మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

చరిత్ర గుర్తించని ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సైరా చిత్రంతో ఆయన గురించి దేశం మొత్తం తెలిసే అవకాశం వచ్చింది. రాంచరణ్ నిర్మాతగా, దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అనుకుంటున్న తరుణంలో ఉయ్యాలవాడ కుటుంబీకుల వివాదం అభిమానులని ఆందోళనలోకి నెట్టింది. 

ఈ ఉదయం ఉయ్యాలవాడ కుటుంబీకుల పిటిషన్ హై కోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో సైరా చిత్రాన్ని ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని బోర్డు చెప్పడం, ఈ నెల 30 వరకు గడువు కావాలని కోరడంతో అభిమానుల ఆందోళన మరింత ఎక్కువైంది. 

ఇదిలా ఉండగా సైరా చిత్రంపై మెగా అభిమానుల కలవరపాటు దూరమయ్యేలా చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ ప్రకటించింది. సైరా చిత్రానికి సంబందించిన అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనితో సైరా రిలీజ్ కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు అయింది. సైరా చిత్రాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న ఉయ్యాలవాడ కుటుంబీకులకు ఇది షాకే.