నాగలి కూడా ఆయుధమే - సమీక్ష

కొమ్మవరపు విల్సన్ రాసిన నాగలి కూడా ఆయుధమే కవితా సంపుటికి డాక్టర్ కేజీ వేణు సమీక్ష రాశారు. ఆ సమీక్ష ఇక్కడ మీకోసం

nagali kuda ayudhame kommavarapu wilson book review by dr kg venu

సాహిత్య హాలికుడు కొమ్మవరపు విల్సన్ రావు కవితా సంపుటి 'నాగలి కూడా ఆయుధమే' పైన విశాఖపట్నం నుంచి డాక్టర్ కె.జి. వేణు రాసిన సమగ్ర సమీక్ష ఇక్కడ చదవండి : 

కవిత్వంలో నిబద్ధతను కొలతబద్ధగా ఆచరించి, తరించే కవుల సమూహాన్ని నేను దర్శించుకున్నప్పుడు, అందులోనుంచి “నేను నేనుగా నాలుగు దేహాలై / నాలుగు జీవితాలు సంచరిస్తాను..." అంటూ ఆకాశం ప్రతిధ్వనించేలా ఉచ్ఛరిస్తున్న ఒక స్వరం నాకు వినిపించింది.  కవిత్వంలో తాను ఇంకా ఒక విద్యార్థిగానే కొనసాగుతున్నానంటూ ప్రకటించుకుంటున్న ఆ స్వర సాహితీమూర్తి ఎవరోకాదు, అక్షరాలనే నైవేద్యంగా, తెల్లకాగితమనే విగ్రహానికి భక్తిపూర్వకంగా నిత్యం సమర్పించుకునే అతిసాధారణ జీవిత ప్రేమికుడు, సాహిత్య హాలికుడు 'కొమ్మవరపు విల్సన్ రావు'. 

నా పలకరింపుకు ప్రతిఫలంగా తాను పండించిన 'నాగలి కూడా ఆయుధమే' కవితా సంపుటిని ఒక అపురూపమైన కానుకగా నా చేతులకందించాడు. ప్రాతః సమయాన ఆ పుస్తకానికి నమస్కరించి, ముఖచిత్రాన్ని చూశాను. ఎదురుగా నాగలి. ఆయుధంగా మెరుపులతో తళుక్కుమంది. మెల్లగా సంపుటి ద్వారాలు తెరిచాను. కవిత్వం వేదికగా సరికొత్త రూపంలో 69 నాగలి రూపాలు, సహస్ర భావాలతో సాహిత్య స్నేహానికి చేతులు సాచి ఆహ్వానించాయి. సుగంధ పరిమళాలతో ఆత్మీయంగా అక్షరాలు ఆలింగనం కోసం స్వాగతిచ్చాయి.

 ఇంతలో నన్నెవరో తాకారు. ఉలిక్కిపడి చూశాను. అది "తాళాలులేని వేకువ దేహం".  అందులో వున్న వ్యక్తి ఎవరో కాదు, నాగలిని అక్షరాలతో ఆయుధంగా మార్చిన కవి. బతుకు వ్యాకరణంలో క్రియావాక్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్లి ఎదురుగా నిలబడ్డాను. అతని కళ్లలోకి కాలం జారిపోతోంది. తననుతాను నిర్దయగా ఖననం చేసుకుంటున్నాడు. పొరలు, పొరలుగా విప్పుకొని సొక్కి సోలిపోతున్నాడు. ఉన్నట్టుండి అతని చుట్టూ స్వేదనది. అందులో నిండుగా మునుగుతున్నాడు... ఒక్కసారిగా ముఖంనిండా చిరునవ్వు, తాళాలులేని వేకువ దేహాన్ని కలగంటూ...రాసింది పదునుగా, ప్రతిభావంతంగా రాయాలన్న కోరికను తన కలానికి గాఢంగా నేర్పుతున్న ఈ కవి, మౌనంగా కళ్లతో ఆదేశిస్తూ నన్ను తనతో ముందుకు నడవమన్నాడు. నాకెందుకో అదంతా చాలా కొత్తగా వుంది. అప్పుడప్పుడే తెల్లవారుతూ వుంది. నడుస్తున్న నా దేహాన్ని ఎవరో తట్టిన చప్పుడు. ఇంతలో నా మనసు వాకిళ్లను తెరిచి, తూరుపుగాలిని నా గుండెల్లోకి వొంపుతున్న ఒక పచ్చని ఆత్మీయ వాక్యం. అంతే నేనొక సజీవ జలపాతంగా మారిపోయాను. కాలంతోపాటు పరుగెత్తే నమ్మకాన్ని నా సొంతం చేసినప్పుడు నా పెదాలపై ఎప్పుడూ చూడని చిరునవ్వు పూయటం ఆశ్చర్యం కలిగించింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే చెమటపూల పరిమళాల విలువలను మరింతగా తెలుసుకునేందుకు నా వెంటనున్న కవి నడిపే సాహిత్య పాఠశాలలో విద్యార్థిగా చేరిపోయాను.

బతుకు బలవంతంగా శిలువ ఎక్కినప్పుడు, కోరికలు చంపుకుని జీవించటం, ఎంతకష్టమో... సంపూర్ణంగా తెలిసిన మనిషి ఈ కవి. ఆకాశంలో మేఘాలు కదులుతూ వుంటే నన్ను ఓ చెట్టుక్రింద కూర్చోపెట్టి, కాలం చప్పట్లు కొట్టే ఒక ఘనమైన  మాటను నాతో పంచుకుంటూ... "తన ప్రేమతో గాలిగొంతును, మధురమైన పాటగా మలిచేవాడొక్కడే గొప్పవాడు...” అన్నాడు. కోటి వీణలు మ్రోగితే ఎలా వుంటుందో ఆ అనుభూతిని, ఆ మాటల్లో మొదటిసారి నా ఖాతాలో రాసుకున్నాను. అంతే ఒక్కసారిగా జీవనదులు నాలో ప్రవహించాయి. మంచుపూలు పరిమళించాయి. నెమలిపింఛంలా పురివిప్పిన పాటలు, తోటనిండా పండుగలు చేసుకున్నాయి. రమ్మని కవి సైగచేస్తే ఒక పువ్వు దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. అది పారిజాతంకంటే గొప్పగా పరిమళిస్తోంది. తీరా పరిశీలనగా చూస్తే, ఆ పువ్వు కొమ్మకు పూయలేదు. ఒక పద్యానికి పూసిన కుసుమం అది. దాని కర్త ఎవరని రెమ్మల్మి అడిగితే... మెల్లగా, నా ముందు నడుస్తున్న కవిని చూపించి, ఆయనే అంటూ గుస, గుసలాడాయి. శీతాకాలమయినా పువ్వుచుట్టూ మంచుబిందువులు లేవు. ఆశ్చర్యంగా ఆ పువ్వు చెమటముత్యాల్లో మెరిసిపోతోంది. కారణం, కవి గుండె చెమ్మనుండి మొలకెత్తిన పుట్టుక ఆ పువ్వుది కాబట్టి.

