బీసీసీఐ అంటేనే రాజకీయాలకు మారు పేరు అనే పేరు పడిపోయింది. ఇక ఈ బీసీసీఐని ఎవరూ మార్చలేరు అనుకుంటున్నా తరుణంలో సుప్రీమ్ కోర్టు జోక్యం పుణ్యమా అని జస్టిస్ లోధా కమిటీ తెరపైకి వచ్చింది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలిలో విప్లవాత్మక సంస్కరణలు జస్టిస్‌ లోధా కమిటీతో సాధ్యపడింది. బీసీసీఐ అవినీతి కోరల్లో చిక్కుకున్న సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత క్రికెట్‌ బోర్డు ప్రక్షాళనకు జస్టిస్‌ లోధా సారథ్యంలోని కమిటీ పలు సిఫారసులు చేసింది. 

పాలక కమిటీని నియమించడంతో మొదలుపెట్టి జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులను సుప్రీంకోర్టు బీసీసీఐలో అమలు చేయడం ఆరంభించింది. తాజాగా సంస్కరణలను ఎత్తివేసేందుకు బీసీసీఐ ఏజీఎం ప్రతిపాదనలు సిద్ధం చేయటంపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఈ లోధా కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌ ఆర్‌.ఎం లోధా స్పందించారు. 

ఈ సంస్కరణలు అమలు చేయడం చాలా దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. బీసీసీఐలో పాత వ్యవస్థనే గనుక కొనసాగుతూ ఉండి ఉంటే, ఓ మాజీ క్రికెటర్‌ బీసీసీఐ అధ్యక్షుడి పదవిలో కూర్చోవాలని కనీసం కలలో కూడా ఊహించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

Also read: గంగూలీని అడ్డం పెట్టి లోథా కమిటీ సిఫార్సులకు తూట్లు

క్రికెట్‌ రాజకీయాలలో సంస్కరణలు అమలు కాకుంటే, ఓ క్రికెటర్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యేవాడే కాదని ఆయన వ్యాఖ్యానించారు. పాత వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ప్రయత్నించడం మాని, సంస్కరణలను మరింత చిత్తశుద్దితితో అమలు చేయాలనీ ఆయన కోరారు. 

ఒక వేళ  ఈ సంస్కరణలు ఫలితాన్నిస్తాయా అనే అనుమానమే గనుక ఉంటే, ఈ సంస్కరణలు ఫలితాలు సాధిస్తాయి అని ఋజువు కావాలంటే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడవ్వడమే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు అమలు చేసేందుకు ఈ ఒక్క కారణం చాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

భారత క్రికెట్‌లో సంస్కరణలు కొంత కాలం అమలు జరిగితే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం మరింతబాగా తెలిసొస్తుంది అని జస్టిస్‌ ఆర్‌ఎం లోధా వ్యాఖ్యానించారు.

ఇకపోతే, కొన్ని రోజుల కింద  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారి సర్వ సభ్య సమావేశం నిర్వహించింది. నూతన అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సారథ్యంలో ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏజీఎం విజయవంతంగా ముగిసింది. 

ఇకపోతే ఈ సమావేశంలో లోధా కమిటీ సిఫార్సులకు తూట్లు పొడిచేందుకు బీసీసీఐ కురువృద్ధులంతా ఒకతాటిపైకి వచ్చారు. బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి వరుసగా ఆరేండ్లకు మించి పదవిలో కొనసాగరాదు. అది రాష్ట్ర సంఘం, బీసీసీఐలో ఎక్కడైనా లేదా రెండింటా కలిపి ఆరు సంవత్సరాలకు మించి పదవిలో ఉండకూడదు. 

గరిష్ట పదవీ కాలపరిమితిని 18 ఏండ్లుగా నిర్దేశించినా, ఏకఛత్రాధిపత్య ధోరణికి చెక్‌ పెట్టేందుకు ఈ నిబంధన జోడించారు. బీసీసీఐ పాలకులకు అసలు కాల పరిమితిపైనే తీవ్ర అభ్యంతరం. 

18 ఏండ్ల కాలమైనా వరుసగా కొనసాగే అవకాశం ఇవ్వాలని సైతం ఆరంభంలో బీసీసీఐ పెద్దలు వాదించారు . బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నిబంధనల ప్రకారం మరో 9 నెలలు మాత్రమే పదవిలో ఉండగలడు. 

Also read: తన సిక్స్ కు తానే ఆశ్చర్యచకితుడైన విరాట్ కోహ్లీ

జగ్‌మోహన్‌ దాల్మియా హఠాన్మరణంతో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)లోకి ప్రవేశించిన గంగూలీ.. ఇప్పటికే ఐదేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. తండ్రి చాటు బిడ్డగా గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ)లోకి అడుగుపెట్టిన జై షా సైతం మరో పది నెలల్లోనే బీసీసీఐ కార్యదర్శిగా వైదొలగాల్సి ఉంది.

భారత మాజీ కెప్టెన్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా రావటంలో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ పాలనను గాడిలో పెట్టగలడని దాదాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిబంధనల కారణంగా అతడి పదవీ కాలం 9 నెలల్లోనే ముగియనుందనే సానుభూతి ప్రచారంలోకి తీసుకొచ్చారు. 

గంగూలీ వంటి నిజాయితీ కలిగిన పాలకుడు నిబంధనల కారణంగా పదవి నుంచీ తప్పుకోవాల్సి వస్తుందని సహజంగానే అభిమానుల్లో రూల్స్‌పై ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. 

ఇలా సంస్కరణలకు తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుండడంతో, జస్టిస్ ఆర్ ఎం లోధా ఈ విధంగా స్పందించి విస్మయం వ్యక్తం చేసారు.