- Home
- Feature
- Home Work: హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పిల్లలు ఎప్పటి నుంచి హోంవర్క్ చేయడం మొదలుపెట్టారంటే..
Home Work: హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పిల్లలు ఎప్పటి నుంచి హోంవర్క్ చేయడం మొదలుపెట్టారంటే..
Home Work: ఈ హోంవర్క్ కనిపెట్టినవాడు ఎవరో కానీ... అంటూ పిల్లలు తిట్టుకోవడం వింటూనే ఉంటాము. ఇప్పుడు అతని గురించే చెప్పుకోబోతున్నాడు. హోంవర్క్ పుట్టుక వెనుక కథ గురించి ఇక్కడ ఇచ్చాము.

హోంవర్క్ ఎవరు కనిపెట్టారు?
బడి గంట మోగగానే బ్యాగు సర్దుకుని ఇంటికి పరుగెత్తే పిల్లలు ఇంటికి వెళ్లాక ‘హోంవర్క్’ మొదలుపెడతారు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఈ హోంవర్క్ ఎవరు కనిపెట్టారో కానీ.. అంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఈ హోం వర్క్ అసలు ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా? దీనికి బీజం పురాతన రోమన్ సామ్రాజ్య కాలంలోనే పడింది. నాటి ప్రముఖ విద్యావేత్త క్వింటిలియన్ పిల్లలకు ఇంటి వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పిస్తే వారి జ్ఞాపకశక్తి, మాట్లాడే నేర్పు పెరుగుతాయని నమ్మి కొన్ని పనులు ఇచ్చేవారు. అయితే ఆధునిక ప్రపంచంలో ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం, 1905లో ఇటలీకి చెందిన ‘రాబర్టో నెవిలిస్’ అనే ఉపాధ్యాయుడు తరగతిలో అల్లరి చేసే పిల్లలను దండించడానికి, శిక్షగా ఈ హోంవర్క్‌ను కనిపెట్టాడట! పాఠశాల ముగిశాక కూడా పిల్లలు పుస్తకాలతో కుస్తీ పట్టేలా చేయడమే ఆయన ఉద్దేశం. కాలక్రమేణా అమెరికా విద్యావేత్త హోరేస్ మాన్ వంటి వారి ప్రయత్నాలతో ఇది శిక్షగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అధికారిక చదువులో తప్పనిసరి భాగంగా మారిపోయింది.
హోంవర్క్ వల్ల కలిగే లాభాలు
పిల్లలు హోంవర్క్ అంటే మొదట్లో ముఖం చిట్లించినా, విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. తరగతి గదిలో టీచర్ చెప్పినప్పుడు అంతా బాగానే అర్థమైనట్లు అనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చి సొంతంగా రాసేటప్పుడే విద్యార్థికి ఆ పాఠం ఎంతవరకు అర్థమైందో అసలు విషయం తెలుస్తుంది. ఏ టీచరూ పక్కన లేనప్పుడు, ఒంటరిగా కూర్చుని ఆలోచించి లెక్కలు చేయడం లేదా ప్రశ్నలకు జవాబులు రాయడం వల్ల పిల్లల్లో స్వయం ఆలోచన, పరిశోధనా తత్వం మరియు జ్ఞాపకశక్తి బలపడతాయి. అర్థం కాని విషయాల కోసం మళ్లీ పాఠ్యపుస్తకాలను తిరగేసి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. అంటే హోంవర్క్ అనేది చదివిన చదువును మెదడులో పదిలంగా దాచుకునే ఒక రోజూవారీ సాధన లాంటిది.
సమయపాలన, క్రమశిక్షణ కోసమే
హోంవర్క్ అనేది కేవలం మార్కుల కోసమో, రాసి చూపించడానికో మాత్రమే కాదు. అది జీవితానికి అవసరమైన క్రమశిక్షణను, సమయపాలనను నేర్పుతుంది. సాయంత్రం ఆడుకోవడానికి ఎంత సమయం కేటాయించాలి, ఇచ్చిన పనిని గడువు లోపల ఎలా పూర్తి చేయాలి అనే ప్రణాళికను పిల్లలు చిన్నతనం నుంచే నేర్చుకుంటారు. దీనివల్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించే అలవాటు వారిలో బలపడుతుంది. అలాగే తమ పిల్లలు చదువులో ఏ స్థాయిలో ఉన్నారో, వారికి ఏ విషయంలో ఇబ్బందులు ఉన్నాయో తల్లిదండ్రులు గమనించడానికి కూడా ఇది ఒక మంచి వారధిగా ఉపయోగపడుతుంది. అందుకే హోంవర్క్ భారం కాకుండా మితంగా, ఆసక్తికరంగా ఉంటే విద్యార్థి భవిష్యత్తును బంగారు బాటగా మార్చే గొప్ప ఆయుధంగా మారుతుంది!