ఉన్నట్టుండి కవి చాలా గంభీరంగా మారిపోయాడు. దగ్గరికెళ్లి మూసిన అతని కనురెప్పల మీద కదలాడుతున్న దృశ్యాలను చూశాను. 'భూమి పొరల్ని చీల్చుకుంటూ, దాస్యవిముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న దళిత యోధులు, చిర్రా చిటికెనపుల్లలై, డప్పు వాయిద్యాలై, జనం గుండెల్లో మొలుస్తున్నారు. మాకోసం మేమై,అందరికోసం మేమై...' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాల శబ్దాల్లో అణగారిన ఉద్యమాలు అగ్నివర్షం తాకిడిని తట్టుకుని, వెలుగుల వేలుపు చూపుడువేలు చూపిస్తున్న వైపుకు, బాటలు పరుస్తూ, చైతన్యవంతమైన భూమి బిడ్డలు, భ్రమలలోకం విడిచి, పిడికిళ్లనెత్తి ఆచరణశీలురై, దేశ ముఖచిత్రానికి కంటిపాపలద్దుతున్న దృశ్యాలు, చరిత్రలోని నిజాలను తెలుసుకునేలా చేస్తున్నాయి. సూర్యుడ్ని కళ్లల్లో వేసుకుని నిష్క్రమించటం తెలిసిన ఈ కవి, ఒక్కసారిగా రైతు సోదరుల సమూహల మధ్య నిలబడ్డాడు. అందర్ని మనసారా కౌగిలించుకున్నాడు. కర్షకుల నుదుటిమీద రాలుతున్న చెమట చుక్కల్ని ముద్దాడుతూ, భుజాలమీద చేయివేసి 'చీడపీడల నుండి చేనుకు రక్షణ కల్పించటానికి, ఇంద్రధనుస్సును తిరగేసి, సాంబ్రాణితో పైరుకు పొగవేస్తా, వర్తమానంపై నిర్ణయ సంతకం చేసి, మట్టికి ప్రాణం పోస్తా...” అంటూ... "చీకటి మేఘాలపై పోరుమంటల మెరుపుపాటై, నూతన యుగ ద్వారాలు తెరుస్తూ, ప్రశ్నించే తత్వాన్నై తోడుంటా..." అంటూ భరోసాను రైతుల భుజాలమీద కండువాలా కప్పటమే కాదు, ఒక శక్తివంతమైన చైతన్యాన్ని రైతుల రక్తంలో ఎక్కిస్తూ.. 'దుక్కి దున్నటమంటే, యుద్ధక్షేత్రంలో పరాక్రమించడం అని తెలిసిన నేలతల్లి బిడ్డడా! అవసరమైనప్పుడు నాగలికూడా ఆయుధమై శత్రుసంహారం చేస్తుంది కదూ!...' అంటూ ఉరుములా నినదించిన కవి కంఠంనిండా, కర్షకుడి దుఃఖాన్ని పసిగట్టడం తెలియని రాజ్యంమీద వెలిబుచ్చిన తన ఆగ్రహం, ఏకంగా నాగలి పదునుకు ఆకురాయిలా మారటం ఒక సాహిత్య ప్రయోజనానికి హారతులిచ్చినట్లుగా వుంది.

ఇంతలో నిత్యం కత్తుల వంతెనపై నడుస్తున్న వాళ్ల ఆకలి కేకలు ప్రపంచాన్ని కుదిపేస్తూ వినిపించాయి. పోరాటాన్ని నమ్ముకున్న జనమంతా క్షణాల్లో కవి చుట్టూ చేరిపోయారు. కవికి తెలుసు, నిత్య పోరాటాల బతుకెప్పుడూ పరిమళభరితం కాదని, "భయపడకండి... భయపడకండి...” అంటూ కవి తన గొంతును సవరించుకుని... “ధైర్యం, నమ్మకాలే కవచ కుండలాలుగా పుట్టిన మనుషులంతా కొత్తగా శ్వాసిస్తూ, తమను తాము పచ్చని చెట్టులా మలచుకుంటారు..." అన్నాడు, జనాన్ని చూస్తూ. ఈ మాటలు వినగానే జనం పిడికిళ్లు బిగుసుకున్నాయి. “పండిన తమ ఆకుల్ని తామే రాల్చుకుంటూ, రక్షణ కవచమై నిత్యం కొత్తగా చిగురిస్తూ వుంటారు. జయహెూ అజేయుడా... నిజమైన మనుషులంతా సరికొత్త విత్తనాలై మొలకెత్తుతారు...” అన్నాడు అందరీకీ చైతన్యాన్ని కలిగిస్తూ కవి. అంతే ఒక్కసారిగా అక్కడ చేరిన వాళ్లంతా ఎవరి బతుకు స్వరాల్ని వాళ్లే సరిచేసుకుంటూ, జీవితపు పగుళ్ల గుండె చప్పుళ్లను శృతి చేసుకుంటూ, పాల నవ్వుల్ని ఆరబెట్టుకుంటూ, శ్రమ విలువల్ని మోసే మెరుపు కత్తుల్లా నిలబడ్డ దృశ్యానికి సంతోషపడిన ఆకాశం కొత్తచీర కట్టుకుని మురిసిపోయింది. మబ్బులు కమ్మి మసకేసిన సూర్యుడు, ఒక్కసారిగా పూసిన తంగేడులా ప్రకాశిస్తున్నాడు. ఇంతలో మెరుపు మెరిసింది. ఉరుము ఉరిమింది. "చలిచీమలు బారులుతీరి మగమృగాల అహాన్ని గెలిచే రోజులు ఎదురుగానే వున్నాయంటూ...” నాలుగు దిక్కులు కలిసి సామూహిక గీతాలు పాడటం మొదలు పెట్టాయి. మట్టిమనుషుల కలలకు, బంగారు కిరీటాలు తొడగాలంటూ... భూమి తన గుండె చప్పుడు చేయటం మొదలు పెట్టింది. "పాడు, ఇంకా పాడు, కొత్తపాటలుపాడు, మానవత్వం పరిమళించి, విశ్వమంతా విస్తరించే పచ్చని చెట్టులాంటి పాటలు పాడు..." అంటూ ఎక్కడ్నుంచో ఎగురుకుంటూ వచ్చిన కోయిల, జనం మధ్య నిలబడి మాట్లాడుతోంది. సాక్ష్యంగా నా కనురెప్పలు, కాలం కాగితం మీద సంతకాలు పెడుతున్నాయి.

