సింపుల్ టెక్నిక్‌తో అద్భుతం చేసిన చెరకు రైతు.. మూడు రెట్లు పెంచుకున్న ఆదాయం

ట్రెంచ్ పద్ధతిలో చెరకు సాగుతో అద్భుత లాభాలు వస్తున్నాయి. దిగుబడి రెండింతలు అవుతున్నాయి. ఆదాయాలు మూడింతలు అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు ఈ విధానంలో అద్భుతం చేసి చూపించాడు. ఈ విధానంలో చెరకు నాటితే.. 23 అడుగులు పెరిగింది.
 

UP sugarcane farmers tripled income by adopting trench method

హైదరాబాద్: సంచార జీవితానికి చెక్ పెట్టడానికి మనిషి సాగును ఎంచుకున్నాడు. అప్పటి నుంచి వ్యవసాయం(Agriculture) చేసుకుంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు. అందుకే మానవ పరిణామంలో వ్యవసాయం కీలకమైనదిగా భావిస్తారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు విధానాల్లో కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అధిక దిగుబడినిచ్చే సాగు పద్ధతుల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన ఓ రైతు చెరుకు(Sugarcane) సాగులో అద్భుతం సృష్టించాడు.

ఉత్తరప్రదేశ్‌లో మొరదాబాద్‌లోని బిలారీ ప్రాంతానికి చెందిన రైతు మహమ్మద్ మోబిన్ తన చెరకు సాగులో కొత్త విధానాన్ని అవలంభించి పంటను దిగుబడిని రెండింతలు పెంచుకున్నాడు. దీంతో ఆదాయం మూడింతలు పెరిగింది. ఆయన ట్రెంచ్ విధానాన్ని అవలంభించారు. దీని ద్వారా ఆయన 23 అడుగుల పొడవైన చెరుకును పండించారు. అందుకే ఈ విధానం గురించి ఆయన ఎంతో ఆసక్తిగా చెబుతున్నారు. అంతేకాదు, తన తరహాలోనే ఇతర రైతులూ లబ్ది పొందాలని భావిస్తున్నారు. అందుకే ఇతరులూ ఈ ట్రెంచ్ విధానాన్ని అవలంభించాలని కోరుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంట అధికంగా పండిస్తారు. ముఖ్యంగా పశ్చిమ యూపీలో ఈ పంట అధికంగా ఉంటుంది. కానీ, రైతులు సనాతన పద్ధతుల్లోనే సాగు చేయడం మూలంగా దిగుబడులు పెరగడం లేదు. దీనికి పరిష్కారం చూడాలని మహమ్మద్ మోబిన్ భావించాడు. సాగులో కొత్త పద్ధతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆయన ట్రెంచ్ పద్ధతిని మొదలుపెట్టాడు. ఈ పద్ధతిలో ఆయన యూ ఆకారపు కందకాలు తవ్వాడు. కందకం లోతు 20 నుంచి 25 సెంటిమీటర్లు ఉండేట్టుగా చూసుకున్నాడు. లైన్‌ల మధ్య కనీసం 80 సెంటిమీటర్ల ఎడం ఉండేలా చూసుకున్నాడు. కందకాల మధ్యలో సాళ్లలో చెట్లను నాటాడు. ఇలా చెరకును నాటగా.. అది ఏపుగా పెరిగింది. గతంలో మోబిన్ ఒక బిగా భూమిలో 40 నుంచి 50 క్వింటాళ్ల చెరకు పంటను పండించాడు. కానీ, ఈ ట్రెంచ్ పద్ధతిలో సాగు దిగుబడిని 100 క్వింటాళ్లకు పెరిగింది.

ఈ పద్ధతి ఉప ఉష్ణమండలంలో చెరకు పండించే ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దీనికి కారణం ఈ పద్ధతిలో సాగుదారులు ఎక్కువగా దిగుబడి పొందడమే. ఈ పద్ధతిలో చెరకు మొక్కల మధ్య అంతర్ పంటలను పండించడానికి అవకాశం ఉంటుంది. ఈ అంతర్ పంటలుగా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు, తృణ ధాన్యాలను వేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios