కృష్ణా నదిలో కార్తీక దీపాల వెలుగులు... భక్తులతో కళకళలాడుతున్న రామలింగేశ్వర ఆలయం
విజయవాడ : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీకమాసం నేటితో ముగియనుంది.
విజయవాడ : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీకమాసం నేటితో ముగియనుంది. గత నెలరోజులుగా పరమశివున్ని భక్తిశ్రద్దలతో కొలిచి దేవాలయాల్లో కార్తీక దీపారాధన చేసిన భక్తులు ఇవాళ తెల్లవారుజామునుండే దైవసన్నిధికి చేరుకుంటున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా తీరంలో వున్న దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పోలి పాడ్యమి సందర్భంగా కృష్ణానదిలో స్నానమాచరించి దైవదర్శనం చేసుకుంటున్నారు. అలాగే నదీతీరంలో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదిలోకి వదులుతున్నారు. ఇలా భక్తుల స్నానాలు, దీపారాధనతో కృష్ణాతీరం కళకళలాడుతోంది. కార్తీకమాసం చివరిరోజు కావడంతో కృష్ణా జిల్లా నాగాయలంకలో కృష్ణానది తీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ భక్తులతో నిండిపోయింది. పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరామలింగేశ్వర మండపంలో స్వామివారికి స్వయం అభిషేకాలు చేసుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు. భక్తుల శివనామస్మరణతో నదీతీరం, రామలింగేశ్వర ఆలయం మారుమోగుతోంది.