టెక్నికల్ స్నాగ్స్: విద్యుత్ వెహికల్స్ నిలిపివేసిన హార్లీ
విద్యుత్ వాహనాలతో యువతరాన్ని ఆకర్షించాలన్న హార్లీ డేవిడ్సన్ అభిమతం.. ఆశలు అడియాసలయ్యాయి. బ్యాటరీలో లోపం వల్ల ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉత్పత్తి, డెలివరీ నిలిపివేస్తున్నట్లు హార్లీడేవిడ్సన్ ప్రకటించింది. ఇప్పటికే బైక్ లు కొనుగోలు చేసిన వారు తమ డీలర్ల వద్ద సంప్రదించాలని సూచించారు.
భవిష్యత్ విద్యుత్ వాహనాలదైనా ప్రస్తుతం టెక్నాలజీకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నది. స్టాండర్డ్ కండీషన్ లేకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చినట్లు విలాసవంతమైన మోటారు సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ విద్యుత్ వాహనాల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం ‘లైవ్ వైర్’ ఎలక్ట్రికల్ మోటారు సైకిళ్లను తయారు చేస్తోంది. ‘ఇటీవల తుది తనిఖీల్లో బైక్, అందులోని విడి భాగాలు, చార్జింగ్ తదితర వసతులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో లైవ్ వైర్ మోటారు సైకిళ్ల ఉత్పత్తి, డెలివరీని నిలిపి వేశామని పేర్కొంది. అదనంగా విడి భాగాలతోపాటు మోటారు సైకిళ్ల పనితీరుపై పరీక్షలు ప్రారంభించామని వివరించింది.
ఈ వాహనాల బ్యాటరీ చార్జింగ్ లో సమస్యలు వెలుగులోకి రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నదని ఒక ఆంగ్ల దిన పత్రిక వెల్లడించింది. 2014లో తొలిసారి లైవ్ వైర్ బైకును హార్లీ డేవిడ్సన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 29,799 (రూ.21.25 లక్షల) డాలర్ల వరకు ఉంది. ఇప్పటికే కొనుగోలు చేసిన రైడర్లు తమ డీలర్ల వద్ద బ్యాటరీలను చార్జి చేసుకోవాలని సూచించింది హార్లీ డేవిడ్సన్.