- Home
- Feature
- Snakes : పాముకు కాటేయడమే కాదు కాపాడటం తెలుసు.. ప్రాణాలు తీసే ఈ జీవులు ప్రాణం ఎలా పోస్తాయో తెలుసా?
Snakes : పాముకు కాటేయడమే కాదు కాపాడటం తెలుసు.. ప్రాణాలు తీసే ఈ జీవులు ప్రాణం ఎలా పోస్తాయో తెలుసా?
పాములకు కాటేసి ప్రాణాలు తీయడమే కాదు కరుణించి ప్రాణాలు కాపాడటం కూడా తెలుసు. వాటివల్ల రైతులకే కాదు పర్యావరణానికి కూడా కనిపించని లాభం జరుగుతోంది… ఎలాగో తెలుసా?

పాములు శత్రువులు కాదు రైతు మిత్రులు
ఒకప్పుడు పొలంలో పాము కనబడితే దాన్ని చంపేందుకు పరుగులు తీసేవాడు ఓ తెలుగు రైతు రాములు. ఒకరోజు తన వరి పొలంలో తెగుళ్లు విపరీతంగా పెరగడం గమనించాడు. ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం లేదు... అప్పుడే ఓ వృద్ధ రైతు సలహా మేరకు పాములను చంపడం ఆపివేశాడు. కొన్ని వారాల్లోనే పాముల సంఖ్య పెరిగి, అవి తెగుళ్లకు కారణమయ్యే జీవులను తినడం ప్రారంభించాయి. ఆ తర్వాత రాములు పంట దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఈ సంఘటన అతనికి పాముల పట్ల పూర్తి అవగాహన కల్పించింది. ఇలా ఒక్క రాములే కాదు ప్రతి రైతు పాముల పట్ల అవగాహన పెంచుకుంటే పంటదిగుబడి పెంచుకోవచ్చు.
భారతదేశంలో రైతులు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల పంట నష్టాన్ని తెగుళ్ల వల్ల చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఎలుకలు, కీటకాలు, పక్షులు వంటివి ధాన్యం, కూరగాయల పంటలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. వీటినుండి పంటను కాపాడుకునేందుకు రైతులు రసాయన పురుగు మందులు వాడతారు.. దీంతో పంట నాణ్యత తగ్గడంతో పాటు పర్యావరణానికీ హాని కలుగుతోంది. ఈ రసాయనాల వల్ల పంట దిగుబడి పెరుగుతుందని అనుకున్నా, దీర్ఘకాలంలో భూమి సారవంతం దెబ్బతింటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలు అవసరం.
ప్రాణాలు కాపాడే పాములు కూడా ఉంటాయా...!
పాములు కేవలం మనుషుల ప్రాణాలు తీయడమే కాదు, ప్రకృతిలో సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎలుకలు, కప్పలు, కీటకాలను తింటూ పంటలను రక్షిస్తాయి. ఒక పాము సంవత్సరానికి వందల ఎలుకలను తినడం ద్వారా పంట నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ సహజసిద్ధమైన తెగుళ్ల నివారణ పద్ధతి రసాయన పురుగు మందుల ఖర్చును తగ్గిస్తుంది, రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. పాములు ఉండే పొలంలో తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
వరి, గోధుమ వంటి పంటలో దాదాపు నాలుగో వంతు భాగాన్ని ఎలుకల వల్ల నష్టపోతున్నారు రైతులు. భారతదేశవ్యాప్తంగా చూస్తే ఎలుకలు ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సుమారు ఐదో వంతు భాగాన్ని నాశనం చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వేలకోట్ల నష్టం జరుగుతోంది.. ఆహార భద్రత అత్యంత కీలకమైన మన దేశంలో ఆహార సరఫరాకు నేరుగా ముప్పు ఏర్పడుతోంది. దీనిని అడ్డుకోవడానికి అత్యంత సమర్థవంతమైనది, ఎలాంటి ఖర్చు లేనిది, ఇంధనం అవసరం లేనిది, నిరంతరం పనిచేసేది పాములు మాత్రమే.
