డిసెంబర్ నెలలోనూ దేశీయంగా వాహనాల విక్రయాలు మందకొడిగా సాగాయి. గత నెల దేశీయ అమ్మకాల్లో మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్‌, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రాతోపాటు హోండా కార్స్‌ విక్రయాల్లో సింగిల్ డిజిట్ అభివృద్ధిని నమోదు చేయగలిగాయి.

కానీ టాటా మోటార్స్‌ అమ్మకాలు నిరాశపరిచాయి. ఆర్థిక వ్యవస్థ ప్రతికూలతలు ప్రభావం చూపాయని విశ్లేషకులు పేర్కొన్నారు.దేశీయంగా మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు 1,19,286 నుంచి 1.8 శాతం వృద్ధి చెంది 1,21,479కు చేరాయి.

మారుతీ చిన్నకార్ల విభాగంలో గత నెలలో ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ మోడల్ కార్లు  విక్రయాలు 14 శాతం తగ్గి 27,661గా నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ నెలలో 32,146 కార్లు అమ్ముడయ్యాయి. స్విఫ్ట్‌, సెలెరియో, బాలెనో, డిజైర్‌ మోడళ్ల అమ్మకాలు సైతం 3.8 శాతం క్షీణించాయి. 

విటారా బ్రెజా, ఎస్‌- క్రాస్‌, ఎర్టిగా వంటి యుటిలిటీ వాహన విక్రయాలు 4.9 శాతం పెరిగి 20,225కు చేరాయి. మారుతి ఎగుమతులు 2017 డిసెంబర్ నెలతో పోలిస్తే 36 శాతం క్షీణించాయి.  2017లో 10,780 కార్లు ఎగుమతి చేయగా, గత నెలలో అది 6859కు తగ్గింది.

హుండాయ్ మోటార్స్ ఇండియా 2017 డిసెంబర్ నెలతో పోలిస్తే కార్ల విక్రయాల్లో దేశీయంగా 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. దీనికి న్యూ శాంత్రో హ్యాచ్ బ్యాక్, హాట్ సెల్లింగ్ హుండాయ్ ఐ20, హుండాయ్ క్రెటా ఎస్‌యూవీ మోడల్ కార్లకు భారీగా డిమాండ్ రావడమే కారణం.

దేశీయంగా 2017లో 40,158 కార్లను విక్రయించిన హుండాయ్.. గత నెలలో 42,093 యూనిట్లు అమ్మగలిగింది. 2017తో పోలిస్తే 2018లో కార్ల విక్రయాలు 6,78,221 నుంచి 7,10,012లకు చేరాయి.

2017లో 12,642 కార్లు విక్రయించిన హోండా కార్స్.. గత నెలలో 13,139 యూనిట్లను అమ్మగలిగింది. డిసెంబర్ నెలలో మార్కెట్ లో నెలకొన్న పరిస్థితులు తమకు సవాల్ గా పరిణమించాయని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ తెలిపారు. టయోటా కార్ల విక్రయాలు 10 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్‌ అమ్మకాలు మాత్రం ఎనిమిది శాతం తగ్గిపోయాయి. 2017 డిసెంబర్ నెలలో 54,627 కార్లు విక్రయించిన టాటా మోటార్స్ గత నెలలో 50,440 కార్లు మాత్రమే అమ్మగలిగింది.

యావత్ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు మందగమనంలోనే సాగాయని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీఖ్ తెలిపారు. వాణిజ్య వాహనాల విక్రయంలోనూ 11 శాతం, ఇక ఎగుమతుల్లో 36 శాతం క్షీణత నమోదైంది.

మరో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం ఒక్కశాతం పురోగతి నమోదు చేసుకున్నది. 2017 డిసెంబర్ నెలలో 39,200 కార్లు అమ్ముడు పోతే, గత నెలలో 39,755 యూనిట్లు విక్రయించింది.

ఇక మహీంద్రా ట్రాక్టర్స్ విక్రయాలు మాత్రం ఆరు శాతం క్షీణించాయి. 2017 డిసెంబర్ నెలలో 18,488 ట్రాక్టర్లను విక్రయించిన మహీంద్రా.. గతేడాది 17,404 యూనిట్లతో సరిపెట్టుకున్నది. 

ఇక ద్విచక్రవాహనాల సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు ఏకంగా 13 శాతం తగ్గాయి. 2017 డిసెంబర్ నెలలో 66,968 బైక్ లను విక్రయించిన రాయల్ ఎన్ ఫీల్డ్.. గతేడాది 58,278 మోటారు సైకిళ్లతోనే సంత్రుప్తి పడింది.