- Home
- National
- Weather: 125 ఏళ్లలో చూడని విపత్తు.. మైండ్ బ్లాకింగ్ హిట్.. ఐఎండీ షాకింగ్ వెదర్ వార్నింగ్
Weather: 125 ఏళ్లలో చూడని విపత్తు.. మైండ్ బ్లాకింగ్ హిట్.. ఐఎండీ షాకింగ్ వెదర్ వార్నింగ్
Weather: ఆగస్టు 2026లో 125 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సెప్టెంబరులోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడుతుందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ఎల్ నినో భయాలు మరింత పెరిగాయి. అసలు వాతావరణంలో ఏం జరుగుతోంది?

125 ఏళ్ల రికార్డు బద్ధలు.. వర్షాలు పడవా? మళ్లీ ఎండలు మండుతాయా?
దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి.
సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆగస్టులో ఊహించని ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది.
ఎల్ నినో ఎఫెక్ట్ భయాందోళనలు
వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది.
ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన ఉక్కపోతను చూస్తున్నాయి.
సెప్టెంబరు నెలలోనూ ఇదే వాతావరణం
మాన్సూన్ ముగిసే సెప్టెంబరు నెలలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడేలా లేవు. దేశవ్యాప్తంగా వర్షపాతం ఎల్పిఏ (లాంగ్ పీరియడ్ యావరేజ్) లో 91 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
సాధారణంగా 1971 నుంచి 2020 మధ్య డేటా ప్రకారం సెప్టెంబరు సగటు వర్షపాతం 167.9 మిమీ ఉండాలి. కానీ ఈసారి మేఘాలు కరగడం కష్టమేనని అధికారులు చెప్తున్నారు. అయితే వాయువ్య, ఈశాన్య, తూర్పు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడవచ్చు.
రైతాంగానికి కోలుకోలేని దెబ్బ
వాతావరణంలో వచ్చిన ఈ సడన్ ఛేంజ్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఖరీఫ్ పంటల దిగుబడి, నాణ్యత బాగా తగ్గిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న, వరి, పత్తి పంటల సాగు విస్తీర్ణం తగ్గేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి నిర్దేశించిన 373.93 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని భావిస్తున్నారు.
సెప్టెంబరులోనూ పగటి వేళల్లో ఎండలు, రాత్రి పూట ఉక్కపోత కొనసాగుతాయి. పసిఫిక్ సముద్రంలో ఎల్ నినో ప్రభావం నవంబరు, డిసెంబరు వరకు మరింత బలంగా మారుతుందని, వచ్చే ఏడాది శీతాకాలం ప్రారంభంలో కూడా ఇది కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి ఈ వాతావరణ మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా మారనున్నాయి.