అయితే పాములు పంటను కాపాడే విషయాన్ని రైతులు మరిచాయి... దానివల్ల కలిగే హానిని మాత్రమే గుర్తుంచుకున్నాడు. పాము ఏ రైతులను కాపాడుతుందో, అదే రైతులు కనిపిస్తే చాలు వెంటనే చంపేస్తున్నాయి. దీంతో పాముల పట్ల భారతదేశంలో ఉన్న ఈ శత్రుత్వ వైఖరి ఏర్పడింది... ఇది నిశ్శబ్దంగా దేశ సొంత ఆహార భద్రతను దెబ్బతీస్తోంది.
పాములను కాపాడుతున్న రైతులు
అయితే గతంలో పాములను చూస్తే భయపడి చంపేవారు రైతులు. కానీ ఇప్పుడు చాలా మంది రైతులు తమ పొలాల్లో పాములను రక్షించడానికి ముందుకు వస్తున్నారు. కొందరు రైతులు తమ పొలంలో పాములకు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, పాముల ద్వారానే తెగుళ్లను నియంత్రిస్తున్నారు. ఈ మార్పు కేవలం పంట దిగుబడిని పెంచడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలోనూ దోహదపడుతుంది. తమ పంటలకు పాములు నిజమైన రక్షకులని వారు గ్రహిస్తున్నారు.
ఎలుకల మందు వాడటం పర్యావరణానికి హానికరం... కానీ పాములు ఎలుకలను తినడం వల్ల ఆహారపు గొలుసులో విషాన్ని మిగల్చదు. అంటే విషం తిన్న ఎలుకలను తినడం వల్ల గుడ్లగూబలు, పిల్లులు, కుక్కలు చనిపోయే ప్రమాదం ఉండదు. అయితే పొలం నుండి పాముల వంటి సహజ శత్రువులను తొలగిస్తే, ఎలుకల సంఖ్య అనియంత్రితంగా పెరిగిపోయి, ఒకే సీజన్‌లో పంట నష్టాలు తీవ్రంగా పెరుగుతాయి. కాబట్టి అపాయం లేనప్పుడే పాములను చంపకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పాములు లేని పర్యావరణం చాలా ప్రమాదకరం
ఈ పాముల ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అవి పర్యావరణ వ్యవస్థలో ఒక అంతర్భాగం, ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తాయి. పాములు లేని పర్యావరణంలో ఎలుకలు, కీటకాలు పెరిగి పంటలకు మరింత నష్టం కలిగిస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పాములను రక్షించడం ఒక ముఖ్యమైన అంశం. దీని వల్ల ఆర్థికంగా లాభపడటమే కాకుండా, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని బావి తరాలకు అందించగలం. స్థానిక ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా కృషి చేయాలి.
దేశంలో కొన్నిప్రాంతాలలో రైతులు ఓ అడుగు ముందుకేసి పాములను ప్రోత్సహిస్తున్నారు. నాగుపాములు, కట్లపాములు, రక్తపింజరల వంటి విషపూరిత జాతులతో సహా పాములు తమ తోటల్లో తిరగడాన్ని వారు స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా వాటిని గుర్తించి, వాటితో సురక్షితంగా కలిసి జీవించేలా కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు. దీని ఫలితంగా ఎలుకల సంఖ్య తగ్గడం, మెరుగైన దిగుబడులు వస్తున్నాయి... కూలీలకు అవగాహన రావడంతో పాముకాటు సంఘటనలు కూడా తగ్గాయి. ఎందుకంటే అవగాహన ఉన్న కార్మికులు పాములను చూసి కంగారు పడకుండా, వాటిని రెచ్చగొట్టకుండా జాగ్రత్త పడుతున్నారు.

