Mirabai Chanu: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Mirabai Chanu: ఆసియా గేమ్స్ 2026లో మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. 1998 తర్వాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో దక్కిన తొలి పతకం ఇది కావడం విశేషం.

డ్రీమ్ నెరవేరింది.. ఆసియా క్రీడల్లో తొలి మెడల్
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ సాయిఖోమ్ మీరాబాయి చాను తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో మహిళల 49 కేజీల కేటగిరీలో ఆమె సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. నాగోయా సిటీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సెంటర్‌లో బుధవారం జరిగిన ఈ పోటీల్లో ఆమె మొత్తం 198 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో మీరాబాయికి ఇదే తొలి పతకం కావడం విశేషం.
రికార్డు లిఫ్ట్‌తో సిల్వర్ ఖాయం
ఈ కాంపిటీషన్‌లో మీరాబాయి చాను క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు, స్నాచ్ విభాగంలో 87 కేజీలు ఎత్తి మొత్తం 198 కేజీల స్కోరు నమోదు చేశారు. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలో 83 కేజీలు ఎత్తిన ఆమె, ఆ తర్వాత 85 కేజీలు, 87 కేజీలను చాలా ఈజీగా లిఫ్ట్ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో అత్యుత్తమంగా 111 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా సిల్వర్ మెడల్‌ను ఖాయం చేసుకున్నారు. ఇక నార్త్ కొరియాకు చెందిన రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ రీ సాంగ్ గుమ్ మొత్తం 215 కేజీలు (94 కేజీలు స్నాచ్ + 121 కేజీలు క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి వరల్డ్ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించి, ఆసియా గేమ్స్‌లో హ్యాట్రిక్ కొట్టారు. ఇండోనేషియాకు చెందిన విజయానా లులుక్ డయానా త్రి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు.
పాత గాయాలు.. గ్రాండ్ కంబ్యాక్
ఆసియా క్రీడలు మీరాబాయికి గతంలో పెద్దగా కలిసి రాలేదు. 2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో అరంగేట్రం చేసిన ఆమె తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018 ఆసియా క్రీడలకు వెన్నునొప్పి వల్ల దూరం కాగా, 2023 హాంగ్‌జౌ గేమ్‌లో హిప్ గాయం కావడంతో నాలుగో స్థానంలో నిలిచి పతకాన్ని చేజార్చుకున్నారు. అయితే ఈసారి ఆ పాత గాయాలను, చేదు జ్ఞాపకాలను అధిగమించి సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో రీ-ఎంట్రీ ఇచ్చి అనుకున్నది సాధించారు.
దిగ్గజం కర్ణం మల్లేశ్వరి రికార్డు సమం
ఈ సిల్వర్ మెడల్‌తో మీరాబాయి చాను మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 1998 బ్యాంకాక్ ఆసియా గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టింగ్ దిగ్గజం కర్ణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించిన తర్వాత, ఆసియా క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు పతకం రావడం మళ్లీ ఇప్పుడే. అంటే ఏకంగా 28 సంవత్సరాల తర్వాత భారత్‌కు ఈ విభాగంలో పతకం దక్కింది. అంతేకాకుండా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన కర్ణం మల్లేశ్వరి సరసన మీరాబాయి కూడా నిలిచారు.
ట్రోఫీల కేబినెట్‌లో చేరిన ఆసియా రజతం
భారత ప్రభుత్వం నుంచి 2018లో పద్మశ్రీ, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు అందుకున్న మీరాబాయి చాను ఖాతాలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలు ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్, 2017 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్, 2022, 2025 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో సిల్వర్ మెడల్స్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్ (2018, 2022, 2026), ఒక సిల్వర్ (2014) గెలుచుకున్నారు. ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఒక బ్రాంజ్ మెడల్ సాధించిన ఆమెకు, ఇప్పటివరకు లోటుగా ఉన్న ఆసియా క్రీడల మెడల్ కూడా ఇప్పుడు దక్కింది.

