Asianet News TeluguAsianet News Telugu

Viral Video : లవ్ మ్యారేజ్ లో రచ్చరచ్చ ...వరుడి కళ్లలో కారంకొట్టి వధువు కిడ్నాప్

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు..పెళ్లి బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి వుండాలనుకున్నారు. కానీ అమ్మాయి కుటుంబసభ్యులకు ఈ పెళ్లి ఇష్టంలేక ఎంత రచ్చ చేసారో చూడండి. 

Own Family Tries To Kidnap Bride in Andhra Pradesh  AKP
Author
First Published Apr 23, 2024, 2:20 PM IST

రాజమండ్రి : పీటలపై పెళ్లి ఆగిపోవడం మనం సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. సరిగ్గా తాళికట్టే సమయానికి ఆపండి... అంటూ ఓ డైలాగ్ వినిపిస్తుంది. పెళ్లి మంటపంలోనే ఫైటింగ్స్ లేదంటే ఏవైనా ట్విస్టులుంటాయి. ఇలాంటివి నిజ జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ సినిమాల్లో పెళ్ళి గొడవలకు మించిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

వధూవరులు పెళ్లిపీటలపై కూర్చునివుండగా అమ్మాయి తరపువాళ్లు మండపంలోకి ఎంటర్ అయ్యారు. తమకు ఇష్టం లేకున్నా ప్రేమ వివాహానికి సిద్దమైన అమ్మాయిపై కోపంతో రగిలిపోయారు. పెళ్లిపీటల పైనుండి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వరుడితో పాటు బందువులు అడ్డుకున్నారు. ఇది ముందే ఊహించిన అమ్మాయి తరపువాళ్లు కారంపొడి వెంటతెచ్చుకున్నారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి కళ్లలో కారం చల్లుతూ హంగామా సృష్టించారు. ఇలా వధువు కిడ్నాప్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

 

అసలు కథేంటి? 

తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు ఉన్నత చదువుల కోసం కొంతకాలం నరసరావుపేటలో వున్నాడు. ఈ సమయంలోనే  అతడికి కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరు తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలని భావించారు... కానీ పెద్దలకు చెప్పేందుకు భయపడ్డారు.  

ఎక్కడ పెద్దవాళ్లు తమ పెళ్లికి ఒప్పుకోరో ... ప్రేమ విషయం ఇప్పుడే వాళ్లకు చెబితే తమను విడదీస్తారని భయపడ్డారు. అలా జరక్కుండా వుండాలంటే పెళ్లి చేసుకున్నాక పెద్దలకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ నెల 13న విజయవాడ దుర్గగుడిలో నందు, స్నేహ రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. అనంతరం తన ప్రేమ, పెళ్లి విషయాన్ని నందు కుటుంబసభ్యులకు తెలిపాడు. వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేయడానికి సిద్దమయ్యారు. 

అయితే స్నేహ కుటుంబసభ్యులు మాత్రం లవ్ మ్యారేజ్ ను అంగీకరించలేదు. దీంతో ఈ నెల 21న అంటే గత ఆదివారం నందు స్వస్థలం కడియంలో పెళ్లి జరుగుతోందని తెలుసుకున్నారు.   ఎలాగోలా పెళ్ళి మండపానికి చేరుకున్న వాళ్లు నానా హంగామా సృష్టించారు. 

తెల్లవారుజామున సరిగ్గా ముహూర్తం సమయానికి స్నేహ తరపువాళ్లు మండపంలోకి ఎంటరయ్యారు. నందు కుటుంబసభ్యులతో గొడవకు దిగి స్నేహను బలవంతంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే స్నేహ వాళ్లతో వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో లాక్కుని వెళుతుండటంతో నందుతో పాటు మిగతావారు అడ్డుకున్నారు.  దీంతో వెంట తెచ్చుకున్న కారంపొడిని వాళ్ల కళ్లలో చల్లుతూ పెళ్లికూతురిని తీసుకెళ్లారు. 

ఇలా పెళ్లి కూతురుని కిడ్నాప్ చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. పెళ్లి కొడుకు నందు కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios