- Home
- Entertainment
- Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్ ఎంట్రీ
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్ ఎంట్రీ
Varshini Sounderajan: యాంకర్‌గా బుల్లితెరపై రచ్చ చేసిన వర్షిణి సౌందరాజన్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో రచ్చ చేసేందుకు వస్తోంది. హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఆమె బ్యాక్ గ్రౌండ్, ఆదాయం, కెరీర్ గురించి తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 10లోకి యాంకర్ వర్షిణి సౌందరాజన్
బుల్లితెరపై తన గ్లామర్, ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్, నటి వర్షిణి సౌందరాజన్ ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి అడుగుపెట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నో ఏళ్లుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఆమె పేరు వినిపిస్తున్నప్పటికీ, ఈసారి మాత్రం ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. దీంతో ఆమె షోకి గ్లామర్‌ని తీసుకొచ్చింది. తనదైన ఎనర్జీ, గ్లామర్‌తో ఆకట్టుకోబోతుందని, షోకి ఊపు తీసుకురాబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ‘ఢీ’, ‘పటాస్ 2’, ‘జబర్దస్త్’, ‘కామెడీ స్టార్స్’ వంటి షోలతో ప్రేక్షకులకు దగ్గరైన వర్షిణి.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో తన ఒరిజినాలిటీ చూపించబోతుంది. అదే సమయంలో తానేంటో చూపించబోతుందని చెప్పొచ్చు.
వర్షిణి బ్యాక్ గ్రౌండ్, చదువు
వర్షిణి సౌందరాజన్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగారు. ఆమె తమిళ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచే కెమెరా ముందు కనిపించాలనే ఆసక్తి ఉండేదని ఆమె గతంలో చెప్పిన సందర్భాలున్నాయి. మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత సినిమాలు, టెలివిజన్, వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేశారు. వర్షిణి విద్యాభ్యాసం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్న ఆమె.. అనంతరం ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినట్లు అందుబాటులో ఉన్న బయోగ్రఫీ వివరాలు పేర్కొంటున్నాయి. ఆమె డిగ్రీ విద్యను ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలలో పూర్తి చేశారు.
‘చందమామ కథలు’తో సినిమా ఎంట్రీ..
చదువు పూర్తయ్యాక సాధారణ ఉద్యోగంలోకి వెళ్లకుండా మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అక్కడి నుంచి నటిగా, ఆ తర్వాత యాంకర్‌గా మారిపోయారు. 2014లో విడుదలైన జాతీయ అవార్డు అందుకున్న తెలుగు చిత్రం ‘చందమామ కథలు’ ద్వారా వర్షిణి నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘లవర్స్’, ‘బెస్ట్ యాక్టర్స్’, ‘నన్ను దోచుకుందువటే’, ‘జోడీ’, ‘మళ్లీ మొదలైంది’, ‘శాకుంతలం’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ వంటి సినిమాల్లో నటించారు. అయితే సినిమాల కంటే ఆమెకు అసలు పాపులారిటీ తీసుకొచ్చింది మాత్రం టెలివిజన్. ముఖ్యంగా ‘ఢీ’ డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా కనిపించడం ద్వారా వర్షిణికి మంచి క్రేజ్ వచ్చింది. హైపర్ ఆదితో కలిసి ఆమె చేసిన ఎంటర్‌టైనింగ్ కెమిస్ట్రీ కూడా అప్పట్లో బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారింది.
యాంకర్‌గా వర్షిణి సౌందరాజన్‌కి వరుస అవకాశాలు..
‘ఢీ’ తర్వాత వర్షిణి ‘జబర్దస్త్’ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీముఖి తప్పుకున్న తర్వాత `పటాస్ 2`కు కో-హోస్ట్‌గా వ్యవహరించారు. స్టార్‌మాలో ప్రసారమైన `కామెడీ స్టార్స్`కు కూడా యాంకర్‌గా పనిచేశారు. టెలివిజన్‌లో ఆమెకు వచ్చిన గుర్తింపుకు ఈ షోలు ప్రధాన కారణమయ్యాయి. 2017లో హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్’ జాబితాలోనూ వర్షిణి చోటు సంపాదించారు.
