ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు.
హీరో నారా రోహిత్ తండ్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన నారా రామ్మూర్తి నాయుడు శనివారం గుండెపోటుతో మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయనని ఒక వారం క్రితం హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో పాటు సడెన్‌గా గుండెపోటు రావడంతో నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు.
చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసిన మరు క్షణమే మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ వదిలి హైదరాబాద్ AIG హాస్పిటల్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పర్యటనను మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నారా, నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఆస్పత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ, రాజకీయ నాయకులంతా నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే.. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లి కరెక్ట్‌గా నెలరోజులు ఉందనగా.. ఇప్పుడాయన తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడం.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.