని బుద్ధులు కోమటివి కావు. ఇంట్లో గుడ్డు కూడా తినడు. బయట చికెన్, మటన్ బుద్దిగా తింటాడు. నాన్ వెజ్ ను బాగా ఎంజాయ్ చేస్తాడు. పెద్దగా చెడు చేసే బుద్ధులు లేవు. సూదరోళ్లతోటి దోస్తాని ఎక్కువగా చేసిండు. సొంతంగా కష్టపడి పైకి రావాలనుకునే మనిషి. ఎంతో కొంత సంపాదిస్తాడు.

పట్నంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తడు. పెండ్లి అయినాక భార్యను ఇక్కడే ఉంచి తానే నెలల రెండు మూడు సార్లు, లేదంటే వారానికి ఒక్కోసారి వచ్చి పోతుంటాడు. కరుణాకర్ అందరితోటి పరాష్కకంగా ఉంటడు. మంచిగా పలకరిస్తడు. నవ్వుతడు.

ఎచ్చిడి మాటలు బాగోస్తాయి. సిన్నగా ఎంజాయ్ కి అలవాటు  పడిండు. సిటీలో పబ్బులకు పోతుండు. డ్యాన్స్ చేస్తుండు. మధ్య మధ్యలో హైదరాబాద్ లో ‘స్పా’ సెంటర్లలోకి జొర్రుతుండు. మసాజ్ కూడా చేపించుకుంటుండు. ఎమోసన్స్ కంట్రోల్ చేసుకోలేక ‘స్పా’ సెంటర్ గర్ల్స్ తో శారీరకంగా కలిసిపోతుండు. అయింత ఓ రోజు నిరోదు లేకుండానే లైంగికంగా కలిసిండు. ఎయిడ్స్ అంటించుకుండు.

ఇదంతా కళావతి గమనించింది. ఆమె ఎంత జెప్పిన వినిపించుకోలేదు. ఏమీ కాదులే. అని ఆమె మాటలు లైట్ గా తీసుకుండు. వంకర మాటలు ఆపలేదు.  పక్క తిరుగుడు  ఆపలేదు. నెల తర్వాత కరుణాకర్ ఊరికి వచ్చిండు. తను అంటించుకున్న ఎయిడ్స్ రోగాన్ని భార్యను ముట్టుకొని భార్యకు అంటించిండు.  నెల రోజుల తర్వాత భార్య నెలతప్పింది. కళావతి కడుపులో ఒక కాయ కాస్తుంది.

కళావతికి ఎనిమిది నెలలప్పుడు  కరుణాకర్ ఒంట్లో తెల్ల రక్త  కణాలు పూర్తిగా పడిపోయి ఎయిడ్స్ తోటి చనిపోయాడు.  కాల్సిండ్రు. ముండ మోసింది. ఆమె దిక్కులేనిదైంది. ఎయిడ్స్ పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్ వచ్చింది.  పెద్ద ఆస్పత్రి నుండి కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు వచ్చి మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పిండ్రు. ఏ ఆర్ వి మందులు వాడుమని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ రాదు.  మందులు వాడుతుంది. ఇదంతా రంగయ్యకు తెలిసింది అందుకే కులం పరువుకై ఇంట్లో నుండి దొబ్బేసిండు.

కాలికమ్మ ఏడు మంది పిల్లల తల్లి.  ఊర్లో మంత్రసాని పని కూడా చేస్తుంది.  ఎటు పాలు పోక అయోమయ స్థితిలో ఉన్న కళావతి పరిస్థితిని అర్థం చేసుకున్నది. గుండె ధైర్యం చెప్పింది. కళావతిని ఎవ్వరూ చేరదీయరని అర్థమైంది. ఎన్నో కాన్పులు చేసిన తాను ఇప్పుడు కళావతికి ఎదో ఒక మార్గం చూయించాలనుకున్నది. ఎన్నో విషయాలు చెప్పింది. పుట్టబోయే పిల్లవాడి కోసం అయినా సరే బతకాలని భరోసా కళావతికి కల్పించింది. జరగాల్సిన నష్టం జరిగిందని భవిష్యత్తు అంతా పిల్లవాడే జీవితంగా బతకాలని ఉద్బోధ చేసింది. అందుకుగాను మా మాదిగ్గేరికి రమ్మని గీములాడింది. అడుక్కున్నది. ఎన్ని కష్టాలున్నా మాదిగ్గేరి ఎట్లా మనుషులను ప్రేమిస్తుందో వివరించింది.  సచ్చిన మనుషులనే మీరు ఎవ్వరూ ముట్టక పోతే మేం  ఎట్లా చివరి కార్యక్రమాలు చేస్తామో పూసగుచ్చి చెప్పినట్లు చెప్పింది.

