Asianet News TeluguAsianet News Telugu

ఈసారి భారత్‌పై భారం: స్టీల్‌పై ట్రంప్ 50% దిగుమతి సుంకం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను విధించే విషయంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. భారత్, చైనాలతోపాటు మొత్తం ఐదు దేశాల స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి నిరోధక సుంకం భారీ మొత్తంలో విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

United States imposes heavy anti-dumping duty on metal pipes imported from India
Author
Washington, First Published Aug 23, 2018, 6:40 AM IST

వాషింగ్టన్: అమెరికా అంటేనే పెద్దన్న.. మరి పెద్దన్నకు ఆగ్రహం రావడం అంటే మామూలు విషయం కాదు. తమ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్యలోటును నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకు, వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు విధించడంలో అనుసరిస్తున్న దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. స్వదేశీ పరిశ్రమలకు మద్దతుగా, వివిధ దేశాలతో అమెరికా వాణిజ్య లోటును అదుపు చేయడానికి వీలుగా ట్రంప్.. సుంకాల పోరుకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో తయారైన లోహపు గొట్టాలపై భారీ స్థాయిలో ప్రాథమిక దిగుమతి నిరోధక సుంకాలను విధించారు. భారత్ నుంచి దిగుమతయ్యే మెటల్ పైపులపై ఏకంగా 50.55 శాతం సుంకాన్ని వేస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. 

మరో ఐదు దేశాలపైనా భారీగా సుంకాలు


అలాగే చైనాతోపాటు మరో నాలుగు దేశాలు కెనడా, గ్రీస్, టర్కీ, తన అనుంగు మిత్రదేశం దక్షిణ కొరియాలపైనా ట్రంప్ సర్కార్ భారీగా సుంకాల భారం విధించింది.  జనవరిలో అమెరికాకు చెందిన ఆరు పైపుల తయారీ సంస్థలు దిగుమతి నిరోధక ఫిర్యాదును వాణిజ్య శాఖకు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. తమ పరిశీలనలో నిబంధనలకు విరుద్ధంగా భారత్, చైనా తదితర ఆరు దేశాలు అమెరికాకు పైపులను ఎగుమతి చేస్తున్నట్లు తేలిందని, చమురు, గ్యాస్, ఇతరత్రా ద్రవాల రవాణాకు వినియోగించే భారీ పైపుల ధర.. మార్కెట్‌లో స్థానిక సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ పైపులను దిగుమతి చేసుకున్న వ్యాపారులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నది. 

అమెరికా సంస్థలకు గిరాకీ ఉండటం లేదనే సాకు


ఫలితంగా అమెరికా సంస్థలు తయారు చేసిన పైపులకు డిమాండ్ ఉండట్లేదన్న ఆందోళనను కనబరిచింది. దీంతో చైనాపై 132.63 శాతం, గ్రీస్‌పై 22.51 శాతం, కెనడాపై 24.38 శాతం, దక్షిణ కొరియాపై 14.97 నుంచి 22.21 శాతం, టర్కీపై 3.45 నుంచి 5.29 శాతం మేర ప్రాథమిక దిగుమతి నిరోధక సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరు దేశాల నుంచి పైపులను దిగుమతి చేసుకునే వారి వద్ద అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం నగదు డిపాజిట్లను వసూలు చేస్తుందని ఓ ప్రకటనలో వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. నవంబర్‌లో భారత్, చైనాపై, వచ్చే ఏడాది జనవరిలో కెనడా, గ్రీస్, కొరియా, టర్కీలపై తుది నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నది. కాగా, భారత్ నుంచి గతేడాది 294.7 మిలియన్ డాలర్ల విలువైన పైపులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి.

ఎయిర్ ఇండియాకు కేంద్రం రిక్తహస్తం

 
నిధుల లేక సతమతమవుతున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. మరో బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించాలని సంస్థ అభ్యర్థనపై కేంద్రం నీళ్లు చల్లింది. విమానాలను నడుపాలన్న, సిబ్బందికి వేతనాలు చెల్లించాలన్నా కనీసం రూ.30 వేల కోట్ల నిధులు కావాలని సంస్థ పెట్టుకున్న అభ్యర్థనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అప్పులను తగ్గించుకోవాలంటే ప్రాధాన్యత లేని ఆస్తులను విక్రయించుకోవాలని సూచించడం కొసమెరుపు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం మంచిది కాదనే ఉద్దేశంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో వ్యవసాయ రంగానికి, మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం భారీ స్థాయిలో నిధులను కెటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంస్థకు ఉన్న అప్పుకు ప్రతియేటా వడ్డీల రూపంలో రూ.4-5 వేల కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన బెయిల్ అవుట్ ప్యాకేజీతో సంస్థ పనితీరు ఏ మాత్రం మెరుగుపడలేదని, ఇదే సమయంలో అప్పులు మరింత పెరిగాయని, ఈ నేపథ్యంలో మరోసారి భారీ స్థాయిలో నిధులను కేటాయించే అవకాశాలు లేవని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. అప్పులను తగ్గించుకోవాలంటే ప్రాధాన్యతలేని ఆస్తులను విక్రయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూ.11 వేల కోట్ల నిధులను వెచ్చించింది. ప్రస్తుతం సంస్థకు రూ.47 వేల కోట్ల అప్పు ఉన్నది.

బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక


మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకుల బాస్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రూ.50 కోట్ల కంటే అధికంగా ఉన్న నిరర్థక ఆస్తుల మోసాలపై తనిఖీ చేయాలని లేకపోతే నేరపూరిత కుట్ర కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్యాంకులను భారీ స్థాయిలో మోసం చేసిన భూషణ్ స్టీల్స్ ప్రమోటర్ నీరజ్ సింగాల్‌ను ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐవో అరెస్ట్ చేసింది. ఐపీసీ సెక్షన్ 120 బీ ప్రకారం బ్యాంకులు మోసాలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఆ తర్వాత విచారణ ఏజెన్సీలతో కలిసి వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ అధికారి పేర్కొన్నారు. ఒకవేళ ఏజెన్సీలు ఈ నిధులను ఇతర వాటికి తరలించినట్లు గుర్తిస్తే ఆయా రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు చట్టరిత్యా విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు. దివాలా చట్టం కింద ఇప్పటి వరకు డజనుకుపైగా కంపెనీలు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను ఇతర వాటికి మళ్లించినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. భారీ స్థాయిలో రుణాలు ఇచ్చేముందు ఆయా సంస్థల ఆర్థిక సామర్థ్యం, ఐదేండ్ల రుణ చరిత్రను సేకరించుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఒకవేళ అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్‌ను కూడా నిర్వహించుకున్న తర్వాతనే రుణాలను మంజూరు చేయాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios