ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా ఉన్న ఏపీ ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్‌ను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  

ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి క్యాబినెట్ ముందుకు ఫైల్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం-1994లో మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌తో తీర్మానం చేయించి అనంతరం గవర్నర్‌ ఆమోదముద్ర వేయించాలని జగన్ పావులు కదుపుతున్నారు.

Also Read:నిమ్మగడ్డ రమేశ్ కుమార్తె శరణ్యపై జగన్ సర్కార్ ఫోకస్: జాస్తి కిశోర్‌ తరహాలో విచారణ..?

రాష్ట్రంలో ఎన్నికల కమీషనర్ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రిన్సిపల్  సెక్రటరీ స్థాయి, ఆ పై అధికారి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌గా నియమించడానికి అర్హులు.

దీని ప్రకారం ఐఏఎస్‌లు మాత్రమే ఈ పదవిని చేపట్టనున్నారు. అయితే జగన్ తీసుకొచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైకోర్టు జడ్జిగా పనిచేసిన వారికి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌గా అవకాశం దక్కనుంది.

పంచాయతీ రాజ్ చట్టానికి మార్పులు చేసి దానిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం పొందేందుకు ప్రస్తుత పరిస్ధితుల్లో వీలు కాదు కాబట్టి ఆర్డినెన్స్‌ ద్వారా రమేశ్ కుమార్‌ను సాగనంపాలని జగన్ భావిస్తున్నారు.

Also Read:జగన్‌కు ఈసీ రమేశ్ కుమార్ మరో షాక్: కేంద్రానికి సీరియస్ లేఖ

కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే రమేశ్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ తర్వాత జగన్ ప్రభుత్వం దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..  సుప్రీంకోర్టు రమేశ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే, రాష్ట్రంలో ఎన్నికల  కోడ్‌ను ఎత్తివేయాలని ఆదేశించింది.