ఆఫీసుల్లో లైంగిక వేధింపులు.. మహిళల్లో ఆ సమస్యలు
ఆధునిక కాలంలో లైంగిక వేధింపులు, హింస వంటివి ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపి ఎన్నో సమస్యలకు దారితీస్తుందని (నామ్స్) నార్త్ అమెరికన్ మెనోపాస్ సొసైటీ అధ్యయనం సారాంశం.
ఈ మధ్యకాలంలో మహిళలపై లైంగిక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. నాలుగు, ఐదేళ్ల పసి పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ల మహిళల వరకు ఈ లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే.. ఈ లైంగిక వేధింపులు మహిళల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనం చెబుతోంది. లైంగిక వేధింపులతో మహిళల్లో అధికరక్తపోటు, ఒత్తిడి లక్షణాలు, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువవుతాయని తాజాగా జరిపిన అధ్యయనంలో తేలినట్లు యూనివర్సిటీ ఆఫ్ పీటర్స్‌బర్గ్ తెలిపింది.
మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, వేధింపుల వంటి చర్యలను అరికట్టేందుకు #me too movement కార్యక్రమం అధికారికంగా 2007లోనే ప్రారంభమైంది. అత్యున్నత హోదాల్లో ఉన్న కొంతమంది హాలీవుడ్ సెలబ్రిటీలకూ వేధింపులు తప్పకపోవడంతో #Me Too Movement గతేడాది మరింత ఉధృతమైంది.
తాజాగా లైంగిక వేధింపులు మహిళల ఆరోగ్యంపై ఏవిధంగా ప్రభావం చూపాయనే అంశంపై..సుమారు 300 మంది మహిళలపై పరిశోధనలు జరిపారు. పని చేసే ప్రాంతాల్లో జరిగే వేధింపుల వల్ల 19 శాతం, లైంగిక హింస వల్ల 22 శాతం, పై రెండు కారణాల వల్ల 10 శాతం మేర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వెల్లడైంది. ఈ కారణాలతో ఆరోగ్యం దెబ్బతిని అధికరక్తపోటు, ఒత్తిడి, ట్రై గ్లిసరైడ్స్ శాతం పెరగడం, సరైన నిద్రలేకపోవడం, నిరాశ, నిస్పృహ, ఆందోళన వంటి సమస్యలు ఏర్పడతాయని నామ్స్ ఫలితాల్లో రుజువైంది. లైంగిక వేధింపులు, హింస అనేవి మహిళ జీవితం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముందని యూనివర్సిటీ ఆఫ్ పీటర్స్‌బర్గ్ ప్రొఫెసర్ డాక్టర్ రెబెక్కా థర్‌స్టన్ (నామ్స్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు)వెల్లడించారు.
ఆధునిక కాలంలో లైంగిక వేధింపులు, హింస వంటివి ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపి ఎన్నో సమస్యలకు దారితీస్తుందని (నామ్స్) నార్త్ అమెరికన్ మెనోపాస్ సొసైటీ అధ్యయనం సారాంశం. నామ్స్ తన అధ్యయనంలో వెల్లడైన ఫలితాల నివేదికను 2018 అక్టోబర్ 3-6న సాన్‌డియాగో జరుగనున్న వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.