కోర్ట్ కు హాజరైన నటి గౌతమి, న్యాయం జరిగేదాకా పోరాడుతా
గౌతమి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సిని నటి గౌతమి గత కొంతకాలంగా తను మోసపోయిన భూమి గురించి పోరాడుతూనే ఉన్నారు. తన భూమిని అమ్మిపెడతానని చెప్పి మోసం చేసిన కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని ప్రముఖ నటి గౌతమి పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న (గురువారం) కోర్టుకు హాజరైన ఆమె న్యాయమూర్తి ఎదుట వివరణ ఇచ్చారు.
ఆమెను మోసం చేసిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. ఆయనకు బెయిలు ఇవ్వొద్దని గౌతమి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం గౌతమి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రామనాథపురం జిల్లా ముతుకులత్తూర్ సమీపంలో నటి గౌతమికి చెందిన 150 ఎకరాల స్థలం అమ్మిపెడతానని కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్ రూ.3.1 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. అతని నుంచి తన డబ్బు ఇప్పించాలని కోరుతూ గౌతమి రామనాథపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ రామనాథపురం జిల్లా కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం గౌతమి కోర్టు విచారణకు హాజరై న్యాయమూర్తి ఎదుట వివరణ ఇచ్చారు. అళగప్పన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఆమె న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పారు.