ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా మాదాపూర్ లో ఏర్పాటు చేసిన పెన్సిల్ స్కెచ్ ఎగ్జిబిషన్ చూపరులను ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్ అరుదైన చిత్రాలను, ప్రజా జీవితంలోని చారిత్రాత్మక సంఘటలకు సంబంధించిన చిత్రాలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు.

మాదాపూర్ లోని ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ఈ ఎగ్జిబిషన్ ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పుట్టినరోజు అంటే ఒక చరిత్ర అన్నారు.

14 సంవత్సరాల స్వరాష్ట్ర ఉద్యమం మాదిరిగానే, గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక ఉద్యమంలా ప్రగతి సాధిస్తూ దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల కోసం వివిధ రకాల పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు  జరుగుతున్నాయన్న మంత్రి మల్లారెడ్డి,సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.  

సీఎం కేసీఆర్ 66 వ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛంధంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయక అన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు, టీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్. కేసీఆర్ పుట్టిన రోజును ప్రజలంతా  రాష్ట్ర పండుగగా భావిస్తున్నారని క్రిషాంక్ తెలిపారు.

ఎంతోమంది కళాకారులు వేసిన కార్టూన్స్, పెయింటింగ్స్, స్కెచ్ పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్ ల నుండి, ప్రముఖ క్యూరేటర్ రమణరెడ్డి ఎంపిక చేసిన చిత్రాలను ఆర్ట్ గ్యాలరీ లో ప్రదర్శించామన్నారు మన్నె క్రిషాంక్.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి క్షణం జీవితంతో తీపి గుర్తులుగా మిగిలిపోయాయన్నారు డా.రాకేష్ చిరుమిల్ల. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షాలాది ఎకరాలు పచ్చని శోభను సంతరిచుంకోవడం, పల్లెల్లో 24 గంటల కరెంటు లాంటి విషయాలు బంగారు తెలంగాణకు చిహ్నమన్నారు. అంతెకాదు మన్నె క్రిషాంక్ ను కలిసిన ప్రతిసారి ఉధ్యమ విషయాల గురించే చర్చించుకునే వాళ్లమని తెలిపారు డా.రాకేష్ 

ఈ కార్యక్రమంలో నంది అవార్డు గ్రహీత, డైరెక్టర్ సాగర్ రెడ్డి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, అధికారులు , వివిధ సంఘాల నేతలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.