సూర్యకు భారత కెప్టెన్సీ పై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ - హార్దిక్ పాండ్యా గురించి ఏం చెప్పాడంటే?
Team India : భారత టీ20 క్రికెట్ జట్టుకు ఇదివరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉన్నారు. అయితే, టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్ణయంపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Team India : భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం పై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నిరాశను వ్యక్తం చేశారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్భజన్ సింగ్ స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీసీసీఐ నిర్ణయంపై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల హార్దిక్ పాండ్యా స్థిరమైన ప్రదర్శనలను ప్రస్తావించాడు. అలాగే, హార్దిక్ పాండ్యా భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడనీ, రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న సమయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్ అని అభిప్రాయపడ్డారు.
ఏడాది కాలంపైగా భారత జట్టును విజయవంతంగా హార్దిక్ పాండ్యా నడిపించాడు : హర్భజన్ సింగ్
హార్దిక్ పాండ్యా ఒక సంవత్సరం పాటు టీ20 మ్యాచ్‌లలో భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నాడనీ, దానిని విజయవంతంగా నిర్వహించాడని హర్భజన్ హైలైట్ చేశాడు. ఇటీవలి ప్రపంచకప్‌లో పాండ్యా ప్రదర్శనతో అతని విశ్వసనీయత మరింత బలపడిందనీ, ఇలాంటి సమయంలో అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యానికి గురి చేసిందని భజ్జీ పేర్కొన్నాడు.
"హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉన్నందున నేను కొంతవరకు ఆశ్చర్యపోయాను. ఇదే సమయంలో నిరాశ చెందాను. రోహిత్ శర్మ ఇకపై కెప్టెన్‌గా ఉండకపోతే, సహజంగానే, వైస్-కెప్టెన్ ఆ స్థానంలోకి వస్తాడు. కానీ హార్దిక్ విషయంలో ఇది జరగలేదు. కానీ, అతను ఏడాదికి పైగా జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పుడు, ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ నిర్ణయం అతనికి పెద్ద ఎదురుదెబ్బగా అనిపిస్తుంది" అని స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ అన్నారు.
సూర్యకుమార్ గొప్ప ప్లేయర్, నిస్వార్థ వ్యక్తి : హర్భజన్ సింగ్
అలాగే, భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గురించి కూడా హర్భజన్ సింగ్ మాట్లాడాడు. సూర్య పై అపారమైన గౌరవం ఉందని తెలిపాడు. అతను నిస్వార్థ వ్యక్తిగా, అద్భుతమైన ఆటగాడని పేర్కొన్న హర్భజన్ సింగ్.. సూర్యకుమార్ కూడా కెప్టెన్‌గా పదోన్నతి పొందుతారని తాను అనుకోలేదని చెప్పాడు. "సూర్యకుమార్ యాదవ్‌పై నాకు చాలా గౌరవం ఉంది. అతను అద్భుతమైన ఆటగాడు. నిస్వార్థ వ్యక్తి, కానీ అతను కెప్టెన్ అవుతాడని అతను కూడా ఊహించి ఉండకపోవచ్చు. విషయాలను భిన్నంగా నిర్వహించవచ్చు. హార్దిక్ అతని ఇటీవలి ప్రదర్శనలను బట్టి కెప్టెన్‌గా కొనసాగాలి. సూర్యకుమార్‌కు ఇంకా చాలా సమయం ఉంది" అని భజ్జీ అన్నారు.
ఒక సంవత్సరం పాటు జట్టును నడిపించడంలో పాండ్యా నిలకడగా ఉన్నాడనీ, చాలా మ్యాచ్ లలో భారత్‌ను విజయవంతంగా నడిపించాడని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ లేదా ఇతర కారణాల వల్ల కొన్ని మ్యాచ్‌లకు పాండ్యా జట్టుకు దూరంగా ఉండటం వల్ల సూర్యకుమార్‌ను కెప్టెన్ గా నియమించాలనే బీసీసీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని కూడా పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీ నుంచి పాండ్యాను తప్పించడం అన్యాయమని హర్భజన్ వ్యాఖ్యానించాడు. స్వల్పకాలిక ఆందోళనలు ఏవైనా ఉన్నప్పటికీ, నాయకత్వాన్ని మరింత ఆలోచనాత్మకంగా నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డాడు. మొత్తగా ఇప్పటికే హార్దిక్ పాండ్యా తానేంటో నిరూపించుకున్నాడనీ, అతని నాయకత్వ నైపుణ్యాలు గమనిస్తే భారత కెప్టెన్‌గా కొనసాగడానికి అతనే బెస్ట్ ఎంపికగా హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.
ధోని కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్
హర్భజన్ సింగ్ స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోని కంటే రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్ అని పేర్కొన్నాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ "రోహిత్ శర్మ ప్రజల కెప్టెన్, అతను వారి వద్దకు వెళ్లి, వారితో మాట్లాడతాడు. అలాగే, ఏమి చేయాలి అని కూడా అడుగుతాడు. కానీ ఎంఎస్ ధోని ఎవరితోనూ మాట్లాడడు, అతను మాట్లాడకుండా తన పనిని పూర్తి చేయడానికి ఇష్టపడతాడని" చెప్పాడు. భారత మాజీ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అభిమానులు కూడా తమ స్పందనను తెలియజేస్తున్నారు. భజ్జీ చెప్పిన ఈ మాట నిజమేనని కొందరు అంటుండగా, మరికొందరు ఎంఎస్ ధోని అభిమానులు మాత్రం అది తప్పని నిరూపించే పనిలో పడ్డారు.
అయితే, రికార్డుల విషయానికి వస్తే, ఇద్దరు కెప్టెన్ల మధ్య పోలిక చేయడం చాలా కష్టం. ఎంఎస్ ధోని తన కాలంలో భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. అలాగే, ధోని కంటే తక్కువ సమయం తీసుకుని రోహిత్ శర్మ టీమ్ ఇండియా విధానాన్ని మార్చాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌కు చేరుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇదిలావుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా? అనే విషయాలను కూడా భజ్జీ ప్రస్తావించాడు. పాకిస్థాన్‌లో పర్యటించడం చాలా కష్టమనీ, దీనికి ప్రధాన కారణం భద్రతాపరమైన సమస్యలేనని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. " పాకిస్థాన్‌లో భద్రత అనేది పెద్ద సమస్య. అథ్లెట్‌గా నా తోటి ఆటగాళ్ల భద్రతను కోరుకుంటున్నాను" అని స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని కూడా భజ్జీ పేర్కొన్నాడు.