చైనాలో వందల మంది ప్రాణాలను తీసి, కోట్లాది మంది వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ ధాటికి అనేక దేశాలు వణికిపోతుండగా.. ఆ కరోనా వైరస్ పేరు చెప్పి ఓ యువతి మానాన్ని కాపాడుకుంది.

సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉంటే ఎంతటి ఆపద నుంచైనా కాపాడుకోవచ్చని ఆ అమ్మాయి నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవలే వుహాన్ నుంచి జింగ్‌షాన్‌కు వచ్చి నివసిస్తోంది.

Also Read:మా దగ్గర కరోనా బయటపడింది.. మీరు ఓసారి చెక్ చేస్తారా: గాంధీకి ఓ హాస్పిటల్ లేఖ

ఈ క్రమంలో గత శుక్రవారం ఆ మహిళ ఉంటున్న ఇంట్లోకి ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ప్రవేశించాడు. చేతికందిన దానిని సర్దేసిన ఆగంతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసి అత్యాచారానికి యత్నించాడు.

తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్న అతని బారి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్ధం కాలేదు. ఈ క్రమంలో ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఆ దొంగతో తనకు వుహాన్‌లో వున్నప్పుడు కరోనా వైరస్ సోకిందని.. ఈ వ్యాధి బారి నుంచి కాపాడుకోవడానికి తనను తాను నిర్భంధించుకున్నానని అబద్ధం చెప్పింది.

Also Read:స్మార్ట్ ఫోన్ల పరిశ్రమపై కరోనా వైరస్ ఎఫెక్ట్...

అంతేకాకుండా ఇది నిజమని నమ్మించేందుకు పదే పదే అతని ముందు దగ్గుతున్నట్లు నటించింది. దీంతో భయాందోళనకు గురైన ఆ దొంగ ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇంట్లో వున్న 3,080 యువాన్లను దొంగ అపహరించుకుపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.