రోజంతా హెూరెత్తి సొమ్మసిల్లిన సముద్రపుటలలు, అలసట తీర్చుకుంటున్నాయి. నేను, కవి ఇసుక తిన్నెలమీద కూర్చున్నాం. ఒక్కసారిగా తనవైపుకు నన్ను త్రిప్పుకున్నాడు. ఆతురతగా అతని కళ్లల్లోకి చూశాను. ఆ కళ్లల్లో ఉవ్వెత్తున్న ఎగిసి పడుతున్న ఎర్రసముద్రాల అలలు కనిపించాయి. ఆయన మాటల్లో ధ్వని పిడుగులా మారింది. 'బతుకంటే ఇప్పుడు కన్నీటి నదుల ప్రవాహం, చివరి శ్వాసలో పురుడోసుకున్న మట్టివాసన, ఇదే వేదభూమి సోదరా! ...' అంటూ నా భుజాలను గట్టిగా నొక్కాడు. ఆ వెంటనే 'మన తలరాతలు స్వార్థ వైద్య నారాయణుల స్టెతస్కోపుల చేతులతో రాయబడుతున్నాయి...' అన్నాడు లేచి నిలబడుతూ కోపంగా.  కవి పాదముద్రల్ని గమనిస్తూ... నేనూ, ఆయన వెనకే నడుస్తున్నాను. సముద్రానికి దగ్గరగా వెళ్తున్నాం. అలల అల్లరి మెల్లగా మాకు వినిపిస్తోంది. “సుగంధ పరిమళ నదీతీరంలో, కవితా పతాకాన్ని ఎత్తి, తడి ఆరని జీవితాన్ని ప్రవాహంలా మోస్తూ, ఎప్పటికీ నిజాలే మాట్లాడుకుంటూ సాగిపోదామా!..." అంటూ ప్రేమగా కాలాన్ని అడుగుతున్నాడు కవి. కాలానికి బాగా తెలుసు, ప్రేమంటే పొంగిపోయే ఈ కవి తత్వం గురించి. ఇప్పుడు ఆయన కళ్లముందు సముద్రమూ లేదు, అలలూ లేవు. ఆకాశం ఎప్పుడో మాయమైపోయింది. ఉన్నది ఒక ప్రేమమూర్తి స్వరూపం. అప్రయత్నంగా “నువ్వు పరిచయమయ్యాకే కదా! స్నేహమంటే ఎప్పటికీ ముగియని వాక్యమని తెలిసింది..." అన్నాడు మెల్లగా, నన్ను చూడకుండానే. అంతటితో ఆగలేదు. ఆయన మాటలు విందామని నేను మరింత దగ్గరగా ఆయనతో నడుస్తున్నాను. మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు.... "నువ్వు పరిచయమయ్యాకే కదా! ఈర్ష్యాద్వేషాలు వదిలేసి, తాదాత్మ్యపు అంచున నిలబడి, ఇంత ఆనందంగా, ఇంత ఆహ్లాదంగా, ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్తేజంగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను...” అంటూ రెండు చేతులు పైకెత్తి దిక్కులకు వినిపించేలా చెప్పుకుపోతున్నాడు. కవి ప్రాణాన్ని తన ప్రాణంలో కలుపుకున్న ఆ సుందరమూర్తి, ఆ ప్రేమమూర్తి ఎవరో కాదు. ఆయన రాస్తున్న 'కవిత్వమేనని' ఆ రహాస్యాన్ని నా మనసు, మెల్లగా నా చెవిలో గుస, గుసలాడింది.

మరుసటిరోజు మళ్లీ కవిని కలిశాను. కల్మషం ఎరుగని చంటిబిడ్డలా స్వచ్ఛంగా నవ్వుతూ కనిపించాడు. నన్ను కూర్చోమని ఆసనం చూపిస్తూ... "రోజుకు ఒక్కసారైనా నవ్వుతూ కనబడకపోతే, ఒళ్లు చిత్తడిచిత్తడిగా ఉంటుంది..." అన్నాడు. వెంటనే నేను నా నవ్వులకు స్వాగతం పలికాను. ఆకాశంలోకి ఆయన దీర్ఘంగా చూస్తున్నాడు. నా మనసు కారణాన్ని అడగబోతోందని గ్రహించాడు కవి. "చీకటిని తరిమేసే వెలుగుకోసం ఎదురుచూస్తున్నాను...' అన్నాడు చాలా గంభీరంగా. అంతటితో ఆగలేదు. ఏదో బాధ, ఏదో వేదన ఆయన కంఠంనుంచి వెలువడ్డాయి. ఆయన చెప్తున్నాడు, నేను వింటున్నాను. “పసుపు కుంకుమలకు దూరమైన అంచుల్లేని చీరలన్నీ, ముక్కులు చీదుకుంటూ, గడపలముందే తమను తాము చిదిపేసుకుంటున్నాయి. ఒంటరిపోరు అనివార్యమై, రెప్పలకింద కన్నీటి కడవల్ని మోస్తున్న మహా సౌందర్యవంతులు వారు..." అన్నాడు. అనుకోకుండా ఆయన గొంతు సన్నగా జీరబోయింది. మరో విషయం గుర్తుకొచ్చి, గంభీరంగా చెప్పటం మొదలుపెట్టాడు. “ఉడుకునెత్తురుపారే కాళ్ళన్నీ, జ్ఞానసముద్రాల్లో ఉద్యమ గీతాలు పాడుకుంటూ, కుప్పలు తెప్పలుగా కొత్త చివుళ్ళేసి నవనవలాడుతున్నాయి..." అన్నాడు. ఈమారు ఆయన ముఖంలో ఏదో కొత్త వెలుగు కనిపించింది. ఇంతలో దూరంగా అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ వైపుకు నాలుగు అడుగడుగులు వేశాడు కవి. రెండు చేతులు పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ "ఆశలు మొలిచిన స్వప్న శిశువొకటి, జీవనోత్సాహంతో మహాశ్వాసను తొడుక్కొని, పరమ నిశ్శబ్ద క్షణాల్ని బద్దలు కొడుతోంది..." అంటూ గట్టిగా కేకలేశాడు. రెక్కలతో ఆయన్ని అభినందిస్తూ ఆకాశంలో పక్షుల వరుస ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ దృశ్య మనోహరతను నా మనఃఫలకం మీద చాలా గట్టిగా ముద్రించుకున్నాను.

