- Home
- Telangana
- Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
తెలంగాణ అడవుల్లో అత్యంత విషపూరితమైన 'బ్యాండెడ్ క్రేట్' పాము కనిపించి కలకలం రేపింది. సాధారణంగా ఆగ్నేయాసియాలో కనిపించే ఈ నలుపు-పసుపు చారల పాముకు ప్రాణాంతకమైన విషం ఉంటుంది. దీన్ని చూస్తే చంపకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

తెలంగాణలో ప్రాణాంతక బ్యాండెడ్ క్రేట్ స్నేక్
Snake: తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన, భయంకరమైన విషసర్పం 'బ్యాండెడ్ క్రేట్' కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది... అటవీ శాఖ అధికారులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. శరీరమంతా నలుపు, పసుపు రంగు మందపాటి చారలతో కనిపించే ఈ పాము కాటేస్తే మనిషి బతకడం దాదాపు అసాధ్యం. సాధారణంగా చైనా, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పాము ఇప్పుడు మన దగ్గర కూడా కనిపించడంతో ప్రజలు, పాముల నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
ఏటూరునాగారం, పాకాల అడవుల్లో భయంభయం
ఏటూరునాగారం శివారులోని రాత్రిపూట ఈ పాము రోడ్డు దాటుతుండగా కొందరు ప్రయాణికుల కంటపడింది. మొదట ఈ నలుపు-పసుపు చారల వింత పామును చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత కాస్త దైర్యం తెచ్చుకుని ఈ పామును ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో ఇది చాలా అరుదైన పాము అని తెలిసింది. గతంలో వరంగల్‌లోని పాకాల అడవుల్లో, ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివార్లలో కూడా ఇలాంటి పామే కనిపించింది. అశోక్ నగర్‌లో పొలం పనులకు వెళ్లిన రైతులు దీన్ని మొదటిసారి చూసి, ఏదో ప్లాస్టిక్ బొమ్మ అనుకున్నారు. కానీ అది కదలడం మొదలుపెట్టగానే భయంతో వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
5 అడుగుల పొడవున్న ప్రాణాంతక సర్పం
సమాచారం అందుకున్న వెంటనే అటవీ అధికారులు, స్నేక్ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సుమారు 5 అడుగుల పొడవున్న ఈ పామును చాలా చాకచక్యంగా పట్టుకుని, దట్టమైన అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు.
పాముల నిపుణుల ప్రకారం.. ఈ పాము విషం 100 శాతం ప్రాణాంతకమైన న్యూరోటాక్సిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే విషం నాడీ మండలంపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మనిషి చనిపోతాడు.
చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించినా, అంతే ప్రమాదకరమైన విషాన్ని ఇది కలిగి ఉంటుంది. రాత్రిపూట చాలా చురుకుగా ఉండే ఈ పాము, సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ దానికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం వెంటనే దాడి చేస్తుంది.
సరుకు లారీల ద్వారా వచ్చిందా?
సాధారణంగా ఈ 'బ్యాండెడ్ క్రేట్' పాములు చైనా, నేపాల్, థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మన దేశంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. తెలంగాణ అడవుల్లో ఇవి కనిపించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు రవాణా లారీలలో దారి తప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
అటవీ శాఖ ముఖ్య విజ్ఞప్తి
ఈ పాములు సాధారణంగా ప్రశాంత స్వభావం కలవి. రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం బయటకు వస్తాయి. ప్రజలు లేదా రైతులు నలుపు, పసుపు చారలున్న ఇలాంటి పాములను చూసినప్పుడు భయపడి చంపవద్దు. పాములను చంపడం నేరం. వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్నవారికి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

