ఐదు ఇంజిన్లు, 295 వ్యాగన్లు, 3.5 కి.మీ పొడవు... ఈ ‘‘సూపర్ వాసుకి’’ రైలు గురించి తెలుసా (వీడియో)

3.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలు ‘‘సూపర్ వాసుకి’’ని ఇండియన్ రైల్వేస్ విజయవంతంగా పరీక్షించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగ్నేయ మధ్య రైల్వే ఈ పరీక్ష చేపట్టింది. 
 

First Published Aug 16, 2022, 9:57 PM IST | Last Updated Aug 16, 2022, 9:57 PM IST

ప్రపంచంలోనే పురాతన రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా.. నిత్యం కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తోన్న భారతీయ రైల్వేలు ఆధునిక సదుపాయాల కల్పన విషయంలోనూ వేగంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆధునిక సాంకేతికతల కారణంగా రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక సరకు రవాణా విషయంలోనూ భారతీయ రైల్వేలు ఇప్పటికే ఎన్నో ఘనతలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏకంగా 3.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలు ‘‘సూపర్ వాసుకి’’ని ఇండియన్ రైల్వేస్ విజయవంతంగా పరీక్షించింది. 

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగ్నేయ మధ్య రైల్వే ఈ పరీక్ష చేపట్టింది. దీనిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి కోర్బా వరకు సూపర్ వాసుకిని నడిపారు. మొత్తం ఐదు ఇంజిన్లు, 295 వ్యాగన్‌లతో 27 వేల టన్నుల బొగ్గును రవాణా చేశారు. ఇంత పెద్ద మొత్తంలో బొగ్గును రవాణా చేయడం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం 90 వ్యాగన్‌లతో 9000 టన్నుల బొగ్గును రవాణా చేస్తుండగా.. తాజాగా సూపర్ వాసుకి ద్వారా 27 వేల టన్నుల బొగ్గును పంపారు. గతేడాది కూడా వాసుకి, త్రిశూల్ పేర్లతో రైల్వే శాఖ పొడవైన సరకు రవాణా రైళ్లను నడిపింది. దేశ అవసరాలను దృష్టిలో వుంచుకుని ఈ తరహా రైళ్లను నడపాలని భారతీయ రైల్వే శాఖ భావిస్తోంది.