ఈమారు కవి తన డైరీని తెరిచాడు. అందులో తాను రాసింది నన్ను చదవమన్నాడు. అక్షరాలు ఇంకా కన్నీటి తడిని మోస్తూనే వున్నాయి. దృశ్యాలు, దృశ్యాలుగా విషయం నా చుట్టూ చేరిపోయింది. “అవి కరోనా విలయతాండవం చేస్తున్న రోజులు. దేశంకాని దేశంనుంచి, ఇరవైనాలుగు గంటలు ప్రయాణం చేసి అమెరికానుంచి కవి ఆత్మమిత్రుడు ఇండియా వచ్చాడు. మిత్రుడు ఎప్పుడు ఇండియా వచ్చినా, ఆట, పాటలతో సంతోషపెట్టేవాడు, సంతోషమే సర్వస్వమై జీవితాన్ని పంచేవాడు...", డైరీ చదువుతూ సరిగ్గా నేను అక్కడ ఆగిపోయాను. ఇప్పుడు కవి మనసు నా ముందుకు వచ్చి మాట్లాడుతోంది. అప్పటి బాధ, ఏడుపు మళ్లీ ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజంగానే కవి మనసు ఏడుస్తోంది. నా చేతులు పట్టుకొని అప్పటి దృశ్యాలను నా అరచేతుల్లో చిత్రీకరిస్తోంది. ఆ దృశ్యాలలోకి తొంగిచూశాను. "నువ్వు రాగానే ఎదురేగి నిన్ను హత్తుకోలేని, అలసిన నీ నుదుటిపై ముద్దెట్టుకోలేని, కనీసం నీ శ్వాసను తాకలేని దుష్ట క్షణాలివి. విరబూసిన నీ మౌనంముందు నేనోడిపోతున్నాను. కళ తప్పిన నీ సంతోష క్షణాలను చూడలేక పోతున్నాను. పద్నాలుగు రోజులు, పద్నాలుగు ఘడియలుగా గడిపి, సంపూర్ణారోగ్యంతో తిరిగివస్తావనే ఆశతో..." ఆ వాక్యాలు చదివి వెనక్కి తిరిగి చూశాను. "వాడు ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు...” అంటూ కవి కనుబొమ్మలు పిల్లాడిలా ఎగురుతూ మాట్లాడాయి. సంభాషణను కొనసాగిస్తూ, తన మిత్రుడి గురించి చెప్పుతూ “నా ఆత్మలో అతడింకిపోయాడో, అతని ఆత్మలో నేనింకిపోయానో గాని, ఏదో తెలియని ఊహ ఒకటి నాలో ఊపిరిపోసుకొని మౌనినైనప్పుడు నా మౌనానికి మాటలు కూర్చిన నాయకుడు అతడే... అతను నా ప్రక్కనుంటే చాలు, ఆ దినమంతా నాకు వెలుగుల పండగే..." అంటూ మిత్రుడ్ని మళ్లీ, మళ్లీ గుర్తు చేసుకుంటూ కవి ముగించాడు. దూరంగా ఆకాశంలో సూర్యుడు ఆ రోజుకు వీడ్కోలు తీసుకుంటూ, పడమటి వైపుకు వెళ్లిపోయాడు.

ఆ రోజు తెల్లారకుండనే నేను కవిని దర్శించుకున్నాను. అప్పుడే ఆయన లేచి, నడి మంచంమీద కూర్చున్నాడు. లేత గోధుమవన్నె సూర్యకిరణాలు, కిటికీలోంచి చేతులు చాచి, ఆయన ముఖాన్ని లాగి, ముద్దు పెట్టుకుంటున్నాయి. కవి, తనను తాకిన కిరణాలను దగ్గరగా తీసుకుని "ఆకురాయితో నా మనసు కొడవలికి పదునుపెట్టి, చీకటికొండల్ని పగలగొడుతూ, మాటలకందని కలల ప్రపంచంలోకి నేను ప్రయాణిస్తాను. రాగాల రెక్కలపై నిత్యనూతన నిశాగీతాల్ని రచిస్తూ, చూపుల చౌరస్తాలో నిలబడి, నాణ్యమైన మనిషితనాన్ని అన్వేషిస్తూ సాగిపోతాను.. ." అన్నాడు. ఆ మాటలకు పరవశించిన కిరణాలు తల్లిలా ఆశీర్వదించి గదినిండా వెలుతుర్ని పంచాయి. కవి పైకిలేచి ఎదురుగా గోడకు వ్రేలాడుతున్న ఫోటోవైపుకు తిరిగి "తాతా! కలలు చెదిరి తాత్కాలిక కలతపడ్డావేమో గాని, నీవు రగిలించిన చైతన్య జ్వాలల్లో నిత్యం రగులుతూనే వున్నాం, నీవెత్తిన చేతన ధ్వజానికి శిరస్సువంచి ప్రమాణం చేస్తున్నాం..." అంటూ ఆ ఫోటోకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అందులో నా నమస్కారాన్ని కూడా భక్తిపూర్వకంగా కలిపేశాను.

ఇంతలో ఒక విద్యార్థి బృందం వచ్చి గదిలో కవి ముందు కూర్చున్నారు. ఏదో ఒకటి చెప్పమన్నట్లు అందరూ చేతులు జోడించారు. అప్పుడు కవి కంఠస్వరం గుడిలో గంటలా మ్రోగింది. అందర్నీ చూసి, చిరునవ్వుతో పలకరిస్తూ... "మీరు కాలిడితే చాలు, ఈ ఇల్లు పచ్చని ఆత్మీయ పరిమళంతో జీవం పోసుకుంటుంది, ఒక్కసారి ఆప్యాయంగా పలకరిస్తే మా దేహాలు ఎగిసిపడే కెరటాల్లా కొత్తగా శ్వాసిస్తాయి...' అన్నాడు. అప్పుడు నాకర్థమయింది. పదే, పదే ఈ పిల్లలు ఏందుకు ఈ ఇంటికి వస్తున్నారో. వాళ్లు వచ్చిన ప్రతిసారీ.. కవి తన మనసులోని మాటలు చెప్పుతూ వుంటాడు. ఈ రోజుకూడా కొన్ని మాటల్ని పోగేసుకుని చెప్తున్నాడు... "మారకపు విలువ చూడని తల్లి ప్రేమకు నోచుకున్న అదృష్టవంతులు మీరు, ఆదాయ వ్యయాలు చూడని తండ్రి ఆప్యాయతలు పొందిన ధన్యులు మీరు..." అని ఆయన చెప్పగానే ఒక్కసారిగా అందరి కళ్లల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు దర్శనమిచ్చారు. అప్రయత్నంగానే అందరూ చేతులు జోడించారు. మాటలన్నీ అయ్యాక తిరిగి వెళ్లటానికి పిల్లలు లేచి నిలబడ్డారు. కవికూడా లేచి, దగ్గరున్న వాళ్లను ముద్దాడుతూ... "అపుడపుడు పలకరించి మా నొసటన ఒక తీపి ముద్దిచ్చి, తనివితీరా మా గుండెల్లో దూరి మమ్మల్ని హత్తుకోండి..." అంటూ పిల్లల్ని కౌగిలించుకున్నాడు. కవికి, తన ఎదురుగా వున్న పిల్లలు దేవతల్లాగా కనిపిస్తున్నారు. వరాలు కోరే భక్తుని రూపంలోకి కవి మారిపోయి... “గుప్పెడు మెతుకుల కోసం ఎదురుచూడని ఈ వయసుడిగిన పావురాలపై, కొన్ని దయాపూరిత వాక్యాల తేనెల సొనలు చిలకరించండి..." అన్నాడు. భోరుమని పిల్లలు ఒక్కసారిగా ఏడ్చేశారు. కవి కాళ్లమీద పడిపోయారు. నేను కూడా వాళ్లల్లో కలిసిపోయాను. అందరినీ లేవనెత్తి తన గుండెకు హత్తుకుంటూ... “ఒక్క నిజం కోసం, శుద్ధమైన నిజం కోసం చెప్పేది, చేసేది ఒకటే కావాలిప్పుడు, దేహాలకు దివిటీలు కట్టి, వెతుకులాటలో మీరంతా పదునెక్కాలి. మీ ఆలోచన కాంతిపుంజమై, చూపు కాగడాలా వెలగాలి, సరేనా...' అన్నాడు కవి. కళ్లు పెద్దవి చేసి, హామీ సంతకాల్లా కవిని ఒక్కసారిగా అందరూ చూశారు. ఆ గదికి దగ్గరలో వున్న చెట్టుమీద ఒక కోయిల కీరవాణి రాగంలో ఒక పాటను శ్రావ్యంగా పాడటం మొదలు పెట్టింది.