దేశం(వలస)  పోవడం వల్ల  ఖాళీగా ఉన్న బుడ్డయ్య ఇల్లు జ్ఞాపకం వొచ్చింది.  కళావతి సేటమ్మను ఆ ఇంట్లో ఉంచి కాపాడుకోవాలనుకున్నది.  ఈ విషయాన్ని కళావతికి చెప్పింది. కానీ కళావతి చావడానికి అయినా సిద్ధపడ్డది గాని మాదిగ్గేరికి వచ్చి బతకడానికి ఇష్టపడలేదు మొదట్లో.

అటు చావడానికి  ఇటు బతకడానికి మధ్య ఏ నిర్ణయం తీసుకోవాలో తోస్త లేదు కళావతికి.  తాను బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను ప్రయోజకురాలుగా చేసి  తానేంటో నిరూపించాలనుకుoటుంది.   చివరకు కాలికమ్మ ఆసరాను తీసుకోవడానికే ముందుకొచ్చింది. ఎవరేమనుకున్నా సరే మాదిగ్గేరికి తన మకాo మార్చాలనుకున్నది. ఆ మందిలో కల్సి పోవాలనుకుంది. బిడ్డకై బతకాలనుకుంది.

కాలికమ్మ రెండు చేతులు పట్టుకుని కళావతిని పైకి లేపింది. గజగజ వణుకుతున్న కళావతికి తను నెత్తికి చుట్టుకున్న తువ్వాల కప్పింది. చిన్నగా నడిపించుకుంటా ఎవరూ లేవక ముందే ఇంటికి తీసుకుపోయింది. భర్త నాగయ్యకు విషయం చెప్పింది. నాగయ్య గుండె అవిసిపోయింది. కళావతిని చూశాక తన బిడ్డలు గుర్తుకొచ్చారు. తెల్లారినాక పెద్ద మాదిగ పుల్లయ్య తోటి, దస్తగిరి తోటి ఆలోచన చేసిండు.

ఆనాడు బాపనోళ్లు తరిమేస్తే రేణుక ఎల్లమ్మను మాదిగ్గేరి ఎట్లయితే లందలో దాపెట్టి కాపాడుకున్నదో అందరూ కలిసి ఆ కథను జ్ఞాపకం చేసుకున్నరు. ఇప్పుడు కోమటి కులానికి చెందిన కళావతిని కూడా కాపాడుకోవాలనుకున్నారు. ఎంతకైనా సరే పోరాడాలనుకున్నారు. ఎవరొస్తరో  చూడాలనుకున్నరు. ఒక జీవిని కాపాడాలనుకున్నారు. ‘జీవుడే దేవుడనే సత్యాన్ని నమ్మే మనుషులు వాళ్లు’. అందుకే కళావతికి వాడ వాడంతా ఒక రక్షణ కవచం లాగా ఉండాలనుకున్నారు. అందరూ కలిసి కళావతికి మేమున్నామనే భరోసానిచ్చారు. కళావతిని  శుద్ధి చేసిన బుడ్డయ్య ఇంట్లోకి తీసుకుపోయింరు. తలా ఇంత సహాయం చేసి ఆమెకు కావాల్సిన వస్తువులు తెచ్చింరు.

