న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంగా అమ్మకాల్లేక ఆటోమొబైల్ రంగం విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో పండుగల సీజన్‌లో ఆటోమొబైల్ సంస్థలు, డీలర్లు కొనుగోలుదారులకు భారీగా డిస్కౌంట్లు, రాయితీలు ప్రకటిస్తున్నారు. దేశవ్యాప్తంగా మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్లకు కూడా భారీ ఆఫర్లు వెల్లడించారు. ఎక్స్చేంజ్ బోనస్, విడి భాగాలు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ తదితర రాయితీలు అందుబాటులోకి తెస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక్కసారి ఆ రాయితీలేమిటో పరిశీలిద్దాం.

మహీంద్రా ఆల్టూరస్ జీ4 కారుపై రూ.37 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందజేస్తున్నారు డీలర్లు. దీనికి అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50 వేలు, విడి భాగాల విలువ రూ.19 వేలపై డిస్కౌంట్ అందిస్తున్నారు.

బేస్ మోడల్ కారు స్కార్పియో కొనుగోలుపై రూ.39 వేల డిస్కౌంట్, యాక్సెసరీలపై రూ.10 వేల రాయితీ లభిస్తుంది.

మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీ కారుపై రూ.35 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.29వేలు, యాక్సెసరీల కోసం రూ.5000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ కొనుగోలుదారులకు రూ.11,500, ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేలు, యాక్సెసరీల కింద రూ.3,500 డిస్కౌంట్ లభిస్తోంది.

డబ్ల్యూ3 మహీంద్రా ఎక్స్ యూవీ 500 మోడల్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.45 వేలు, యాక్సెసరీలకు రూ.10 వేల రాయితీ ఇస్తున్నారు డీలర్లు.

మహీంద్రా టీయూవీ 300 వేరియంట్ కారుపై రూ.51 వేల క్యాష్ డిస్కౌంట్ అందిస్తుండగా, ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.15 వేలు, యాక్సెసరీల కోసం రూ.5000 రాయితీ లభిస్తుంది.

మహీంద్రా టీయూవీ 300 ప్లస్ కారు కొనుగోలుదారులు రూ.35 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, విడి భాగాల కోసం రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు.

మహీంద్రా డీలర్లు ‘థార్ ఏబీఎస్’ కారుపై రూ.9000 క్యాష్, యాక్సెసరీలపై రూ.5000 రాయితీ అందిస్తున్నారు.

ఎం4 ట్రిమ్ కారు మరాజో కొనుగోలు చేస్తే ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, ఎం6 ప్లస్ ఎం8 ట్రిమ్ మోడల్ కార్లపై ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.40 వేలు, ఏడాది బీమా వసతి కల్పిస్తున్నారు.

మహీంద్రా ఎక్స్ యూవీ 300 కారు కొనుగోలుదారులకు యాక్సెసరీలపై కనీస రాయితీలు లభిస్తున్నాయి. మడ్ ఫ్లాప్స్, మ్యాట్స్ అందిస్తున్నారు. కస్టమర్లు తమ చాయిస్ కు అనుగుణంగా ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు.