ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి  ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారినపడి చైనాలో ఇప్పటి వరకు 400 మంది మరణించగా.. వందల సంఖ్యలో కరోనా లక్షణాలతో ఐసోలేటేడ్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

భారత్‌లోనూ ఇప్పటి వరకు 3 కరోనా కేసులు బయటపడగా.. పలు నగరాల్లో అనుమానితుల జాడలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా పలువురు కరోనా అనుమానితులు కనిపించడంతో వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read:స్మార్ట్ ఫోన్ల పరిశ్రమపై కరోనా వైరస్ ఎఫెక్ట్...

గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్లు ఏర్పాటు చేయగా.. మరోవైపు నగరంలో కూడా కరోనా వ్యాధి ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా భయం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ.. నగర వాసులు మాత్రం భయాందోళనలకు గురవుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. తమ ఆస్పత్రిలోని ఆరు నెలల శిశువుకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని, మీరు ఒకసారి చెక్ చేయాలంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన వైద్యులు గాంధీ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.

Also Read:వజ్రాలకు కరోనా వైరస్...వేల కోట్ల నష్టం!!

అయితే ఈ లేఖపై గాంధీ వైద్యులు మండిపడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైరాలజీ ల్యాబ్ ఉంటే.. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ పరీక్షలు ఎలా చేశారంటూ వారు అనుమానిస్తున్నారు. వదంతులు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని.. వైద్యులు ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయాలని గాంధీ వర్గాలు భావిస్తున్నాయి.