తెలుగుదేశం పార్టీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా ఇప్పటికే రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

సీఆర్‌డీఏ, అమరావతిలో భూముల్లో అక్రమాలను వెలికి తీసేందుకు సిట్‌ను నియమించిన జగన్ ఇప్పటికే ఏపీ ఆర్ధిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారంలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Also read:నిమ్మగడ్డ రమేష్ కుమారైనా తప్పించుకోలేరు: విజయసాయి రెడ్డి

తాజాగా బోర్డ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నిమ్మగడ్డ శరణ్య పాత్రపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కిశోర్‌పై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేసి ఆయన్ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే అక్రమాలపై మాత్రం విచారణ జరుపుకోవచ్చునని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శరణ్యపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రస్తుత ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కుమార్తె అయిన శరణ్య సింగపూర్‌లో కార్పోరేట్‌ లాయర్‌గా పనిచేస్తూ ఉండేవారు.

ఈ క్రమంలో టీడీపీ హయాంలో ఆమెకు ఏపీ ఆర్ధిక అభివృద్ది మండలిలో అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఆమెకు దక్కింది. ఆ తర్వాత కాలంలో శరణ్యను ప్రభుత్వం డైరెక్టర్‌గా ప్రమోట్ చేసింది. గతేడాది అక్టోబర్ వరకు ఆమె ఈ హోదాలో పనిచేశారు. అయితే ఏపీఈడీబీలో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు.

డైరెక్టర్ హోదాలో శరణ్య ఏపీకి పెట్టుబడులు సాధించే పేరుతో అనేక దేశాల్లో పర్యటించారు. బోర్డులో అక్రమాల నేపథ్యంలో జాస్తి కృష్ణకిశోర్ వ్యవహారాలపై సీఐడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు శరణ్య పాత్రపైనా ఆరా తీస్తోంది.

Also read:రమేష్ కుమార్ ఇష్యూ: ఆత్మరక్షణలో జగన్, చంద్రబాబు జోష్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై జగన్ సర్కార్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు, మంత్రులు ఆయనపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు.

తనకు భద్రత కరువైందని, ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర బలగాలు కావాలంటూ రమేశ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో వెంటనే శరణ్యపై విచారణ చేస్తే విమర్శలు వస్తాయని జగన్ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత, ఏపీలో స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత శరణ్యపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.