చాలా రోజులుగా నేను కవిని గమనిస్తున్నాను. సూర్యుడు రోజూ ఆయన్ని తాకనిదే, గోధూళి వేళను తన కడుపులో వేసుకోవటం లేదు. చంద్రుడూ అలాగే, అతి సున్నితంగా ఆయన్ని తడమందే నిశ్శబ్దపు సముద్రాల్లోకి నిష్క్రమించడం లేదు. ఎక్కడ్నుంచి వస్తాయో తెలియదు గాని, రెండు శాంతికపోతాలు సరిగ్గా నిర్ణయించిన వేళకు ఎగిరివచ్చి కవి రెండు భుజాలమీద వాలిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కవికి వేరే చిరునామా అక్కరలేదు. ఈ దృశ్యాలే శాశ్వత చిరునామాలా నిలిచి పోతున్నాయి. కవి తన పెరట్లోని మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. గేటును నెట్టుకుంటూ ఓ వ్యక్తి వచ్చి కవిముందు నిలబడ్డాడు. మనిషి వొంట్లో రక్తమాంసాలకంటే, నిరాశ, నిష్పృహలే అధికంగా వున్నట్లు కనిపిస్తున్నాడు. వచ్చీరాగానే... "నన్ను నేను కోల్పోయి ఎన్నేళ్ళయిందో, అశాశ్వత సంపదపై మక్కువను తొలిగించే రోజుకోసం ఎదురుచూస్తున్నాను...' అన్నాడు. వెంటనే కవి తన ప్రక్కనే వున్న మొక్కనుంచి ఒక పుష్పాన్ని త్రెంచి చేతికందించాడు. ఆ పుష్పం చాలా పరిమళంగా వుందతనికి. తన ఆశ నెరవేరుతుందన్న నమ్మకం, ఆ పూవులోని ప్రతి రెక్కలోనూ కనిపించింది. ఇప్పుడు అతడి రక్తంనిండా చెప్పలేనంత ఉత్సాహం. కవికి నమస్కరించి పెద్ద, పెద్ద అంగలతో బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఒకరోజు కవిత రాస్తూ, మధ్యలో ఆపి నాతో కవి ఇలా సంభాషించాడు... "నన్ను నేను పూర్తిగా మార్చుకొని చిన్నపిల్లాడిలా మారిపోవాలని వుంది. వెలుగు సుగంధాలు వెదజల్లుతూ సూర్యుడు మన ఇంటిలోంచే లోకాన్ని చూడాలనే వెర్రి ఆశ నాది..." అన్నాడు. తిరిగి కవిత రాయటానికి ఉపక్రమించాడు. ఆయన కవితల్ని నేను చాలా చదివాను. అవి ఎలా ఉంటాయంటే, కొన్ని పదాలను చనుబాలలో తడిపి, గుదిగుచ్చి మాలకట్టి, పాటకు శ్వాసనూది ఆకాశంలోకి ఎగిరేసినట్లుగా వుంటాయి. కవిత పూర్తయ్యాక చదివితే, ఆ పంక్తులన్నీ మానవతావనమై వికసిస్తున్న ఓ కమ్మని పాటగా విశ్వ హృదయాన్ని తాకుతూ స్పృసిస్తుంది. ఇంతలో కవి నావైపు చూశాడు. తాను రాస్తున్న కవిత పూర్తయినట్లుంది. ఎప్పుడు ఏ కవిత పూర్తి చేసినా ఆయన ముఖంలో పచ్చని పంట విచ్చుకున్నట్లుగా వుంటుంది. ఈ రోజు తాను రాసిన కవితపట్ల కవి చాలా సంతృప్తిగా కనిపిస్తున్నాడు. ఆయన్ని చూస్తూవుంటే 'యుద్ధభూమిలో ఆయుధాలు లేని సైనికుడిలా, ఒక్క నెత్తురుచుక్క నేల రాలకుండా విజయం సాధించిన వీరుడిలా కనిపిస్తున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసే మానవసంతతి సమూహంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటానికి నిత్యం శ్రమిస్తూనే వుంటాడు ఈ కవి. ఆయన్ని సమీపంగా చూసినప్పుడల్లా మనిషి అజేయుడు, మనిషి ఒక్కడే అజేయుడన్న మాట, మళ్లీ, మళ్లీ నాతో కరచాలనం చేస్తూనే వుంటుంది.

