టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టు ఇదే.. బ్రియన్ లారా కామెంట్స్ వైరల్
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 ఈ సారి వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. ఐపీఎల్ నేపథ్యంలో పలువురు కొత్త ప్లేయర్లు కూడా వరల్డ్ కప్ భారత జట్టులో చోటు కోసం పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా 2024 టీ20 ప్రపంచకప్ కోసం తన ఫేవరెట్ 15 మంది భారత ఆటగాళ్లను ఎంపిక చేశాడు.
T20 World Cup 2024 - Team India : టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే పలువురు మాజీ దిగ్గజాలు భారత జట్టులో ఉండాల్సిన ప్లేయర్లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తన ఫేవరెట్ 15 మంది భారత ఆటగాళ్లను ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపిక చేశాడు. స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో బ్రియాన్ లారా ఎంపిక చేసిన జట్టు పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో పలువురు కీలక ప్లేయర్లకు చోటుదక్కకపోవడం గమనార్హం.
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టులో అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు బ్రియాన్ లారా చోటు కల్పించాడు. దీంతో పాటు యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, ఐపీఎల్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌లకు కూడా చోటు దక్కింది. అలాగే, బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్, ఫ్లెక్సిబిలిటీ పెరిగేలా లారా వికెట్ కీపింగ్ బాధ్యతను సంజూ శాంసన్, రిషబ్ పంత్ లకు అప్పగించాడు. బ్రియాన్ లారా శివమ్ దూబే ఆల్ రౌండ్ సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే రవీంద్ర జడేజాకు అవకాశం ఇచ్చాడు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ లకు ఓటువేశాడు. బుమ్రాతో పాటు, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ, మయాంక్ యాదవ్‌లను ఫాస్ట్ బౌలర్లుగా లారా ఎంచుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం బ్రియాన్ లారా ఎంపిక చేసిన భారత టీమ్
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ, మయాంక్ యాదవ్.
స్టార్ ప్లేయర్లకు షాక్..
రింకూ సింగ్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్లకు బ్రియాన్ లారా తన జట్టులో చోటు కల్పించలేదు. రింకూ సింగ్ ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్ ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్‌గా తన ఇమేజ్‌ని మరింత పెంచుకున్నాడు. మహ్మద్ సిరాజ్ భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌లో ఒక భాగం, అయితే లారా వారిలో ఎవరిపైనా విశ్వాసం వ్యక్తం చేయలేదు.