ఆ రోజు రాత్రి పన్నెండు అవుతోంది. పిండి రాలినట్లు వెన్నెల రాలుతుంది. కళావతి మాదిగ్గేరికి వచ్చిన పదిహేను రోజులకు నొప్పులు తీస్తుంది. కాలికమ్మ వెంటనే కిష్టమ్మను, పెంటమ్మను, పెద్దాపురం లచ్చమ్మను, కొండమ్మను అందరిని పిలిచింది. నొప్పులొస్తున్న సంగతిని చెప్పింది. కడుపునిండా అందరూ కన్నోల్లే. కళావతి పరిస్థితిని అర్థం జేసుకున్నరు. నొప్పులు ఎలా తీయాలో చెప్పిన్రు. కావాల్సిన నీళ్లు తాపిండ్రు. కాన్పు సక్కురంగా కావాలని నాయినపల్లి మశమ్మకు, ఈరనాగమ్మకు, రేణుక ఎల్లమ్మకు మొక్కిన్రు. కడుపుల బిడ్డ అల్కగా తిరగడానికి సెంద్రం నీళ్లు తాపిండ్రు.

అంతట్లనే కాలికమ్మకు ఒక ఆలోచన వొచ్చి 108 అంబులెన్స్ కు ఫోన్ చేయించింది. అద్దగంటల కందనూల్ నుండి అంబులెన్స్ వొచ్చింది. అందరూ సేతులకు గ్లౌస్ లు  వేసుకొని దారి ఉందో లేదో చూసిండ్రు. ఉందని అంటుండగానే ఊటగా నొప్పులొచ్చినవి. ఉత్కలాడింది (ప్రసవించింది).  క్యావ్ క్యావ్ అనుకుంట పండంటి మగ పిల్లవాడికి అంబులెన్స్ లొనే జన్మనిచ్చింది. చిత్ర మేమిటంటే బుడ్డోన్కి హెచ్ ఐ వి లేదు. అది ఏ ఆర్ వి ట్రీట్ మెంట్ వల్లనే సాధ్యమైంది.

కళావతి పండంటి బిడ్డను కడుపుల పండబెట్టుకుంది. ఇంకా బాలింత వాసన పోలేదు. ఆడాళ్ళు అందరూ కల్సి వామ తినవెడుతున్నరు. ఎల్లిపాయ అరికాళ్లకు, అరిచేతులకు రుద్దిండ్రు. బిడ్డపైన చెయ్యి వేసి కళావతి కళ్ళు మూసుకుంది.  కళ్లల్లో నీళ్లు కారి చెంపల మీదికి వొస్తున్నాయి. కళ్ళు మూసుకొనే ఉన్నయ్. కళావతి గతమంతా గుర్తు చేసుకుంటుంది.

తాను కిరాణం నడిపినప్పుడు షాపుకు వొచ్చిన   మాదిగలను ఎట్లా అవమానించేదో తలుచుకొని బాధపడుతుంది. తాను చేసిన పనికి తనను తాను నిందించుకుంటుంది. మా ఇంట్లో కావలసినంత బంగారం ఉంది.  కానీ, మనసులకు మాత్రం అందరికీ ‘మసి’ అంటుకొని ఉంది. ఇన్నాళ్లు ఇది నేను గుర్తు పట్టలేదు. ముట్టుకున్నందుకు కసరుకున్నాను. ఈసడించుకున్నాను.  అంతేనా విసుక్కున్న. నాదే కాదు మా కులంలో అందరి మనసు వైకల్యంతోనే ఉంది. వెనక చాటుగా ఎన్నో  తప్పులు చేస్తుంటాం కానీ పైకి మాత్రం పవిత్రులం అని చెప్పుకుంటాం. ఇది పచ్చి అబద్ధం.   ఇన్నాళ్లు నేను భ్రమలో ఉన్నాను అని మధనపడుతుంది.

ఇప్పుడు నా “ప్రియుడు మాదిగ వాడ ".  నాకిష్టమైన తత్వం మాదిగ తత్వం. మాదిగ తత్వం అంటే ఈ భూమండలానికి తల్లితత్వం నేర్పిన మహాతత్వం.
మనుషులను గౌరవించే తత్వం. మీరు మహానీయుల వారసులు. ఈ విషయాలన్నీ బుడ్డయ్య ఇంట్లో పాత కాలంనాటి జాంబవ పురాణం దొరికితే చదివింది. అందులో సూర్య గోళం లాంటి సత్యం బోధపడింది. ఇందులొ వీరికి ఇంత గొప్ప గుణం ఎక్కడనుండి వచ్చింది అని ఆలోచిస్తే  ఒక సత్యం కళావతికి తెలిసింది. వీరు యాచకులు కాదు. అంటరాని వాళ్ళు కాదు. అతి శూద్రులు కాదు. వీరు గొప్ప మనసున్న మనుషులు. మనుషులను ప్రేమించే వాళ్ళు. వీరు పాలకులు. ప్రపంచానికి ప్రకృతి తత్వాన్ని పరిచయం వీరే చేశారు. ఈ ప్రపంచానికి గొప్ప పరిపాలన నేర్పారు.  నేను చేరాల్సిన చోటికే చేరాను. ఆత్మీయుల దగ్గరకే వచ్చాను. రావలసిన వాళ్ల దగ్గరికే వచ్చాను అని సంతోషపడుతుంది.