ఆకాశంలో సూర్యుడు మండిపోతున్నాడు. అంతకంటే చాలా కోపంగా వున్నాడు కవి. ఎవర్నో గుమ్మం దగ్గరే నిలబెట్టి కేకలేస్తున్నాడు. “నీ పేరు ఉచ్ఛరించటానికే నాకు మనసొప్పటం లేదు. నువ్విప్పుడొక చెల్లని 'నోటు'వి మాత్రమే కాదు, 'నోటా'వి కూడా. మా కంటి చూపుల్ని పొట్టనబెట్టుకొని ఆకలి తీరిన రాక్షసుడిలా బ్రేవ్ మని త్రేన్పుతున్నావు. యుద్ధానికి, అణుయుద్ధానికి నువ్వే కారణమైతే మా కాశ్మీరీల కుంకుమ సాక్షిగా చెబుతున్నాం... ఎదుగుతున్న నీ స్వప్నాల్ని ధ్వంసం చేసి మీ శ్వాసల్ని దిష్టిబొమ్మను చేసి, మెలుకువతో మా కాలి బాటలు సరిచేసుకుంటాం మొహమాటాలే లేకుండా... వెళ్లు..." అంటూ వాడి చొక్కా పట్టుకొని గట్టిగా విసిరేశాడు. వాడు నేరుగా భారతదేశ సరిహద్దులు దాటి హిమాలయాలకు ఆవల పడిపోయినట్లుంది. వాడు వెళ్లిపోయాక చుట్టూవున్న వాళ్లందరిని చూస్తూ... "వాడేదో పంట పొలమైనట్లు, మనమేదో కలుపుమొక్కైనట్లు మనలో కొందరిని బాహాటంగా లొంగదీసుకుంటున్నాడు. ప్రతిఘటన ఎదురైనప్పుడే శక్తిని కూడగట్టుకొని విస్తరిస్తూ పోవాలి. ఇప్పుడు ఎవరికి వాళ్లం నిట్టనిలువునా చీల్చుకుని, ఒక్కటిగా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. దారులన్నీ సుగమం చేయండి. పర్వతాలు ప్రవహిస్తున్నాయి నదుల్లా, నక్షత్రదీపాలు వెలిగించి, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి, ఆకుపచ్చని జెండాలు ఎగరేస్తూ స్వాగత గీతాలు పాడండి. జయహెూ అజేయుడా!...' అంటూ ఆయన గట్టిగా నినాదాలు చేశాడు. ఆయన మాటలు అక్కడ విన్నాక, కవులంటే కణకణమండే అగ్నికణాలని, కవితో మాట్లాడటమంటే సూర్యుడితో మాట్లాడటమని తెలిసింది. ఆయన పదాల అస్త్రాలకు నమస్కరించకుండా ఉండలేకపోయాను.

రెండురోజుల తరువాత మళ్లీ నేను ఆయన దగ్గరికి వెళ్లాను. ఏదో రాసుకుంటున్నాడు. నన్ను చూసి కూర్చోమన్నాడు. ఎప్పటిలాగే ఆయనకు ఎదురుగా కూర్చున్నాను. ఆయన రాయటం ఆపకుండనే మాట్లాడుతున్నాడు. ఏం రాస్తున్నారని చనువుగా అడిగాను. ఆయన తలపైకెత్తి, సూటిగా నా కళ్లల్లోకి చూస్తూ "అట్టడుగు పొరల్లో ఇంకిపోతూ పేదరికంలో మగ్గుతూ నిత్య మరణానికి చేరువయ్యే నల్లమొగ్గల కోసం నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ కొత్త చిరునామా రాసుకుంటున్నాను . ఇలా రాసుకుంటున్నప్పుడు కొత్త వాసనేదో ముక్కుపుటాలు తాకి, పరవశమైన ఒకానొక మార్మిక రసానుభూతి నా పంచన చేరుతోంది. ఈ క్షణం నాలో జీవనదులు ప్రవహిస్తున్నాయి, మంచుపూలు పరిమళిస్తున్నాయి. నెమలిపింఛంలా పురివిప్పిన పాటలు, పండుగలు చేసుకుంటున్నాయి. యుద్ధరహిత ప్రపంచం కోసం స్వాగత గీతం పాడుతున్నాను విను"... అన్నాడు కవి. ఆ మాటలు విశ్వాసపు ఆకాశాన్ని వెలిగించే మెరుపు తీగల్లా అనిపించాయి. తాదాత్మ్యం చెందిన నా మనసు ఒక్కసారిగా పులకరించిపోయింది.

ఆయన జీవన సరళిని అధ్యయనం చేసిన నాకు తెలిసిందేమిటంటే, ఏ జామున లేస్తాడో గాని, నొసటిన అక్షరసూర్యుడ్ని మోస్తూ, ఆకలిపాటను నిశ్శబ్దంగా పాడుకుంటూ వుంటాడు. పిడికెడు ఆత్మీయ వెలుగు కిరణాల్ని పంచుతూ అక్షర వీరులతో చేతులు కలిపి వారసత్వపు జెండాను మోస్తూ, ప్రశ్నించే గొంతులకు చైతన్యపు శ్వాసనిస్తూ, వెన్నెల వెలుగుల్ని పంచుతూ వుంటాడు. కవికి నమస్కారం చేసి వీడ్కోలుకు సిద్ధమయ్యాను. ఒక్కమాట! అంటూ దగ్గరికి పిలిచి రేపు ఉదయం కొంచెం తొందరగా రమ్మన్నాడు. ఇద్దరం కలిసి ఒక పర్ణశాలకు వెల్దామన్నాడు. వివరాలు నేను అడిగేలోపలే ఆయన లోపలికి వెళ్లిపోయాడు.

తెల్లారింది. అనుకున్న సమయానికి ముందే ఆయన ముందు హాజరయ్యాను. ఇద్దరం కలిసి పర్ణశాల చేరాం. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, తెలుగుదనానికి ప్రతీకగా వుంది. ప్రతి కుటీరం ముందు తెలుగు అక్షరమాల చాలా అందంగా అలంకరించబడివుంది. ఆ ప్రాంగణంలో విస్తారంగా విస్తరించిన వృక్షాలకన్నింటికీ తెలుగు మహాకవుల పేర్లను పెట్టటం నాకు చాలా ఆశ్చర్యాన్ని, మరింత రెట్టింపు ఆనందాన్ని కలిగించింది. అక్కడ ఏవో హెూమాలు జరుగుతున్నాయి. అవన్నీ సాహిత్య హెూమాలంటూ కవి నాకు పరిచయం చేశాడు. మొదట సందర్శించిన కుటీరంలో పచ్చటి వేపచెట్టులాంటి మనిషి, పసిబిడ్డ నవ్వుతో కనిపించాడు. ఆయన మునివేళ్లనుంచి ఏవో వాక్యాలు రాలుతున్నాయి. చూస్తే, పొద్దుటే పలకరించే వసంత మేఘాల్లా మిలమిలలాడుతున్నాయి. "నిత్యం నా ఆలోచనలకు చమురైనవాడు ఆయనే..." అంటూ కవి, నన్ను ఆయన సమీపానికి తీసికెళ్లాడు. “దేహఖడ్గాన్ని ధరించిన సహజ సంతకం, నిత్యం కొత్తతరం నుంచి నేర్చుకుంటున్నానంటూనే, నాలుగు తరాలను ప్రభావితం చేసిన సరికొత్త నిర్వచనాల ప్రతీక ఈ మహానుభావుడే...' అంటూ ఆయన్ని నాకు పరిచయం చేశాడు కవి. దగ్గరికెళ్లి నమస్కారం పెట్టాను. ఒక కవిత్వ చరణంతో నన్ను ఆశీర్వదించిన ఆ తెలుగు కవి ఎవరో కాదు, అక్షరాలను ఆకాశంలోకి ఎగరేసి, వాటిని కవితలుగా పుష్పింపజేసే అసాధారణ సాహితీవేత్త కె. శివారెడ్డి.

