పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు: ఉత్తమ్
బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.కేసీఆర్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు.బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని మంత్రి చెప్పారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడ రాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే ఏమౌతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. పిల్లర్లు కుంగిన సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.ఈ బ్యారేజీలోని నీటిని అప్పటి ప్రభుత్వం ఖాళీ చేయలేదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ భయాందోళనలో ఉన్నారని.. అందుకే పొలంబాట పట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తుందన్నారు.
తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఏడాది వర్షాకాలంలో వర్షాలు సమృద్దిగా కురవలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రిజర్వాయర్లలో కూడ నీరు తగినంత లేని విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడడంతో పాటు మంచినీటి అవసరాలను ఉన్న నీటిని వాడుకొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించింది కేసీఆర్ సర్కార్ మాత్రమేనని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాలు అక్రమంగా ఏపీకి ఉపయోగించుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులను కేసీఆర్ సర్కార్ ఎలా వాడుకుందో అందరికీ తెలుసునని చెప్పారు.తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.