సారాంశం
ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో సుమన్ ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటున్నారు. అయితే అడపాదడపా రాజకీయాలపై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.తాను సమాజ సేవలో ఉన్నానని చెప్పే సుమన్ సమకాలీన రాజకీయ అంశాలపై మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటరిగా వచ్చిన జగన్ ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలను, 22 ఎంపీ సీట్లలో విజయ దుందుభి మోగించింది. అయితే 5 ఏళ్ల గడవగానే పరిస్థితి పూర్తిగా తల కిందులైంది. భారీ విజయాన్ని చూసిన జగన్ మోహన్ రెడ్డి అంతే పతనాన్ని కూడా చూశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
ఎంతలా అంటే కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీరిలో టీడీపీ ఒంటరిగానే 135 సీట్లు సాధించగా, జనసేన 11, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఓటమిపై రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా విశ్లేషించారు. సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అభివృద్ధిని గాలికి వదిలేయడం వల్లే జగన్ ఓటమి చవి చూశారంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
ఇక వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారతీరు కూడా ప్రజల్లో అసహనం కలిగించిందంటూ మరికొందరు విశ్లేషించారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు, వైసీపీ ఓటమికి ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే జగన్ హయాంలో అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలను, తీసుకున్న నిర్ణయాలను పొడిగిన వారు కూడా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు సుమన్ కూడా జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను వైసీపీ హయాంలో ప్రైవేట్ పాఠశాలను అద్భుతంగా చేశారన్నారు. డిజిటల్ బోర్డులు, టాయిలెట్స్ మెరుగుపరిచారన్నారు. పేదలకు నేరుగా ఇంటికే పెన్షన్ అందించారని ఇవన్నీ జగన్ ప్రభుత్వంలో తనకు నచ్చాయని సుమన్ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని ప్లస్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయన్న సుమన్.. తన దృష్టిలో జగన్ ఓడిపోలేదని చెప్పుకొచ్చారు.
ఓవైపు మోదీ, పవన్, చంద్రబాబును ఎదుర్కొన్న జగన్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని, తక్కువ మార్జిన్‌తో ఓడిపోయారన్నారు. మొత్తం మీద జగన్ హయాంలో.. విద్య, వైద్యం, పెన్షన్ స్కీమ్ బాగా అమలు చేశారని, కరోనా సమయంలో జగన్ చాలా బాగా హాండిల్ చేశారని సుమన్ ప్రశంసలు కురిపించారు. దీంతో వైసీపీ అభిమానులు సుమన్ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.