సాధారణంగా లైమ్ లైట్ లోకి రానప్పుడు ఎంతటాలెంట్ ఉన్నవాడైనా ఎదుటివాడికి చాలా తక్కువ వాడిలా..అతి సామాన్యుడులా కనపడుతూంటారు.ముఖ్యంగా సినీ పరిశ్రమలో అది అతి సామాన్యం. ఈ రోజు ఏమీ క్రేజ్ లేనివాడు..ఎవరికీ తెలియని వాడు..వచ్చే వారానికి సెలబ్రెటీ కావచ్చు. అలాంటి సీన్స్ ఎన్నో తెలుగు సినిమా పరిశ్రమ చూసింది. కాబట్టి ఎవరికీ ఇక్కడ తక్కువ అంచనా వేయటానికి లేదు. తమ జీవితంలో ఇలాంటి విషయాలను గుర్తు చేసే సంఘటన ఒకటి జరిగిందని అనీల్ రావిపూడి మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన లైమ్ లైట్ లోకి రానప్పుడు ఓ టీవి ఛానెల్ వాడు లైట్ తీసుకుని, ఆయన సినిమాని కొనకపోవటమే కాకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడాడట. ఆ వివరాల్లోకి వెళితే..

ఏది ఐదేళ్ల క్రితం సంగతి... కళ్యాణ్ రామ్ తో చేసిన పటాస్ సినిమా విడుదలకు ముందు స్పెషల్ షోలు వేసారట. అప్పుడు ఓ శాటిలైట్ ఛానెల్ వచ్చి స్పెషల్ షో చూసి తిట్టి పోయారని చెప్పాడు అనిల్ రావిపూడి. ఆ చూసిన వాళ్లు షో నుంచి బయటికి వచ్చి అసలు ఇది సినిమానేనా.. ఇలాంటి సినిమా కూడా తీస్తారా.. చెత్త సినిమా.. అసలు ఒక్క రోజు కూడా ఆడదు.. విడుదల చేసి కూడా వేస్ట్ అంటూ చెప్పేసారట. దాంతో తమకు చాలా భయమేసిందని చెప్పాడు అనిల్. 

ఆ తర్వాత దిల్ రాజు, శిరీష్ చూసి సినిమాను విడుదల చేస్తే అది బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాడు ఈ దర్శకుడు. అయితే ఆ శాటిలైట్ ఛానెల్ ఓనర్‌ను మాత్రం బండ బూతులు తిట్టాలనేంత కసి వచ్చిందని.. నువ్వు అసలు క్రియేటర్ ఏంట్రా.. క్రియేటివిటి నీలో ఎక్కడుందిరా అంటూ ఇష్టమొచ్చినట్లు ఫుట్ బాల్ ఆడుకోవాలని అనిపించిందని చెప్పాడు అనిల్ రావిపూడి. మొత్తానికి బ్లాక్‌బస్టర్ పటాస్ సినిమాను డిజాస్టర్ అన్నారంట వాళ్లు. విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఈయన. తరుణ్ భాస్కర్ హోస్టుగా వచ్చిన నీకు మాత్రమే చెప్తా షోలో అనిల్ చాలా విషయాలు చెప్పాడు.


ఇక అనిల్ రావిపూడి పటాస్ తో కలిసి వరసగా ఐదు హిట్స్ అందుకున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ హిట్టే.. మొన్నొచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా కమర్షియల్ బ్లాక్‌బస్టర్. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం 130 కోట్లకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు ముందు F2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈయనకు కెరీర్ మొదట్లో మాత్రం ఎదురైన అవమానం ఇదే.