మరో కుటీరం సాదరంగా ఆహ్వానించింది. లోపలికి అడుగుపెట్టగానే ఒక చంటిబిడ్డ నవ్వు వినిపించింది. ఆ చంటిబిడ్డ ఎక్కడా? అంటూ నేను వెతుకుతూ వుంటే, ఆ నవ్వు ఆయనదే అంటూ తెల్లటి మేఘంలా ఎదురుగా నిలబడ్డ ఒక మహా సాహిత్య శిఖరాన్ని నాకు పరిచయం చేశాడు కవి. ఆ మహానుభావుడ్ని చూడగానే 'మరణం ఎవరికైనా ఒకటేననే వేదాంత జీవన సత్యసూత్రం...' ఆ గదినిండా ప్రతిధ్వనించింది. "కీర్తికోసం ఆరాటపడని పచ్చి పల్లెటూరి పెద్ద మనిషి ఆయన, సామాజిక న్యాయసూత్ర స్ఫూర్తి ప్రదాత, నిలువెత్తు జీవితంగా నడిచే సృజనల మొదటి వరుసలో మొదటి వారు ఆయనే..." అంటూ నా చేత నమస్కారం చేయించాడు కవి. "కడిగిన ముత్యమంటి కథలతో సాహిత్యాన్ని రక్తికట్టించిన బహుముఖీన సాహిత్య సృజనకారుడు, గుర్రం వారసుడు...” అంటూ ఆయన చుట్టూ నా చేత ప్రదక్షిణలు తనతోపాటు చేయించాడు కవి. అస్తిత్వ స్పృహ, అస్తిత్వ ధిక్కారం, సామాజిక వేదనలే వస్తువులుగా, తెలుగు మాగాణంలో నల్లరేగడి గింజలు పండించి, వందకు పైగా అతి శక్తివంతమైన గ్రంథాలు వెలువరించిన నిత్య సత్వాన్వేషి ఆచార్య కొలకలూరి ఇనాక్  దర్శనం ఒక భాగ్యంగా భావించి, ఆనందంగా ఇద్దరం బయటికి వచ్చాం.
            
బయటికి వస్తూనే “నమూనా మనిషిని చూశావా?" అంటూ అడిగాడు కవి. లేదని తల ఊపాను. “అయితే పదా చూద్దువు గాని...' అంటూ నన్ను మరో కుటీరంలోకి తీసికెళ్లాడు. ఎదురుగా సాహితీమూర్తి యం. నారాయణశర్మని చూపిస్తూ... "అదిగో ఆయనే అక్షర పరుసవేది. అయినా బతుకంతా నిత్య సంఘర్షణ. ఎప్పుడూ పదాలను నాలుక మీద నాట్యం చేయిస్తూ, బతుకు దారిలో కొత్త మలుపులు తిరుగుతూ కొత్తకొత్త కలలుకంటూ వుంటాడు...” అన్నాడు కవి. ఇద్దరం వెళ్లి ఆయన ముందు నిలబడ్డాం. "రాగద్వేషాలకతీతుడు, ఆధునిక సాహిత్య విమర్శకు ఆశాకిరణం, విశ్వభావనకు ప్రతీక అతడు...” అంటూ, "మేమిద్దరం ఒకరికొకరం మాటలతో యుద్ధాలు చేసుకునేవాళ్ళం. ఒక్కవారం కలవకపోతే నన్ను నేను కోల్పోయి, మోయలేని విషాద భారంగా తయారయ్యేవాడ్ని. అతడితో కరచాలనం ఎన్నటికీ ముగియని పదిలమైన స్నేహకావ్యం.  మనిషితనానికి అతడొక నమూనా. ఎంతపంచినా తరగని జ్ఞాన ఖజానా..." అంటూ కవి పలికిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క గజమాలగా మారి శర్మ కంఠాన చేరింది  “సాయంకాలమవుతోంది, తొందరగా మరొకర్ని కలవాలంటూ..." కవి నన్ను మరో కుటీరంలోకి ప్రవేశించేలా చేశాడు.

ఆ ప్రక్కగా కొంచెం దూరంగా చుట్టూ రకరకాల పూలమొక్కల పొదలతో చాలా రమణీయంగా మరికొన్ని కుటీరాలు కనిపించాయి. వడివడిగా అడుగులేసి వాటిని చేరుకున్నాం. లోపలికి వెళ్లితే అక్కడ మనుషులు లేరు. చిత్రపటాలు మాత్రం సజీవంగా దర్శనమిచ్చాయి. "ఆకాశమంత కనికరపు ఆయుధాన్ని నా దేహక్షేత్రం మీద నిలబెట్టి, కాలంతోపాటు పరుగెత్తే నమ్మకానిచ్చి, నన్ను సచేతనం చేసింది ఆ మహానుభావుడేనంటూ...” ఎదురుగానున్న దాశరథి రంగాచార్య తైలవర్ణపటం దగ్గరికి కవి నన్ను తీసికెళ్లాడు. ఆ ముఖంమీద చిరునవ్వుకు తోడుగా, నుదుట మూడు నామాల తిలకం, ఆ కనురెప్పల మీద సాహితీవేత్తగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా కీర్తించబడిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఏదో అడగబోయి ప్రక్కనున్న కవివైపు తిరిగాను. ఆయన నేత్రాలనిండా నీరు. నేను మౌనంగా నిలబడి పోయాను. ఆయనే చెప్పటం మొదలు పెట్టాడు. మాటలు ఎక్కడో నూతిలోనుంచి, కన్నీటి తడిని మోసుకొస్తున్నట్లుగా వున్నాయి. మరింత దగ్గరగా చేరి ఆ మాటలు వింటున్నాను. "స్వచ్ఛమైన బీజాలను నాలో నాటి, ఆకుపచ్చకాంతులు వెదజల్లుతూ, మళ్లీ రేపు కలుద్దామని చెప్పి, జీవితపు పల్లవులు పాడుకుంటూ వెళ్లిపోయారు. ఇంతవరకు తిరిగి రాలేదు..." అంటూ కవి పలికిన ఆ చివరి మూడు మాటలు దుఃఖాన్ని మోసుకొస్తూ ఆయన మనసునుంచి బయటికొచ్చాయి. ఇంతలో చల్లటి గాలి ఒకటొచ్చి కవిని తన ఒడిలోకి తీసుకొని తల్లిలా ఓదార్చింది.

