'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' రివ్యూ
థియోటర్స్ ఎలాగో బాగా లేటు అయ్యేటట్లుంది. దాంతో అందరి దృష్టీ ఓటిటిపై పడింది. మీడియం రేంజి సినిమాలు ఒక్కొకటి గా విడుదల అవుతున్నాయి. తాజాగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ దర్శకుడు వెంకటేష్ మహా తీసిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. సత్యదేవ్ హీరో గా నటించిన ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన మహేషింటే ప్రతీకారం చిత్రానికి రీమేక్ బాహుబలి నిర్మాతలు ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఎంతో పేరు తెచ్చి పెట్టిన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు తన రెండో సినిమాగా ఈ రీమేక్ ని ఎంచుకునేటంత సత్తా ఉన్న విషయం ఇందులో ఏముంది...అసలు కథేంటి..మన తెలుగు వాళ్లకు నచ్చే సినిమా అవుతుందా..కేరాఫ్ కంచరపాలెం స్దాయిలో నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఉమా మహేశ్వర రావు(సత్యదేవ్) ఓ మెతక మనిషి. తన పనేదో తాను చూసుకుపోయే రకం. గోల,గొడవలు గిట్టవు. అరకు వ్యాలీలో “కోమలి ఫోటో స్టూడియో” నడుపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. అయితే అంత సైలెంట్ గా వెళ్లిపోయే ఈ ఫొటో గ్రాఫర్ ..కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనకు ఆజ్యం పోసే పరిస్దితి ఏర్పడుతుంది. ఓ రోజు వీధి రౌడీ జోగి (రవీంద్ర విజయ్)తో దెబ్బలాడే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. అయితే ఆ దెబ్బలాటలో చివరకు రౌడీ చేతిలో అందరి ఎదురుగా దెబ్బలు తినటంతో ..ఇగో లేదా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కానీ ఏం చేయగలడు. తనను కొట్టిన రౌడీని మళ్లీ తిరిగి కొట్టేవరకు చెప్పులు కూడా వేసుకోనని శపథం చేస్తాడు. అందుకు ఉమా మహేశ్వరరావు ఏం చేసాడు. జ్యోతి(రూపా కొడవయుర్) తో అతని ప్రేమ కథ ఏమైంది. మహేశ్వరరావు ఉగ్రరూపం దాల్చే సమయం ఎప్పుడు వచ్చింది వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కథ,కథనం
టైటిల్ ని ఫాలో అయితే ఓ పెద్ద పగ,ప్రతీకారం, ఉగ్రరూపం వంటివి ఎక్సపెక్ట్ చేస్తాం. అయితే సినిమాలో అవేమీ ఉండవు. ఓ సాదాసీదా జీవితాన్ని సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. మళయాళ మాతృకకు కొన్ని మార్పులు, చేర్పులు చేసారు కాని యాజటీజ్ అదే ఫాలో అయ్యారు అని ఓవరాల్ చూస్తే అనిపిస్తుంది. అంటే అంతలా ఆ సినిమా ప్రభావం ...ఈ దర్శకుడుపైన కూడా పడిందన్నమాట. తెలుగులో చేయదగ్గ రీమేకే కానీ ..సెకండాఫ్ మనకు తగినట్లు ఇంకా మార్చుకుంటే బాగుండును అనిపిస్తుంది. ముఖ్యంగా మనం ....హీరో ప్రతీకారం ఎపిసోడ్ ఎలా ఉంటుందని ఎదురుచూస్తూంటే...రొమాన్స్ సీన్స్ వస్తూంటాయి. అది కొంచెం డిస్ట్రబ్ చేస్తుంది. ఇక ప్రారంభంలో సెటప్ కు ఎక్కువ సమయం కేటాయించటంతో స్లోగా ఏమీ జరుగుతున్నట్లు అనిపించదు. మౌస్ ని కదపకుండా ఉండటం అసాధ్యం అనుకునే లోగా...అసలు ప్లాట్ లోకి వచ్చి రౌడి చేత మన హీరోని తన్నిస్తాడు. అక్కడ నుంచి కథ అందుకుంటుంది. అలాగని అక్కడ నుంచి స్పీడు ఏమీ అందుకోదు.కానీ..కథలోకు మనం ప్రయాణం చేయటం మొదలెడతాం. ముఖ్యంగా సహజమైన పాత్రలుతో కథ,కథనం నడపటంతో లీనం అవుతాం. అయితే స్క్రీన్ ప్లే అక్కడక్కడా డీవియేట్ అవుతూ మనని ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ లో కూడా బాగా సింపుల్ గా చేద్దామనుకోవటంతో.తేలిపోయినట్లనిపించింది.
టెక్నికల్ గా..
సినిమా లో హైలెట్...కెమెరా వర్క్. అరుకు ఎంత అందంగా కనపడుతుందంటే..అయ్యో పెద్ద తెరపై ఈ సినిమాని మిస్ అయ్యిపోయామే అనిపించేంతలా. ఇక సంగీతం విషయంకి వస్తే...చెప్పుకునే స్దాయిలో లేదు. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. డైలాగులు కూడా చాలా బాగా రాసుకున్నారు. డైలాగుల్లో సబ్ టెక్ట్స్ కనపడేలా డిజైన్ చేసారు.
నటీనటుల్లో సత్యదేవ్...పూర్తిగా ఈ సినిమాలో మహేష్ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసారు. మిగతా నటులు ఎంతబాగా చేసినా ఇతని నటన ముందు తేలిపోతున్నారు. సుహాస్ ఫన్ బాగుంది. ఎడిటర్ గారు ఇంకాస్త కత్తెరకు పదను పెడితే స్పీడు పెరిగేదేమో.
ఫైనల్ ధాట్
ఫర్‌ఫెక్ట్ రీమేక్ అంటే ఒరిజనల్ ని దించటమే కాదు..మించటం కూడా...
--సూర్య ప్రకాష్ జోస్యుల
Rating: 2.5/5
------
నటీనటులు: సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్, టీఎన్నాఆర్, రవీంద్ర విజయ్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్
సంగీతం: బిజిబల్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సౌండ్ డిజైనింగ్: నాగార్జున తాళ్లపల్లి
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
రన్ టైమ్: 2hr 16mins
రిలీజ్ డేట్: 2020-07-30