
నెల్లూరు మైనింగ్‌పై చైనా ‘డౌ’ పెత్తనం?: Anil Kumar Yadav
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యవస్థను 'డౌ' అనే ఒక చైనా జాతీయుడు శాసిస్తున్నాడని, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) అండదండలతోనే ఈ ముఠా దందా నడుస్తోందని వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మల్టీ ఎలిమెంట్' కంపెనీకి చెందిన 'డౌ' అనే చైనీయుడు స్థానిక మైనింగ్ సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తమ కంపెనీకే క్వార్ట్జ్ మెటీరియల్ ఇవ్వాలని, లేకపోతే అధికారుల ద్వారా మైన్లు బ్లాక్ చేయిస్తానని లోకల్ మైన్ ఓనర్లను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. వీపీఆర్ అండ చూసుకునే ఆ చైనీయుడు ఇంతలా రెచ్చిపోతున్నాడని, అసలు 'డౌ'తో స్థానిక నాయకుడు వీపీఆర్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఎంపీ తక్షణమే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.