Asianet News TeluguAsianet News Telugu

దండి మార్చ్ లో గాంధీజీ వెనుక నడిచిన 81 సత్యాగ్రహిల్లో ఏకైక క్రిస్టియన్ టైటస్

భారతదేశ స్వాతంత్య్ర పోరాటం చేసినవారిలో కొందరు సమరయోధుల గురించి చాలా తక్కువ మందికే తెలుసని చెప్పాలి.

First Published Jul 9, 2022, 7:19 PM IST | Last Updated Jul 9, 2022, 7:19 PM IST

భారతదేశ స్వాతంత్య్ర పోరాటం చేసినవారిలో కొందరు సమరయోధుల గురించి చాలా తక్కువ మందికే తెలుసని చెప్పాలి. అలాంటి వారిలో మహాత్మాగాంధీ చేపట్టిన దండి మార్చ్‌లో ఆయన వెంట నడిచిన తేవర్తుండియిల్ టైటస్ ఒకరు. గాంధీజీ వెంట నడిచిన 81 మంది సత్యాగ్రహుల్లో ఆయన ఏకైక క్టిసియన్ టైటస్ మాత్రమే. ఈ క్రమంలో టైటస్ కూడా మిగిలినవారిలాగే పోలీసుల నుంచి ఎదురైన హింసను అనుభవించారు. దాదాపు నెల రోజుల పాటు ఎరవాడ జైలులో బంధిగా ఉన్నారు. 

కేరళలోని ప్రస్తుత పతనంతిట్టా జిల్లాలోని మారమన్ గ్రామంలో 1905లో టైటస్ జన్మించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టైటస్.. విద్యను పూర్తిచేసుకున్న తర్వాత ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందారు. అయితే అంతటితో ఆగిపోవద్దనే లక్ష్యంతో.. 100 రూపాయలు అప్పుగా తీసుకుని నార్త్ ఇండియా చేరుకున్నారు.అలహాబాద్‌లోని అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. కాలేజ్, హాస్టల్‌లో ఫీజు చెల్లించడానికి ఇన్‌స్టిట్యూట్‌లోని పొలాల్లో పనిచేశారు. డెయిరీ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పొందారు. 

ఆ తర్వాత అహ్మదాబాద్‌లో గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో డెయిరీ నిపుణిడిగా చేరారు. గాంధీజీని కలుసుకున్నారు. ఆశ్రమంలో నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ.. గాంధీజీ చెప్పిన పనులను టైటస్ పూర్తిచేసేవారు. గాంధీజీ చేపట్టిన దండియాత్రలో పాల్గొన్నారు.  1937లో గాంధీజీ కేరళకు వెళ్లిన సమయంలో..  మారమన్‌లో ఉన్న టైటస్ తండ్రిని పరామర్శించారు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి టైటస్ సబర్మతి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో కొత్త జంట కోసం గాంధీజీ తన సొంత గదిని ఖాళీ చేశారు.