మా తండ్రి బాగా ధనవంతుడు. నేను అతనికి ఇష్టమైన కూతురిని.  నా ప్రాణానికన్నా, నా కడుపులో పెరుగుతున్న పాప ప్రాణానికన్న మా నాన్న  తన పరువే ముఖ్యమనుకున్నాడు. కానీ ఈ వాడ మనుషుల జీవితాల్లో అబద్ధాలు లేవు. నటన అస్సలు లేదు. మా వాళ్ళ జీవితాలు బూటకం. కపటం అని తేల్చి పారేస్తున్నారు. ఇప్పుడు నేను ధైర్యంగా చెబుతున్నా. నేను ఏ పాపము చేయలేదు. యవ్వనంలో జరిగే భార్యాభర్తల మధ్య సంబంధం ఇలా పరిణమిస్తుందని నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఇష్టమొచ్చిన రీతిగా యవ్వనపు సుఖాలను నేనేమీ జుర్రుకోలేదు. లైంగిక క్రమశిక్షణ ఉన్న దానినే. నా భర్త చేసిన పనికి నన్ను శిక్షించడం న్యాయమా?  ఎవరో చేసిన పాపానికి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి? అని సమాజంపై మౌనంగానే ప్రశ్నల వర్షం లోలోనే కురిపిస్తుంది.

కళావతి ఇట్లా అనుకుంటుండగానే కోడేటి పెంటామా సిన్ని బీడు తాగుకుంట, రింగు రింగుల పొగలు వదులుతుంది. టుకున పండ్ల సందునంగా ఉమ్మిచ్చి "ఇతరుల కోసం బతకడంలోనే ఆనందం ఉంది " అన్న యోగిలా నవ్వింది.

ఈ వాడ మనుషుల ప్రేమ తత్వం చూసి కళావతిలోని చీకటి తొలగిపోతుంది. మానవాళి రక్షణకు మూలం లందే. దైవిక ప్రబోధాలను పై కులాలు ప్రబోధించవచ్చు కానీ దయాదక్షిణ్యాలు లేవు. దేవుడిని, శక్తులను కొలువవచ్చు మేము కానీ మనిషిని ఆరాధించలేకపోతున్నాం. ఆనాడు గండ్ర గొడ్డలి తీసుకుని వెంటబడితె ఎల్లమ్మను కాపాడినారు. ఈనాడు ఎయిడ్స్ తో  వచ్చిన నన్ను గుండెలకు అద్దుకున్నారు. మీరు, మీ లంద స్త్రీలకు రక్షణ కవచమై వెలిగిపోతుంది. ఈ లంద మీదేకాదు. మాది, మనది.  మనందరిది. శరణు కోరిన స్త్రీకి ప్రాణం పెట్టే అత్యంత అభ్యుదయులు వీరే. ఆదర్శం వల్లించడమే కాదు ఆచరణ గావించే ఆధునికలు. బతకమని భరోసా ఇచ్చే పోలీస్ స్టేషన్ కన్న మీ భరోసానే గొప్పది. నన్ను, నా కొడుకును కాపాడిన మీ వాడకు మొక్కుతున్న. మీ సంస్కారానికి తలవంచి నమస్కరిస్తున్న అని కళ్ళు తెరిచింది. నాకు పునర్జన్మనిచ్చిన మీతోటే నా జీవితం. అని అంటున్నప్పుడు అక్కడున్న ఆడవాళ్ళ కళ్ళలో సంతోషం పొరిలింది.  కళావతి కొడుకు పెరుగుతున్న పిల్లోడై “వాడ” పిల్లతోని కల్సి పొద్దు పొడుపు మీద తప్పెట సిటుకేస్తుండు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios