ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు
మనుషుల స్వార్ధానికి దెబ్బతింటున్న పంచభూతాల నిరసనను ఈ. వెంకటేష్ రాసిన కవిత ' పంచభూతాలు ' లో చదవండి :
సూర్యుడు జీవితంపై విరక్తితో
గిలగిలా తన్నుకొని
ఆత్మహత్య చేసుకున్నాడు
పోస్టుమార్టం మొదలైంది
డాక్టర్లు చెప్పిన కారణం
"కాలుష్యం"
చెట్లు చిగురించడం మానేశాయి
నీడనివ్వడానికి అలిగాయి
మనుషులు బతకడానికి
ఆక్సిజన్ ఇవ్వడానికి
దానికి మనసు రావడం లేదు.
చంద్రున్ని ఇప్పుడు
ఎవరైనా "మామా" అని పిలిస్తే
అతని కనులు కోపంతో
బుస కొడుతున్నాయి
ఎప్పుడైనా తన పైకి స్వార్థ
మానవులు దండయాత్ర చేస్తారని
మలయమారుతం
ఇప్పుడు చల్లగా వీచడం లేదు
సుడిగాలి వలయాన్ని సృష్టించి
పెట్టుబడిదారులను అందులో
ఎత్తుకెళ్లాలని కసిగా ఉంది
భూమాతకు సహనం నశించి
అసహనం తారాస్థాయికి చేరింది
ఇన్ని కోట్ల స్వార్ధ మానవులను
ఏమీ ఆశించకుండా భరిస్తున్నందుకు
నిప్పు ఇప్పుడు
వంటకు బదులు
ప్రాణాలు తీయడానికి మాత్రమే
అని ప్రతిజ్ఞ చేసింది
ఆకాశం ఈ దయలేని
మానవున్ని చూసి
ఒక్క వర్షపు చుక్కను కూడా
విదల్చడం లేదు
పైగా పైనుంచి నిర్వికారంగా
నవ్వుతూ ఉంది