అమరావతి: 2004కు ముందు ఏపీ సీఎం జగన్‌ తన ఆస్తులు రూ, 9లక్షలుగా ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. 2009 నుండి 2010 నాటికి జగన్ ఆస్తులు రూ. 43 వేల కోట్లకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. 

గురువారం నాడు లోకేష్  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్లుగా తమ కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రకటిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ ఇళ్లలో జరిగిన సోదాల్లో ఏం లభించిందనే విషయమై ఐటీ  పంచానామాను అందరికి తెలిసిందేనని  చెప్పారు. తన ఖాతాల నుండి కూడ డబ్బులు కూడ వచ్చినట్టుగా ప్రచారం చేశారన్నారు. ఐటీ అధికారుల పంచానామాను చూసైనా కూడ  వైసీపీ నేతలు కళ్లు తెరవాలన్నారు.

శ్రీనివాస్ ఇంట్లో రూ. 2.68 లక్షలు ఉన్నట్టుగా ఐటీ అధికారులు చెప్పిన విషయాన్ని ఆయన  ప్రస్తావించారు.ఇంట్లో పెళ్లి ఉండడంతో అవసరాల కోసం బ్యాంకు నుండి రూ. 2.68 లక్షలు డ్రా చేసినట్టుగా ఐటీ అధికారులు గుర్తించి ఆ డబ్బులను తిరిగి శ్రీనివాస్ కు ఇచ్చారని చెప్పారు.

ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో తాను స్పష్టంగా చెప్పానన్నారు. మీడియాకు కూడ ఈ విషయమై వివరాలు చెప్పానని ఆయన ప్రస్తావించారు. విలువలు లేని నేతలు విమర్శలు చేస్తే  స్పందించాలా అని ఆయన వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు.

జగన్ కంపెనీకి చెందిన షేర్లు రూ. 5ల  విలువ ఉంటే వాటిని భారీ ధరకు ఎలా విక్రయించారని ఆయన ప్రశ్నించారు. జగన్ రూ. 43 వేల కోట్లు దోచుకొన్నాడని సీబీఐ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన ఆరోపించారు.

Also read:పెరిగిన బాబు ఆస్తులు:ఫ్యామిలీ ఆస్తులను వెల్లడించిన నారా లోకేష్

1984లో జూబ్లీహిల్స్ 1125 గజాల స్థలం కొనుగోలు చేసి రూ. 23 లక్షల 20వేలను ఖర్చు చేసి  చంద్రబాబు ఇల్లును నిర్మించాడన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ విలువ పెరిగిందన్నారు. 2016-17లో కూడ తాము ఇంటి నిర్మాణం కోసం రూ. 2 కోట్లను ఖర్చు చేసిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. 

అమరావతిలోనే 29 గ్రామాల పరిధిలో హెరిటేజ్ కు ఎలాంటి భూములు లేవన్నారు. రాజదాని గ్రామాలకు 30 కి.మీ దూరంలో హెరిటేజ్ సంస్థకు భూములున్నాయన్నారు. 

2014 మార్చి 31వ తేదీన హెరిటేజ్ సంస్థ భూమిని కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతితో పాటు విశాఖలో కూడ భూములు కొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రంలో తమ కుటుంబానికి ఆస్తులు లేవని ఆయన తేల్చి చెప్పారు. హెరిటేజ్ కు భూములు ఉన్నాయన్నారు.