న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత విపణిలోకి మరో ఎఎంజీ మోడల్ కారును బుధవారం ప్రవేశపెట్టనున్నది. ప్రస్తుతం భారత విలాసవంతమైన కార్ల మార్కెట్లో లీడర్‌గా వ్యవహరిస్తున్నది మెర్సిడెస్ బెంజ్. ఈ స్థానాన్ని మరింత పదిలం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.

ఈ సారి సరికొత్త జీ వేగన్ అంటే జీ 350 డీ మోడల్ కారును విపణిలోకి విడుదల చేయనున్నది. భారత విపణిలో ఇప్పటికే ఎఎంజీ జీ 63 ఉంది. తొలిసారి భారతదేశంలోకి స్టాండర్డ్ జీ వేగన్ కారు రానున్నది. ఈ కారులో 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 600 ఎన్ఎం టార్చ్, 282 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది.

జీ 63కి భిన్నంగా ఉండే జీ 350 పూర్తిగా ఆఫ్ రోడ్ వాహనం. ఇందులో బలమైన ఆఫ్ రోడ్ పరికరాలను కూడా బెంజ్ సమకూర్చింది. ఫోర్ వీల్ డ్రైవ్, గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ కు ఇన్ఫోటైన్మెంట్ అనుసంధానించారు. ఈ కారు టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్సీ, జీప్ రాంగ్లర్ వేరియంట్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. కాకపోతే ధర మాత్రం దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.