Asianet News TeluguAsianet News Telugu

స్వాతంత్ర మంత్రదండంగా మారిన అతని హాకీ స్టిక్

ఒక దేశం దాని ఆత్మాభిమానాన్ని, ప్రతిఘటనను కేవలం రాజకీయ, సాంస్కృతిక మార్గాల్లోనే కాదు.. సైన్స్, క్రీడల ద్వారా కూడా ప్రకటించవచ్చు. 

First Published Jun 17, 2022, 7:09 PM IST | Last Updated Jun 17, 2022, 7:10 PM IST

ఒక దేశం దాని ఆత్మాభిమానాన్ని, ప్రతిఘటనను కేవలం రాజకీయ, సాంస్కృతిక మార్గాల్లోనే కాదు.. సైన్స్, క్రీడల ద్వారా కూడా ప్రకటించవచ్చు. ఇందుకు ఉదాహరణ ధ్యాన్ చంద్ సారథ్యంలో భారత హాకీ టీం సాధించిన అద్భుత విజయాలను చెప్పుకోవచ్చు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు తాము అన్నింటిలోనూ భారతీయుల కంటే ఉన్నతులమని భావించే వారు. మేధో, కళా, క్రీడా, భౌతిక అధికారం వంటి అన్ని రంగాల్లోనూ తామే అధికులమనే భావనలో ఉండే వారు. భారతీయుల్లోనూ చాలా మంది ఈ ధోరణుల కారణంగా న్యూనతలోనూ ఉండేవారు. బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గెలుపు సాధించడం అసాధ్యమనే ఆలోచనలో కుంగి జాతీయ ఉద్యమం నుంచి వెలుపలికి వెళ్లినవారూ ఉన్నారు.

కానీ, ఇలాంటి సంక్లిష్ట సందర్భంలో భారత హాకీ టీం వరుసగా మూడు సార్లు ఒలింపిక్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించి భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయడమే కాదు.. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. ఈ అద్భుత విజయం వెనుక భారతీయులు ఎల్లప్పుడూ మననం చేసుకునే అద్భుత క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ఉన్నారు. ఆయన ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభతోనే 1928, 1932, 1936 సంవత్సరాల్లో భారత హాకీ టీం హ్యాట్రిక్ గోల్డ్ సాధించగలిగింది. ఈ విజయ పరంపర 1960ల వరకు కొనసాగింది. హాకీ ప్రపంచంలో భారత ఆధిక్యత ప్రదర్శించింది.

హొలాండ్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో 1928 ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం గిరిజన తెగకు చెందిన జైపాల్ సింగ్ ముండా సారథ్యంలో బరిలోకి దిగింది. ఆమ్‌స్టర్‌డాం వెళ్లడానికి ముందు టీం లండన్ చేరుకుని అక్కడ ఇంగ్లీష్ ఒలింపిక్ టీమ్‌ను ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మట్టికరిపించింది. ఇది భారత టీంలో ఎంతో విశ్వాసాన్ని నింపింది. ఒక దాని వెనుక ఒకటి నాలుగు యూరప్ అగ్ర దేశాలను ఒడించిన భారత్ ఆ ఒలింపిక్స్‌ ఫైన్‌లో మార్చి 28న ఆతిథ్య దేశం హొలాండ్ టీమ్‌తో తలపడింది. సుమారు 3 లక్షల మంది డచ్ పౌరులు తిలకిస్తున్న ఆ మ్యాచ్‌లో హొలాండ్ టీంపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధ్యాన్ చంద్ మెరుపులు కురిపించాడు. ఇండియా స్కోర్ చేసిన మొత్తం 29 గోల్స్‌లో 14 గోల్స్ ఆయనవే.