సీనియర్స్  నాలెడ్జ్ ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లే పరిస్దితి మన తెలుగులో తక్కువే. సీనియర్స్ నిర్మాతగా సినిమా చేస్తున్నప్పుడే వారి పర్యవేక్షణకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ  పరిస్దితిలో మార్పు తేవాలనుకుంటున్నారు. ఇప్పటికే తను ప్రభాస్ తో చేసే సినిమాకు సింగీతం శ్రీనివాసరావు సలహాలు తీసుకోవటానికి ముందుకు వచ్చారు. అలాగే ఇప్పుడు సీన్ లోకి రాఘవేంద్రరావుని కూడా తీసుకువచ్చినట్లు సమాచారం. 

జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ హిట్ సోషియో ఫాంటసీలు తీసిన ఆయన అనుభవాన్ని వినియోగించుకోకున్నారు. అటు ఆదిత్య 369 తీసిన దర్శకుడు సలహాలు, ఇటు దర్శకేంద్రుడు సూచలతో స్క్రిప్టు  అద్బుతంగా రూపొందబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ కీలకమైన ఎపిసోడ్ విషయంలో రాఘవేంద్రరావుని సంప్రదించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన కూడా ఆసక్తి చూపించి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. గతంలో బాహుబలి చిత్రానికి రాఘవేంద్రరావు మెంటార్ గా వ్యవహించారు.

ఇక ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దిగ్గజ నటుడు అబితాబ్‌ బచ్చన్‌ తమ సినిమాలో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. విభిన్న చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.