 నాచేత మరో కుటీరంలోకి అడుగులు వేయించాడు కవి. లోపలికి వెళ్లి వెళ్లగానే "విశ్వ భాషను ఆవిష్కరించిన అక్షరం అతడే..." అంటూ గులాబీ పూలమాలతో వ్రేలాడుతున్న ఒక చిత్రపటాన్ని చూపించాడు కవి. "రన్నింగ్ కామెంట్రీ పునర్జన్మ పొంది తిరిగొస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి..." ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు కవి. రక్తం బదులు కవి వొంట్లో  దుఃఖం ప్రవహిస్తున్నట్లుగా వుంది. “మాటి మాటికి మాటలు ఖర్చు చేయని 'గాలిరంగు' కొయ్యకాలుతో లోకాన్ని చూడలేక మూగబోయింది...” అంటూ బాధతో నిలబడలేక కుర్చీ ఆసరాగా కూర్చుండిపోయాడు కవి. ప్రతిభావంతమైన వర్ణనలతో, పుష్టికరమైన సాహిత్య సంపదతో 'అమ్మచెట్టు', 'నీటిపుట్ట', 'తుఫాను తుమ్మెద', 'చేప చిలుక', 'గాలిరంగు'... ఇత్యాది గ్రంథాల సృజనకారుడు 'దేవిప్రియ' చిత్రపటానికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, మరో కుటీరంలోకి అడుగుపెట్టాం.

“అదిగో అతడే నిద్ర ఎరుగని మొనగాడు...' అంటూ వెళ్లి వెళ్లగానే అగరవత్తుల్ని వెలిగించి, 'అయిల సైదాచారి'  చిత్రపటాన్ని చూపిస్తూ “పల్లె సుగంధాలను ఏరుకొచ్చి, మాయమైపోతున్న మానవత్వానికి సకల మెళుకువలతో గొప్ప ఆశాగీతాన్ని రచించిన కలం యోధుడతడే..." అన్నాడు. దగ్గరికెళ్లి ఆయనను దర్శించుకున్నాను. కవి, నేనూ ఒకచోట సేదతీరుతూ కూర్చున్నాం. ఒక్కసారిగా గతించిన ఆయన మిత్రుడి జ్ఞాపకాలు కవి చుట్టూ చేరిపోయాయి. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ..." తనూ నేనూ అనేక కవిసమయాలను పంచుకుంటూ, కాలపు బరువులను మోసుకుంటూ, ఆకలి డొక్కలకోసం కవిత్వం రాశాం. పల్లెమట్టిని మనసారా స్పర్శించి పులకరించిపోయాం..." అంటూ భారంగా కళ్లు మూసుకున్నాడు కవి. రెండు కన్నీటిచుక్కలు నా చేతిమీద రాలిపోయాయి. కన్నీళ్లు తుడుచుకొని “నా మిత్రుడికోసం కవితా జలపాతాల్లో మునిగి తేలుతూ, చిరకాలం గుర్తుండిపోయే చిక్కటి స్నేహగీతమొకటి రాస్తాను..." అంటూ పైకిలేచి మరోసారి ఆ చిత్రపటానికి ఇద్దరం నమస్కారం చేసి, వెన్నెల్లో నడుచుకుంటూ పర్ణశాలనుంచి బయటికి వచ్చాం.

నేను తిరిగి నా నివాసానికొచ్చాక, అసలు నిద్ర రావటం లేదు. కవిని, ఆ కవి తత్వాన్ని గురించే ఆలోచిస్తున్నాను. అనేకానేక సందర్భాలలో ఆయనతో పంచుకున్న సంభాషణలన్నీ గుర్తుకొస్తున్నాయి. విశ్రాంతి ఎరుగని హృదయపు కదలికల్ని ఆయనలో నేను గమనించాను. నాలుగు గోడలమధ్య గాలిని బంధించి శూన్యంలో నఖచిత్రాలు గీస్తాడు. నాలుగు మొక్కజొన్న పొత్తులను ముందేసుకొని ఏ పొత్తులో ఎన్నెన్ని గింజలు ఉన్నాయో లెక్కిస్తూ,  కాలాన్ని మైనపుబొమ్మలా కరిగిస్తాడు. ఒకసారి మీ ఆనందానికి మూలమేమిటని ఆయన్ని అడిగాను. తడుముకోకుండా వెంటనే "కవిత్వం నా ఆశ, కవిత్వం నా శ్వాస, కవిత్వం నా అనిర్వచనీయమైన ఆనంద రహస్యం..." అంటూ చిరునవ్వును జతచేసి చెప్పాడు. వెంటనే నా వైపుకు తిరిగి “నేను నిజంగా బ్రతుకుతున్నది కవిత్వం నా ఊపిరి అయ్యాకే. కవిత్వాన్ని అవగాహన చేసుకోవటం నేర్చుకున్నాకే, ఈ ప్రపంచం మొత్తం నాకర్థమై పోయింది...' అన్నాడు. పరిశీలిస్తే ఈ కవి జీవితం చాలా వైవిధ్యంగా వుంటుంది. ఆయనకు జీవితమంటే చెమట చుక్కతో మొలిచిన పాటకు బాణీ, కన్నీటి చెమ్మతో పదునెక్కిన ఓ ఋతుసంగీతం. అందుకేనేమో ఋతువులన్నీ వరుసలో వచ్చి ఆయన వాకిలిముందు ఆహ్వానం పలుకుతూ వుంటాయి. నిన్నటిరోజు జరిగిన సంఘటనను నేను తప్పకుండా మీతో పంచుకోవాలి. పర్ణశాలను దర్శించుకొని తిరిగి వస్తున్నప్పుడు, నన్ను ఆగమని చెప్పి, ఒక నాగలి నమూనాను నా చేతికందించాడు. “ ఇకనుంచి నీ కలం ఇదే...” అన్నాడు. చూస్తే నాగలి చాలా పదునుగా వుంది. ఆయుధంలా వుంది. దాని ఒంటినిండా తెలుగు అక్షరాలే. కళ్లకద్దుకుని ఇంటికి తెచ్చుకున్నాను.

కొమ్మవరపు విల్సన్ రావు 'నాగలి కూడా ఆయుధమే...' కవితా సంపుటిని, దాని పేజీలు, దేనికవే విడిపోయేదాకా ఎన్నిసార్లు చదివానో నా కనురెప్పలకు గుర్తులేదు. పుస్తకంలోని సారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాక నాకే తెలియని, ఇంతకుముందెన్నడూ నా అనుభవంలోకి రాని ఒక విచిత్రమైన తాదాత్మ్యం ప్రపంచంలోకి విసిరేయబడ్డాను. పడింది సాహిత్యపు సముద్రంలో. ఈదుతూ, ఈదుతూ ఆ కవిత్వాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తూ, మనసును తాళపత్రాలుగా మార్చి, అనుభూతుల్ని ఇలా దృశ్యాలు, దృశ్యాలుగా ఒక రూపంలో నిక్షిప్తం చేసుకున్నాను.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios