మారుతి ‘క్యాబ్’ సర్వీస్: విపణిలోకి ఎర్టిగా టూర్ ఎం
క్యాబ్ డ్రైవర్ల సేవలకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించిన ఎర్టిగా టూర్ ఎం వేరియంట్ కారును మారుతి సుజుకి విడుదల చేసింది. ఇప్పటివరకు సీఎన్జీ, పెట్రోల్ వర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారును డీజిల్ వేరియంట్లో ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ క్యాబ్ నిర్వాహకుల కోసం దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త మోడల్ కారును భారత విపణిలోకి విడుదల చేసింది. ఎర్టిగా టూర్ ఎం పేరుతో వచ్చిన ఈ కారులో 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ను అమర్చారు. దీని ధర రూ.9.81 లక్షలుగా నిర్ణయించారు. క్యాబ్ నిర్వాహకులు వినియోగించుకోవడానికి లక్ష్యంగా ఎర్టిగా టూర్ ఎం కారును రూపొందించారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఎర్టిగా టూర్ పెట్రోల్, సీఎన్జీ వర్షన్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతి సుజుకి. కొత్తగా వచ్చిన ఎర్టిగా టూర్ ఎం డీజిల్ కారు 94 బీహెచ్పీ శక్తిని, 225 ఎన్ఎం టార్చ్ విడుదల చేస్తుంది. 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అమర్చారు. ఏఆర్ఏఐ అంచనాల ప్రకారం లీటర్ డీజిల్ పై ఈ కారు 24.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఎర్టిగా వీఎక్స్ఐ మోడల్ కారు ఆధారంగా ఈ సరికొత్త కారును అభివ్రుద్ధి చేశారు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ గ్రిల్, 3డీ ఎల్ఈడీ టెయిల్ గేట్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెడ్ ఓఆర్ఎం, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, కీలెస్ ఎంట్రీ, క్యాబిన్ లోని మూడు వరుసల్లోనూ పవర్ విండో, ఆడియో కంట్రోలింగ్ తో టిల్ట్ స్టీరింగ్, వెనుక సీట్లకు ఏసీ వెంట్, 2 డీఐఎన్ ఆడియో, బ్లూ టూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు సమకూర్చారు.
డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఫ్రంట్ సీట్ బెల్ట్స్, విత్ ప్రీ టెన్షనర్స్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ తదితర వసతులు ఉన్నాయి. 80 కి.మీ. వేగంతో దూసుకెళుతుంది. పెర్ల్ మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మెటాలిక్ సిల్కీ సిల్వర్ రంగుల్లో లభ్యం కానున్నది. ఎర్టిగా రెండోతరం కారు విడుదలై ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటికీ దానిపట్ల వినియోగారులు ఆకర్షితులవుతూనే ఉన్నారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం సాగుతున్నా ప్రతి నెలలో సగటున 8000 యూనిట్ల ఎర్టిగా కార్లు అమ్ముడు పోతున్నాయి.