‘పెళ్లి గోల’తో డిజిటల్ క్రేజ్..
వర్షిణి కెరీర్‌లో ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్ కూడా కీలక మలుపుగా చెప్పొచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సిరీస్‌లో అభిజీత్‌తో కలిసి నటించారు. ఈ సిరీస్ మూడు సీజన్లుగా కొనసాగింది. యూత్‌లో వర్షిణికి మంచి గుర్తింపు రావడానికి ఈ వెబ్ సిరీస్ కూడా ఉపయోగపడింది. దీనికితోడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్ ఫోటోలతో నెటిజన్లకి కనువిందు ఇస్తుంటుంది. దీంతో ఈ అమ్మడికి ఇంటర్నెట్లో యమ క్రేజ్ ఉంటేంది. అయితే ఇటీవల కొంత డల్ అయ్యింది వర్షిణి. ఇప్పుడు బిగ్ బాస్ షో ఆమెకి బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు.
హైపర్ ఆదితో లింక్.. ప్రేమ, పెళ్లి రూమర్స్
‘ఢీ’ షోలో హైపర్ ఆదితో వర్షిణి చేసిన కామెడీ, రొమాంటిక్ స్కిట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రేమ, పెళ్లి వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమాయణం ఉందన్న విషయాన్ని వర్షిణి స్పష్టం చేయలేదు. ఈ జోడీ మాత్రం టెలివిజన్‌లో మంచి ఎంటర్‌టైనింగ్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే గతంలో లవ్ బ్రేకప్ అయ్యిందని, పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందని, దీంతో మ్యారేజ్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ లేదని ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది.
‘కాస్టింగ్ కౌచ్’ కామెంట్స్ దుమారం
వర్షిణి కెరీర్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో కాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఓ వెబ్ సిరీస్ ఆడిషన్ సమయంలో దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి తనను హోటల్‌కు పిలిచి, ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు 2023లో వార్తలు వచ్చాయి. ఆ అనుభవాన్ని తన కెరీర్‌లో ఎదురైన చేదు సంఘటనగా ఆమె వివరించారు. అలాగే ‘ఢీ’ నుంచి వర్షిణి తప్పుకోవడం కూడా అప్పట్లో చర్చకు దారితీసింది. తర్వాత ఆమె ‘కామెడీ స్టార్స్’లో కనిపించారు.
ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో..
ఇలా మోడలింగ్ నుంచి నటిగా, నటిగా మొదలై యాంకర్‌గా, వెబ్ సిరీస్ నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి.. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మాటల్లో చురుకుదనం, కెమెరా ముందు ఉండే అనుభవం, టాస్కుల్లో పోటీ పడే స్వభావం ఆమెకు ప్లస్ పాయింట్లుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే టెలివిజన్‌లో తనకు ఉన్న ఫ్యాన్ బేస్ బిగ్‌బాస్ జర్నీలో ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అందులో కూడా గ్లామర్ ట్రీట్ పక్కా అనిపిస్తోంది.
బిగ్ బాస్ లోకి రావడం ఒక డివైన్ థింగ్
బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తూ వర్షిణిసౌందరాజన్ ఆసక్తికర కామెంట్ చేసింది. ఈ షోకి తాను ఫిట్ అవుతానా? హౌజ్‌లో ఉంటానా అనే అనుమానం ఉండేదని, తాను ఫిట్ కాదని ఎప్పుడూ అనుకుంటుండేదాన్ని అని, కానీ ఇన్నాళ్లకి బలంగా నిర్ణయించుకున్నానని, మనం వెళ్లాలి, అందులో ఆడి చూపించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపింది వర్షిణి. ఇదొక డివైన్ థింగ్ అని వెల్లడించింది.

