ముంబై: వెస్టిండీస్ తో బుధవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఫోర్లు, సిక్స్ లతో వెస్టిండీస్ బౌలర్లను అతను ఓ ఆటాడుకున్నాడు. కేవలం 21 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచుల్లో అతను 24వ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 

కేవలం 29 బంతుల్లో కోహ్లీ 70 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఏడు సిక్స్ లు ఉన్నాయి. విలియమ్స్ కు కోహ్లీ చుక్కలు చూపించాడు. భారత ఇన్నింగ్స్ 18వ ఓవరులో విలియమ్స్ వేసిన బంతిని ఉతికి ఆరేశాడు. ఆ తర్వాత విలియమ్స్ తో ఏదో అన్నాడు. 

పైగా, బంతి బ్యాట్ కు సరిగ్గా అంది గాలిలో దూసుకుపోతుండడాన్ని చూస్తూ కోహ్లీ ఆనందపరవశవంలో తేలిపోయాడు. బంతి దూసుకుపోతున్న తీరును చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాడు. మొత్తం మ్యాచులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్,  కోహ్లీ కలిసి 16 సిక్స్ లు బాదారు. భారత్ మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 

రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచుల్లో 400 సిక్స్ లు బాదిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు నమోదు చేసుకున్నాడు. క్రిస్ గేల్ 534 సిక్స్ లతో అగ్రస్థానంలో నిలిచాడు.