ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన రాణి చెన్నమ్మ
ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన వీరవనిత కిత్తూరు మహారాణి చెన్నమ్మ.
ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన వీరవనిత కిత్తూరు మహారాణి చెన్నమ్మ. ఆమె 1778లో ఉత్తర కర్ణాటకలోని ప్రస్తుత బెల్గావి జిల్లాలోని కాకతి అనే చిన్న గ్రామంలో లింగాయత్ కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించింది. చెన్నమ్మకు దేశాయ్ యువరాజు మల్ల సర్జాతో వివాహం జరిగింది. తన భర్త అకాల మరణంతో.. చెన్నమ్మ తమ దత్తపుత్రుడు శివలింగప్పను కొత్త రాజుగా నియమించడానికి చర్యలు తీసుకుంది. అయితే, రాజుకు వారసులు ఎవరూ లేరని పేర్కొంటూ, ఈస్ట్ ఇండియన్ కంపెనీ వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చింది. అయితే, రాణి చెన్నమ్మ కంపెనీ ఆజ్ఞలను ధిక్కరిస్తూ.. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం సాగించింది.
1824లో ఈస్టిండియా కంపెనీ సైన్యానికి రాణి చెన్నమ్మ దళాల మధ్య భీకర పోరు జరిగింది. కంపెనీ సైన్యానికి అధిపతి అయిన సర్ జాన్ థాకరేను రాణి చెన్నమ్మ సేనాధిపతి బాలప్ప కాల్చి చంపారు. ఇద్దరు అగ్రశ్రేణి బ్రిటీష్ అధికారులను కూడా బంధించారు. ఒక్కసారిగా భారీ షాక్ తగిలిన ఆంగ్లేయులు చేసేదేమీ లేక కాల్పుల విరమణకు ముందుకొచ్చారు. చెన్నమ్మ ఈ ప్రతిపాదనను అంగీకరించి వారిని విడుదల చేసింది. అయితే, నమ్మకద్రోహమైన ఈస్ట్ ఇండియా కంపెనీ కిత్తూరుపై దాడి చేయడానికి మళ్లీ బలగాలను పంపింది. భీకర యుద్ధంలో రాణి చెన్నమ్మను బంధించి బైల్‌హోంకెల్ కోటలో ఉంచారు. రాణి సేనాధిపతి సంగొల్లి రాయన్న పట్టుబడి ఉరి తీయబడ్డారు. చెన్నమ్మ దత్తపుత్రుడిని కూడా అరెస్టు చేసి.. జైలులో బంధించారు. రాణి చెన్నమ్మ కోటలోనే మరణించి అమరవీరురాలైంది.