ఆరుతడి పంటలతో అనూహ్య లాభాలు.. మిర్చితో మూడు నెలల్లో రూ. 6 లక్షల ఆదాయం.. ఈ రైతు సక్సెస్ స్టోరీ ఇదే

ప్రణాళికాబద్ధంగా పంటలు వేస్తూ.. తరుచూ మారుస్తూ ఆరుతడి పంటలు వేస్తే అనూహ్య లాభాలు వస్తాయని నిజామాబాద్‌కు చెందిన ఆదర్శ రైతు శంకర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఆయన గతేడాది మిర్చి పంట వేసి కేవలం మూడు నెలల్లోనే ఆరు లక్షల రాబడి సొంతం చేసుకున్నాడు. ఆయన సక్సెస్ స్టోరీ ఇదే.
 

nizamabad chillies farmer success story by chillies cultivation he gain lakhs

హైదరాబాద్: రైతులూ మార్కెట్‌నూ అంచనా వేస్తూ ఎప్పుడూ వేసే పంటనే కాకుండా తరుచూ మార్చుతూ ఆరుతడి పంటలు వేస్తే అనూహ్య లాభాలు గడించవచ్చు. ప్రణాళికాబద్దంగా సాగు చేస్తే లక్షలు సంపాదించడం సాధ్యమే. ఇందుకు నిజామాబాద్‌కు చెందిన శంకర్ అనే ఆదర్శ రైతే ఉదాహరణ. ఆయన అందుబాటులో ఉన్న టెక్నిక్‌లు, మెలకువలను అమలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం మూడు నెలల్లోనే ఆరు లక్షల రూపాయలు సంపాదించాడు.

నిజామాబాద్ కోటగిరి మండలం పొతంగల్ గ్రామానికి చెందిన వర్ని శంకర్ అనే రైతుకు పది ఎకరాల భూమి ఉన్నది. మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని తన ప్రణాళిక ప్రకారం పంట వేశాడు. ఐదు ఎకరాల్లో మిరప పంట, మూడున్నర ఎకరాల్లో టమాట, ఐదెకరాల్లో పొద్దు తిరుగుడు, రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆయన 20 ఏళ్లుగా మార్చి మార్చి పంటలు వేస్తున్నాడు. ఈ యేడు మిరపలో ఆధునిక దప్ధతిలో హౌబ్రీడ్ రకం నారు పోశాడు. నారు పెరిగిన తర్వాత పంట పొలంలో గెనెలు కొట్టి నాటారు. ఆ తర్వాత పాలిథీన్ కవర్ వేశాడు. దీంతో మిరప మొక్కకు చీడలు, పీడలను ఇది చాలా వరకు నివారించగలిగింది.

మిరప పంటను సాగు చేస్తే ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు పెట్టుకుంటే ఎకరానికి 35 నుంచి 40 టన్నుల దిగుబడి కూడా వస్తుంది.

ఈ పంట కాలం ఆరు నుంచి ఏడు నెలలు. బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తూ సస్యరక్షణ చేస్తే మంచి దిగుబడిద వస్తుంది. శంకర్ గతేడాది అక్టోబర్‌లో మిరప పంట వేశాడు. కేవలం రెండు నెలల్లోనే అంటే డిసెంబర్‌లో పచ్చి మిర్చి కోతకు వచ్చింది. ఎకరాకు ఇప్పటి వరకు 15 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సారి కొంచెం ఎక్కువగా తెగుళ్లు సోకడంతో నష్టం జరిగింది. అయినప్పటికీ మార్కెట్‌లో పచ్చి మిర్చికి మంచి డిమాండ్ వచ్చింది., దీంతో వ్యాపారుల ఏకంగా తన వ్యవసాయ క్షేత్రానికే వచ్చి కిలోకు రూ. 50 చొప్పున వెచ్చించి పంటను తీసుకెళ్లారు. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ. 6 లక్షల ఆదాయం వచ్చిందని శంకర్ వివరించాడు.

పచ్చి మిర్చి తెంపేందుకు ప్రతి రోజు ఆరుగురు కూలీలు అవసరం అవుతారు. మరో మూడు నెలల కాలం మిరప పంట కాస్తుంది. దీంతో ఇంకా 20 నుంచి 25 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని శంకర్ వివరించాడు. గత సంవత్సరం మే నెలలో మిర్చి వేయగా ఎకరానికి 25 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పటి మార్కెట్ ప్రకారం కిలోకు రూ. 25 నుంచి రూ. 30 పలుకింది. దీంతో పెట్టుబడులు పోను రూ. 5 లక్షల లాభం వచ్చినట్టు వివరించాడు.

శంకర్ 20 ఏళ్లుగా ఆరుతడి పంటలు వేస్తున్నాడు. వీటితో మంచి దిగుబడి.. రాబడి పొందుతున్నాడు. ప్రతియేటా మిర్చి, టమాట, పుచ్చకాయ, దోస, కీరదోస, బొప్పాయి పండిస్తున్నాడు. శంకర్‌ను 2016లో రాష్ట్రప్రభుత్వం ఉత్తమ రైతుగా గుర్తించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios